గత రెండేళ్లుగా ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న మహమ్మారి కరోనా నేటి యువతను ఇప్పట్లో  వదిలేట్టు లేదు. కరోనా మానసికంగా చూపించే ప్రభావాల గురించి ప్రపంచస్థాయి మనస్తత్వవేత్తలు, మనోరోగ వైద్యులు ఎన్నో అధ్యయనాలు, పరిశోధనలు చేస్తున్నారు. వారు చెప్పిన దాని ప్రకారం కరోనా వైరస్ వచ్చి తగ్గిన వారిలో ఆందోళన, నిరాశ అధికంగా పెరుగుతున్నాయి. న్యూయార్క్‌లో పనిచేస్తున్న సైకియాట్రిస్టు వాలెంటైన్ రైటేరి మాట్లాడుతూ ‘నేను, నా సహోద్యోగులు ఎప్పుడూ ఇంత బిజీగా లేము. కరోనా వచ్చాక మేము చాలా బిజీ అయిపోయాం. కరోనా నుంచి తేరుకున్న చాలా మంది డిప్రెషన్ తో మా దగ్గరికి వస్తున్నారు’ అని చెప్పారు. ది లాన్సెట్ మెడికల్ జర్నల్ లో ప్రచురించిన ఒక కథనంలో 2020లో 204 దేశాల్లో కరోనా నుంచి తేరుకున్న వారిలో మానసిక సమస్యల తీవ్రతపై అధ్యయనం జరిగింది.


షాకింగ్ ఫలితాలు
అధ్యయనంలో షాకింగ్ నిజాలు తెలిశాయి. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కారణంగా దాదాపు 53 మిలియన్ల మంది తీవ్రమైన డిప్రెసివ్ డిజార్డర్ బారిన పడినట్టు తెలిసింది. 76 మిలియన్ల మంది సాధారణ మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. కరోనా వల్ల శారీరకంగా, ఆర్థికంగానే కాదు మానసికంగానూ చాలా తీవ్రంగా నష్టపోయినట్టు అధ్యయన నివేదిక వెల్లడిస్తోంది. ఇప్పటికీ ప్రజలు సామాజిక దగ్గర కాలేకపోతున్నట్టు అధ్యయనం వెల్లడించింది.  సైక్రియాటిస్టు వాలెంటైన్ రైటెరి మాట్లాడుతూ ‘ప్రజల్లో సామాజిక దూరం మనుషుల మధ్యే కాదని మనసుల మధ్య కూడా చాలా పెరిగింది. ఎవరు కనిపించినా  కొద్దిసేపు అలా మాట్లాడి వెళ్లిపోతున్నారు. మనసు విప్పి భావాలు పంచుకోవడం తగ్గింది. ఈ పరిస్థితి మనసుపై, మెదడుపై భారాన్ని పెంచేస్తుంది’ అని ఆయన అభిప్రాయపడ్డారు. 


యూకేలోని కన్సల్టెంట్ క్లినికల్ సైకాలజిస్టు అలెక్స్ మాట్లాడుతూ యువతలో గత రెండేళ్లలో చాలా మానసిక మార్పులు వచ్చాయి. ఈ పరిస్థితి ఈ తరం మొత్తాన్ని వేధించొచ్చు. కరోనా వల్ల కలిగి మానసిక ఒత్తిడి పూర్తిగా కనుమరుగవ్వాలంటే కనీసం ఒక తరం (Generation) పడుతుందని, కాబట్టి ఆ తరంలోని యువత ఆ సమస్యలను భరించాల్సిందేనని చెప్పుకొచ్చారు. మరో సైకాలజిస్టు మాట్లాడుతు ‘నేటి యువతరమంతా కోవిడ్ ద్వారా ప్రభావితమైంది. రెండేళ్లు తిష్ట వేసుకుని కూర్చంది ఆ మహమ్మారి. దాని ప్రభావం గట్టిగానే ఉంటుంది’ అని వివరించారు. 


Also Read: మరణం తరువాత జీవితం ఉంటుందా? శాస్త్రవేత్తలు ఏమంటున్నారు?


Also Read: కన్నబిడ్డను ముట్టుకుంటే అలెర్జీ, ఈ తల్లి పరిస్థితి ఎవరికీ రాకూడదు