ప్రభుత్వాలు ప్రజల అవసరాలకు అనుగుణంగా రోడ్ల విస్తరణ చేపడతాయి. ఇందుకోసం జరిగే పనుల్లో అడ్డుగా ఉన్న కట్టడాలు, నివాసాలను తొలగిస్తుంటారు. ఇళ్లు, దుకాణాలు కోల్పోయే వారికి నష్టపరిహారం చెల్లిస్తారు. పంజాబ్‌లో కూడా అదే జరిగింది. అయితే, ఓ రైతు తన ఇంటిని కూల్చేందుకు అస్సలు ఇష్టపడలేదు. ఎంతో ఇష్టంగా కట్టుకున్న ఇల్లు రోడ్డు విస్తరణలో కూల్చేస్తారని తెలియగానే.. గుండె బరువెక్కింది. తన కలల సౌధం నుంచి చిన్న ఇటుక కదిలినా తన గుండె ఆగుతుందని అధికారులకు చెప్పాడు. కానీ, వారు వినలేదు. నష్టపరిహారం ఇస్తామని చెప్పారు. కానీ, అతడు మనసు అందుకు అంగీకరించలేదు. దీంతో తానే.. తన ఇంటిని వెనక్కి జరుపుకుంటానని చెప్పేశాడు. ఆ మాట విని అధికారులు అవ్వక్కయ్యారు. అతడి మాటలు విని నవ్వుకున్నారు. కానీ, ఆ రైతు తాను అనుకున్నది చేసి చూపించాడు. తన రెండు అంతస్తుల భవనాన్ని 500 మీటర్లు వెనక్కి తరలించే పనిలో నిమగ్నమయ్యాడు. ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయినా అంత పెద్ద ఇంటిని అంత ఈజీగా వెనక్కి ఎలా తరలించగలిగాడు అనేగా మీ సందేహం? అయితే, మీరు ఆ వీడియోను చూడాల్సిందే. 


రహదారికి అడ్డంగా  డ్రీమ్ హౌస్


పంజాబ్ రాష్ట్రంలోని సంగ్ రూర్ జిల్లాకు చెందిన రైతు.. సుఖ్ విందర్ సింగ్ ఎంతో కష్టపడి నిర్మించుకున్న ఇంటిని కూల్చడం ఇష్టం లేక.. అక్కడి నుంచి పక్కకు తరలించే ప్రయత్నం చేస్తున్నాడు. రోషన్ వాలా గ్రామంలోని తన స్థలంలో ఆయన తన డ్రీమ్ హౌస్ ను కట్టుకున్నాడు.  ప్రస్తుతం ఆయన ఇల్లు కట్టుకున్న స్థలం మీదుగా   ఎక్స్‌ప్రెస్‌ వేను నిర్మిస్తుంది కేంద్ర ప్రభుత్వం. భారత్‌ మాల ప్రాజెక్ట్‌ లో భాగంగా ఈ రహదారిని ఏర్పాటు చేస్తున్నారు అధికారులు. ఈ హైవే ఢిల్లీ, అమృత్‌ సర్‌ కత్రా ఎక్స్‌ప్రెస్‌ వే మార్గంలో నిర్మిస్తున్నట్లు వెల్లడించారు.  ఈ రహదారి నిర్మాణం పూర్తయితే ఢిల్లీ- కత్రా మధ్య జర్నీ టైం చాలా తగ్గుతుంది. ఈ నేపథ్యంలో ఎక్స్ ప్రెస్ హైవేను హర్యానా, పంజాబ్, జమ్మూకాశ్మీర్ రాష్ట్రాలను కలుపుతూ నిర్మిస్తున్నారు.   


ఇంటిని తరలించాలని నిర్ణయం


ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికే భూ సేకరణ చేసింది.  రహదారికి అడ్డుగా ఉన్న సుఖ్‌ విందర్‌ సింగ్‌ ఇంటిని కూల్చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం నష్టపరిహారం కూడా అందించింది. అయితే.. ఆ రైతుకు మాత్రం ఆ ఇంటిని కూల్చడం అస్సలు ఇష్టం లేదు. ఎలాగైనా తన డ్రీమ్ హౌస్ ను కాపాడుకోవాలి అనుకున్నాడు. పునాదులతో సహా ఆ ఇంటిని మరో చోటుకు తీసుకెళ్లాలని భావించాడు. అనుకున్నదే ఆలస్యంగా భవన నిర్మాణ కార్మికులను, ఇంజినీర్లను తీసుకొచ్చాడు. అక్కడి నుంచి తన ఇంటిని సుమారు 500 అడుగుల దూరం తరలించాలని చెప్పాడు. ఆయన కోరిక మేరకు పునాదుల దగ్గర నుంచి ఇంటిని అమాంతం జాకీలతో పైకి లేపారు. భవనాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు చక్రాల్లాంటి కదిలే గేర్లను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు సుమారు 250 అడుగుల వరకు ఇంటిని తరలించారు.  


మరికొద్ది రోజుల్లో తరలింపు పూర్తి


ఈ ఇంటిని నిర్మించేందుకు సుమారు కోటిన్నర రూపాయలను ఖర్చు చేసినట్లు సుఖ్‌ విందర్‌ సింగ్‌  వెల్లడించారు. దీని నిర్మాణానికి రెండేళ్లకు పైగా సమయం పట్టిందన్నాడు. ఎన్నో వ్యయ ప్రయాసలను అధిగమించి.. కట్టుకున్న కలల ఇంటిని కూల్చేయడం తట్టుకోలేనన్నారు. అందుకే ఎంత కష్టం అయినా ఈ ఇంటిని కాపాడుకునేందకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. అందులో భాగంగా ఇంటిని తరలిస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే ఆ ప్రయత్నం సగం వరకు పూర్తయ్యిందని.. మరికొద్ది రోజుల్లోనే కంప్లీట్ అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశాడు. మరోవైపు ఢిల్లీ- అమృత్ సర్-కత్రా ఎక్స్ ప్రెస్ వే అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా పంజాబ్ సీఎం భగవత్ మాన్ ఇప్పటికే ప్రకటించారు. ఈ రహదారి మూలంగా కశ్మీర్ కు వెళ్లే ప్రయాణీకులకు టైంతో పాటు డబ్బు, ఎనర్జీ సేవ్ అవుతుందని చెప్పారు.


ఇంటిని జాకీలతో తరలిస్తున్న వీడియోను ఇక్కడ చూడండి:






Also Read: వాట్సాప్‌లో ఆ రంగుల హార్ట్ ఎమోజీలకు అర్థం తెలుసా? ఒక్కో కలర్‌కు ఒక్కో భావం!


Also Read: టాయిలెట్‌లో టైంపాస్? గంటలు గంటలు దానిపై కూర్చుంటే చెప్పుకోలేని రోగం వస్తుందట!