ఆఫీస్ పనుల వల్ల గంటల తరబడి కుర్చీలోనే కదలకుండా కూర్చొని ఉంటారు. దాని వల్ల నడుము నొప్పి వేధిస్తుంది. ప్రతి ఒక్కరు ఈ సమస్యని ఎదుర్కొంటూనే ఉంటున్నారు. దాని నుంచి ఉపశమనం పొందేందుకు ట్యాబ్లెట్స్ తీసుకోవడం, నొప్పి తగ్గేందుకు స్ప్రే‌లు ఉపయోగించడం చేస్తుంటారు. అలా కాకుండా వ్యాయామం ద్వారా కూడా ఈ నొప్పి నుంచి బయట పడొచ్చు.


నడుము నొప్పి తగ్గించుకునేందుకు ఫిజికల్ థెరపీ అందుబాటులో ఉంది. అయితే, ఇటీవల ‘పూల్ థెరపీ’ బాగా ట్రెండవ్వుతోంది. స్విమ్మింగ్ ఫూల్ నీటిలో నిలబడి వ్యాయామం చేస్తే నొప్పి నుంచి చాలా త్వరగా బయట పడొచ్చని నిపుణులు తెలుపుతున్నారు. దీంతో అంతా ఈ థెరపీ ఫాలో అయ్యేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీర్ఘకాలిక వెన్ను నొప్పి తగ్గించుకునేందుకు ఇది చక్కటి మార్గమట. ఫిజికల్ థెరపీ కంటే ఈ ఫూల్ థెరపీ అద్భుతమైన ప్రయోజనాలను ఇస్తుందని ఇటీవల జరిపిన ఓ అధ్యయనంలో తేలింది.


నడుము నొప్పితో బాధపడుతున్న సుమారు 113 మంది మీద ఈ ప్రయోగం చేశారు. వారిలో 18 నుంచి 65 సంవత్సరాల వయస్సు కలిగిన దీర్ఘకాలిక నడుము నొప్పితో బాధ పడుతున్న వాళ్ళు ఉన్నారు. వారిని రెండు గ్రూపులుగా విభజించారు. ఒక గ్రూపులోని వారికి 12 వారాల పాటు 60 నిమిషాలు ఫిజికల్ థెరపీ ఇచ్చారు. అలాగే మిగతా వాళ్ళకి ఫూల్ థెరపీ ఇచ్చారు. ఈ క్లినికల్ ట్రయల్స్ లో వారి శారీరక పనితీరు, వ్యాయామం, నిద్ర నాణ్యత పరిస్థితుల్లో కూడా గణనీయమైన మార్పులు గమనించారు. ఫిజికల్ థెరపీ పద్ధతుల కంటే ఫూల్ థెరపీ వ్యాయామం చేసిన వారిలో నొప్పి తగ్గుదల ఎక్కువగా ఉన్నట్టు గమనించారు.


ఏడాది తర్వాత కూడా వాళ్ళు అలాగే వ్యాయామం చేయడం వల్ల ఫిజికల్ థెరపీ తీసుకున్న రోగుల కంటే మెరుగ్గా ఉన్నారు. నీళ్ళలో వ్యాయామం చేయడం వాళ్ళ కండరాలు బలంగా అవుతాయి. ఇవి వెన్ను నొప్పిని తగ్గించేందుకు దోహదపడతాయి.


ఎలాంటి వ్యాయామాలు చెయ్యాలి


నడక: ఇది చాలా సులభమైన ప్రాథమిక వ్యాయామం. మీ నడుము వరకు నీటిలో ఉంచి నీటికి ఎదురుగా నడవాలి. కొలను చుట్టూ ఇలా నడిచేటప్పుడు మీ చేతులు కూడా ఊపుతూ ఉండాలి. నేల మీద ఎలా నడుస్తారో అలాగే నీటిలో కూడా నీటిలో కూడా నడవాలి. నీటిలో జాగింగ్ కూడా చెయ్యొచ్చు. ఒక వైపుకి వాలడం లేదా తేలడం చెయ్యకూడదు.


కికింగ్: ఈ వ్యాయామం చెయ్యడానికి ఫూల్ అంచుని ఒక చేత్తో పట్టుకుని మరొక చేతిని గాల్లోకి ఎత్తి సమాంతరంగా ఉంచాలి. డాల్ఫిన్ లాగా కాళ్లతో ఫూల్ అడుగు భాగాన్ని తన్నుతు ఉండాలి. మూడు కిక్ ల తర్వాత విశ్రాంతి తీసుకోవాలి. ఇలాగే పునరావృతం చెయ్యాలి. నడుము భాగంలో అసౌకర్యంగా అనిపిస్తే ఆపేయండి.


కాళ్లతో ఎక్సర్ సైజ్: నీటిలో ఒక కాలు వెనక్కి చాపి మరొక కాలు కొద్దిగా ముందుకు వంచుతూ చెయ్యాలి. చేతులు మాత్రం పైకి ఎత్తి పట్టి ఉంచాలి. ఇలా రెండు కాళ్ళు మార్చుకుంటూ చెయ్యాలి. కనీసం 30 సార్లు ఈ విధంగా చేస్తూ ఉండాలి. ఇదే కాదు స్విమ్మింగ్ చేయడం కూడా మంచిదే. నీటి మీద బోర్లా పడుకోకుండా వెల్లికిలి గా పడుకుని ఈత కొట్టొచ్చు.  


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. 


Also read: మనం రోజూ తినే ఆహారాలలో అలెర్జీకి కారణమయ్యేవి ఇవే


Also read: గర్భిణిలు కాకరకాయ తింటే చాలా సమస్యలు దరిచేరవు, మీ బిడ్డకోసమైనా తినండి