30 ఏళ్లు దాటగానే పిల్లలు కనే సామర్థ్యం తగ్గిపోతుందని, ఆశలు వదిలేసుకోవాలని చాలామంది చెబుతుంటారు. నేటి లైఫ్‌స్టైల్, అలవాట్లు సంతాన సమస్యలకు దారితీస్తున్నాయి. ఈ నేపథ్యంలో 70 ఏళ్ల బామ్మగారు పండంటి బిడ్డకు జన్మనిచ్చారంటే మీరు నమ్ముతారా? రాజస్థాన్ లో 70 ఏళ్లు పైబడిన ఓ వృద్ధ జంటకు బంగారం లాంటి బిడ్డ పుట్టాడు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది ముమ్మాటికి వాస్తవం. ఈ జంటకు పెళ్లై 54 ఏళ్లు అయ్యింది. పిల్లల్ని కనాలనే కోరిక ఇప్పటికి నెరవేరింది. దేశంలో అత్యంత ఎక్కువ వయసులో బిడ్డను కన్న వృద్ధ దంపతుల జాబితాలో ఈ జంట కూడా చేరిపోయింది.
తిరగని ఆస్పత్రి లేదు.. మొక్కని దేవుడు లేడు
ఎడారి రాష్ట్రానికి చెందిన గోపీచంద్(75) చంద్రావతి దేవికి 54 ఏళ్ల కిందట పెళ్లయ్యింది. సంసార జీవితం సంతోషంగానే ముందుకు సాగింది. కానీ ఒకటి, రెండు ఏండ్లు గడిచినా పిల్లలు కాలేదు. అవుతారు.. అవుతారు అని ఎదురు చూస్తూనే ఉన్నారు. ఏళ్లు గడిచినా.. వారి కోరిక తీరడం లేదు. పిల్లల కోసం పడరాని పాట్లు పడ్డారు. ఎన్నో ఆస్పత్రులు తిరిగారు. మరెన్నో మందులు వాడారు. కనిపించిన దేవుళ్లకు మొక్కారు. అయినా పిల్లలు కాలేదు. అయినా ఎక్కడో ఓ మూలన పిల్లలు అవుతారని కోరిక ఈ దంపతుల్లో దాగి ఉంది.
మూడో ప్రయత్నంలో గర్భందాల్చిన చంద్రావతి
దాదాపు ఏడాదిన్నర కిందట.. అల్వార్ లోని ఇన్-విట్రో ఫెర్టిలిటీ క్లినిక్‌ని గోపీచంద్ సంప్రదించాడు. పిల్లల కోసం తాము పడుతున్న తాపత్రయాన్ని అక్కడి డాక్టర్లకు వివరించాడు. ఆయన భార్యను డాక్టర్లు పరీక్షించారు. ఆమెకు తప్పకుండా పిల్లలు అవుతారని డాక్టర్లు చెప్పారు. ఈ మాటతో వారి ప్రాణం లేచి వచ్చినట్లు అయ్యింది. కానీ, ఈ వయసులో పిల్లల్ని కని మంచి చెడులు చూసుకోవాలంటే కష్టం. మరోసారి ఆలోచించుకోవాలని డాక్టర్లు సూచించారు. అయితే.. గుజరాత్ కు చెందిన 70 ఏండ్ల జీవుబెన్ వాలాభాయ్ రాబారి లాంటి వారు పిల్లల్ని కన్న విషయాన్ని గుర్తు చేశారు. అనంతరం చంద్రవతికి రెండు సార్లు IVF ద్వారా గర్భం వచ్చేందుకు డాక్టర్లు ప్రయత్నించారు. కానీ విఫలం అయ్యారు. మూడో ప్రయత్నంలో భాగంగా ఆమె గర్భం దాల్చింది. తాజాగా ఆమె పండంటి బాబుకు జన్మనిచ్చింది.
రాజస్థాన్ లో ఇదే తొలి కేసు
రెండుసార్లు IVF ద్వారా గర్భం దాల్చే ప్రక్రియ విఫలం కావడంతో ఇక వీరికి పిల్లలు కారని భావించినట్లు ఐవీఎఫ్ నిపుణుడు డాక్టర్ పంకజ్ గుప్తా తెలిపారు. చివరి సారిగా ప్రయత్నించి సక్సెస్ అయినట్లు చెప్పారు. ఓ వైపు సంతోషంగా ఉన్నా.. మరోవైపు తల్లి వయసు పెరిగిన కారణంగా భయం ఆవహించిందన్నారు. చివరకు ఆమె ఎలాంటి సమస్య లేకుండా పూర్తి ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనిచ్చినట్లు వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఈ వయస్సులో పిల్లలు పుట్టే సందర్భాలు చాలా అరుదుగా ఉంటాయని వెల్లడించారు. రాజస్థాన్‌లో 75 ఏళ్ల వృద్ధుడు, 70 ఏళ్ల వృద్ధురాలికి బిడ్డ పుట్టడం బహుశా ఇదే మొదటి కేసని డాక్టర్ పంకజ్ తెలిపారు.
సంతోషంలో మునిగి తేలుతున్న తండ్రి
భారత సైన్యంలో పని చేసిన గోపీచంద్.. బంగ్లాదేశ్ తో యుద్ధం సమయంలో కాలికి బుల్లెట్ తగిలి గాయపడ్డాడు. ఆయన తన బిడ్డను తొలిసారి చేతుల్లోకి తీసుకుని ఆనందాన్ని పట్టలేకపోయాడు. 1968 నుంచి ప్రయత్నిస్తుంటే ఇన్నాళ్లకు తమ కోరిక నెరవేరిందని సంతోషం వ్యక్తం చేశారు.
చంద్రవతే చివరి మహిళ
ఇంకా ఆశ్చర్యకర విషయం ఏంటంటే.. గోపీచంద్- చంద్రావతి దేవి IVF ద్వారా తల్లితండ్రులుగా మారిన చివరి భారతీయ వృద్ధజంట కావొచ్చు. ఈ సంవత్సరం జూలైలో అమలులోకి వచ్చిన కొత్త చట్టం 50 ఏళ్లు పైబడిన స్త్రీ, పురుషులకు IVF చికిత్స అందించడాన్ని నిషేధించింది. చట్టం అమలులోకి రాకముందే యంద్రావతి గర్భవతి అయ్యింది. తాజాగా బిడ్డకు జన్మనిచ్చింది. ఇక భారత్ లో బిడ్డకు జన్మనిచ్చిన అత్యంత వృద్ధురాలిగా ఏపీలోని గుంటూరుకు చెందిన 74 ఏండ్ల ఎర్రమట్టి మంగాయమ్మ నిలిచింది. IVF విధానం ద్వారా 2019లో కవల పిల్లలకు జన్మనిచ్చింది.
Also read: జున్నుపాలు అవసరమే లేని జున్ను రెసిపీ, కుక్కర్లో ఇలా వండేయచ్చు
Also read: పాలతో చేసిన టీ అతిగా తాగితే వచ్చే సైడ్ ఎఫెక్టులు ఇవే