సిజేరియన్ కన్నా సహజ ప్రసవం చాలా మంచిదని చెబుతారు వైద్యులు. భవిష్యత్తులో తల్లులకు ఎలాంటి సమస్యలు రావని అంటారు. శరీరంపై కోతతో చేసే సిజేరియన్ పోలిస్తే, సాధారణ ప్రసవం సహజంగానే మంచిది. అయితే సహజ ప్రసవం జరగడం ఇప్పుడంత సులభం కాదు. ఏడో నెల వచ్చినప్పటి నుంచే కొన్ని రకాల వ్యాయామాలు, నడక వంటివి చేస్తూ ఉండమని సలహా ఇస్తారు వైద్యులు. అలాగే ఆహారం విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే నార్మల్ డెలివరీ సులభంగా కావచ్చు. డెలివరీకి నెల రోజులు ఉందనగా కొన్ని రకాల ఆహారాలు తరచూ తినడం మొదలుపెట్టాలి.
పైనాపిల్
గర్భం దాల్చిన కొత్తలో వీటిని తినకూడదు. వీటి గర్భవిచ్చిత్తి అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఏడు నెలల దాటాకా మాత్రం ఎలాంటి భయం లేకుండా తినవచ్చు. కావాలంటే ఓ వైద్యుడి సలహా తీసుకుని మరీ తినవచ్చు. ఇది సహజప్రసవం అయ్యే అవకాశాన్ని పెంచుతుంది. ఈ పండులో బ్రోమేలైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది సహజ ప్రసవం అయ్యేందుకు శరీరాన్ని సిద్ధం చేస్తుంది. కాబట్టి ఎనిమిది నెలలు నిండాక దీన్ని తినడం ప్రారంభించండి.
`
పచ్చిబొప్పాయి
బొప్పాయి గర్భం ధరించిన మొదట్లో తినకూడదని అంటారు. అది నిజమే. కానీ డెలివరీకి సమయం సమీపిస్తున్నప్పుడు మాత్రం నిశ్చింతగా తినవచ్చు. పచ్చిబొప్పాయిని కూరగా వండుకుని తినవచ్చు. లేదా పప్పులో కలిపి వండుకుని తినవచ్చు. కానీ పండిన బొప్పాయి వల్ల మాత్రం ఏం ప్రయోజనం ఉండదు. అందుకే పచ్చిబొప్పాయితో వండుకునే వంటలను చేసుకుని తింటే ప్రసవం సుఖంగా అవుతుంది.
రాస్బెర్రీ ఆకు
ఎర్రని రాస్బెర్రీ పండ్లు తెలుసుగా. వాటి ఆకుల్లో కూడా సహజ ప్రసవాన్ని పెంచే గుణాలు ఉంటాయి. వాటి ఆకులతో టీ చేసుకుని తాగితే మంచి ఫలితం ఉంటుంది. ప్రసవానికి రెండు వారాల ముందు నుంచి దీంతో టీ చేసుకుని తాగడం మొదలుపెడితే మంచిది. తాగే ముందు వైద్యుల సలహా తీసుకోండి.
ఖర్జూరం
ఖర్జూరం మనకి విరివిగా దొరికే ఆహారమే. ఇది తింటే ఎంతో బలం కూడా. రోజూ ఉదయం రెండు ఖర్జూరాలు, సాయంత్రం రెండు ఖర్జూరాలు తప్పకుండా తింటే మంచిది. గర్భం దాల్చినప్పటి నుంచి తిన్నా బిడ్డ బలంగా, ఆరోగ్యంగా పుడతారు. ఇందులో చక్కెర అధికంగా ఉంటుంది. ఇది కూడా సహజ ప్రసవానికి సహకరిస్తుంది. అయితే కొంతమంది గర్భిణులు జెస్టేషనల్ డయాబెటిస్ బారిన పడతారు. ఇది గర్భంతో ఉన్నప్పుడు వచ్చే షుగర్ వ్యాధి. వారు మాత్రం ఖర్జూరాలకు దూరంగా ఉండాలి. ఈ షుగర్ వ్యాధి ప్రసవం అయ్యాక పోతుంది. చాలా తక్కువ మందిలో మాత్రం జీవితాంతం కంటిన్యూ అయిపోతుంది.
గమనిక:ఈ కథనంలో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. ఏదైనా వ్యాయామం లేదా డైట్‌లో మార్పులు చేయాలనుకుంటే తప్పకుండా మీరు వైద్యుడు, డైటీషియన్‌ను సంప్రదించాలి.