మనదేశంలో ప్రతి సంవత్సరం క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా మగవారిలో ప్రొస్టేట్ క్యాన్సర్ కేసులు  నమోదవుతున్నాయి. చాలా మందికి ఈ క్యాన్సర్ విషయంలో అవగాహన కూడా లేకపోవడంతో బాగా ముదిరాక కేసులు బయటపడతున్నాయి. అలాగే మగవారికి ఉన్న ఓ చెడు అలవాటు కూడా ఈ క్యాన్సర్ పెరిగిపోవడానికి కారణం అవుతుంది. 


ఏంటీ ఈ క్యాన్సర్?
ప్రొస్టేట్ అనేది మగవారికి మాత్రమే ఉండే గ్రంథి. ఇది వారి పునరుత్పత్తి వ్యవస్థలో భాగం. ఈ గ్రంథి మూత్రాశయం కింద ఉంటుంది. వాల్‌నట్ పరిమాణంలో ఉంటుంది. దీనికి క్యాన్సర్ సోకితే పునరుత్పత్తి వ్యవస్థతో పాటూ మూత్రాశయ వ్యవస్థ కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతుంది. ఈ క్యాన్సర్ వస్తే కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వీటిని తేలికగా తీసుకోకూడదు. 


లక్షణాలేంటి?
1. మూత్రం పోసేటప్పుడు నొప్పిగా, మంటగా అనిపిస్తుంది. దీన్ని చాలా మంది ఇన్ఫెక్షన్ వల్ల అనుకుంటారు. కానీ కొన్ని సార్లు అది క్యాన్సర్ వల్ల కూడా కలగవచ్చు. 
2. అకారణంగా శరీరభాగాల్లో నొప్పులు వస్తుంటాయి. 
3. వాంతులు అవ్వడం, వికారంగా అనిపించడం తరచూ జరుగుతుంటుంది. 
4. పొత్తికడుపు దగ్గర నొప్పి వస్తుంది. 
5. జ్వరం వచ్చే అవకాశం ఉంది. జ్వరం తగ్గడం, మళ్లీ రావడం జరుగుతుంటుంది. 
6. మూత్రంలో రక్తం కూడా కనిపించవచ్చు. 


వయసు 50 ఏళ్లు దాటిన వారికి ఈ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ. దీన్ని తొలిదశలోనే గుర్తిస్తే చికిత్స సులభతరం అవుతుంది. లేకుంటే  ఈ క్యాన్సర్ పక్క అవయవాలకు కూడా పాకి ప్రాణాంతకంగా మారిపోతుంది.  


ఎందుకొస్తుంది?
ప్రొస్టేట్ క్యాన్సర్ అత్యంత ప్రాణాంతకమైన నిశ్శబ్ధ వ్యాధులలో ఒకటి. ఇది రావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. కుటుంబ చరిత్రలో ఎవరికైనా ఉంటే వారసత్వంగా వచ్చే అవకాశం ఉంది. అలాగే ఊబకాయం వల్ల కూడా రావచ్చు. ముఖ్యంగా చెడు జీవనశైలి అలవాట్లు కూడా ప్రభావితం చేస్తాయి. జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ అధికంగా తినేవారికి కూడా ఈ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. 


ప్రాసెస్ చేసిన మాంసం వల్ల...
యూరోపియన్ యూరాలజీ జర్నల్ లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం అనారోగ్యకరమైన ఆహారం, ముఖ్యంగా ప్రాసెస్ చేసిన మాంసాన్ని తినడం వల్ల ప్రొస్టేట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరిగిపోతుంది. మీకు ఈ అలవాటు ఉంటే వెంటనే వదులుకోవడం ఉత్తమం. తాజా మాంసాన్ని తెచ్చుకుని వండడం మంచిది. ఆ అధ్యయనం కోసం దాదాపు 12000 మంది వ్యక్తుల జీవనశైలి అంశాలను సేకరించారు. ఎవరికైతే కుటుంబచరిత్రలో ప్రొస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందో వారు ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరచుకుంటే మరణ ప్రమాదాన్ని 45 శాతం తగ్గించుకోవచ్చని అధ్యయనం తేల్చింది. సరైన బరువును మెయింటేన్ చేయడం, వ్యాయామాలు చేయడం, ధూమపానానికి దూరంగా ఉండడం వల్ల ఈ క్యాన్సర్ రాకుండా అడ్డుకోవచ్చు. 


ఏం తినాలి?
ప్రొస్టేట్ క్యాన్సర్ అనేది శరీరంలోని హార్మోన్ల అసమతుల్యతకు తగ్గట్టు ప్రభావితమవుతుంది. కాబట్టి హార్మోన్ల అసమతుల్యత కాకుండా జాగ్రత్త పడాలి. ఆవుపాలలో ఈస్ట్రోజెన్ అధికంగా ఉంటుంది. ఇది ప్రొస్టేట్ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. కాబట్టి మగవారు ఆవు పాలను దూరంగా పెట్టాలి. ఈ క్యాన్సర్ రాకుండా అడ్డుకోవడంలో మీకు సహాయపడే సూపర్ ఫుడ్ లు ఇవే.


1. కొవ్వు పట్టిన చేపలు
2. టమోటాలు
3. బెర్రీ పండ్లు
వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉంటాయి. పురుషులు వీటిని రోజూ తింటే ప్రొస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశం తగ్గుతుంది. 


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు


Also read: నెయ్యి అన్నం ఇలా చేస్తే పిల్లలు వదలకుండా తినేస్తారు


Also read: తరచూ పండ్లు తినే వారిలో డిప్రెషన్ వచ్చే అవకాశం తక్కువ, చెబుతున్న కొత్త అధ్యయనం