స్మార్ట్ ఫోన్ ఇప్పుడు అగ్గిపుల్ల స్వామి పాత్ర పోషిస్తోంది. భార్యభర్తలను విడగొడుతోంది. ఎందుకంటే.. ఈ రోజుల్లో అందరికీ సెల్ ఫోన్ ప్రపంచమైపోయింది. ఫోన్ చేతిలో లేకుండా పిల్లల నుంచి వృద్ధుల వరకు ఎవరికీ నిమిషం గడవడం లేదు. అందరూ ఫోన్లలో తలలు దూర్చి ఇంట్లో ఒకరి మాట ఒకరు వినిపించుకోవడం లేదనే ఒక కంప్లైంట్ అందరూ చేస్తున్నారు. ఇలాంటి కంప్లైంట్ ఎక్కువగా భార్యలు చెయ్యడం పరిపాటి. అయితే ఇలా భార్య మాటల మీద భర్తలు శ్రద్ధ పెట్టకపోతే వారి వివాహం ప్రమాదంలో పడే ప్రమాదం ఉందని సైకాలజిస్టులు హెచ్చరిస్తున్నారు.
మీ జీవిత భాగస్వామి మీతో ఏదో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నపుడు ఫోన్ చూస్తూ వినడం లేదా గేమ్ ఆడుతూ తల ఊపడం చేయ్యడం మానెయ్యమని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చెయ్యడాన్ని ఫబ్బింగ్ అంటారట. ఈ ఫబ్బింగ్ అనుబంధాల మధ్య చిచ్చు పెడుతోందని టర్కిష్ పరిశోధకులు అంటున్నారు.
మనం అత్యంత ప్రియమైన వారుగా భావించే వారు మనల్ని నిర్లక్ష్యం చేస్తున్నట్టు లేదా విస్మరిస్తున్న భావన కలిగితే అది అనుబంధాల మధ్య అపార్థాలకు దారి తీస్తుందని Nidge Omer Halisdemir విశ్వవిద్యాలయానికి చెందిన ఒక నిపుణుడు తన అభిప్రాయం తెలియజేశారు.
ఈ ఫబ్బింగ్ అనే పదం ఫోన్, స్నబ్బింగ్ అనే రెండు పదాల కలయిక. మీతో మాట్లాడుతున్న వారిని విస్మరించడం, పట్టించుకోకపోవడాన్ని స్నబ్బింగ్ అంటారు. ఈ విషయంగా ఇది వరకు జరిపిన పరిశోధనల్లో ఈ మోడ్రన్ ట్రెండ్ మానసిక ఆరోగ్యం మీద ప్రభావం చూపుతోందని తేల్చారు. అలాగే విద్యార్థుల్లో పనులు వాయిదా వెయ్యడానికి కూడా కారణం అవుతోందని నిపుణులు అంటున్నారు.
కుటుంబ సభ్యలు అంటే భార్యా లేదా భర్త, తల్లిదండ్రుల, పిల్లలు, తోబుట్టువులను చాలా ప్రియమైన వారిగా భావిస్తారు. 712 మంది పెద్దలలో ఫబ్బింగ్ అలవాట్లు వారి అనుబంధాల మీద ఎలాంటి ప్రభావం చూపుతున్నాయనే అంశాలపై డేటా సేకరించి ఎల్సెవియర్ జర్నల్ కంప్యూటర్స్ ఇన్ హ్యూమన్ బిహేవియర్‌లో ప్రచురించారు. ఇలా సేకరించిన డేటాలో సగం మంది సగటు వయసు 37 గా ఉన్న పురుషులదే. ఇందులో పాల్గొన్న వారిని వారి ఫబ్ అలవాట్లు, వారి కమ్యూనికేషన్ నైపుణ్యాలకు సంబంధించిన ప్రశ్నలు అడిగారు.
ఊరికే ఫబ్ చేసే వ్యక్తుల ఆత్మీయులు వారి అనుబంధం పట్ల విపరీతమైన అసంతృప్తితో ఉంటారని తెలిసింది. ఈ అధ్యయనం ఫలితాలను బట్టి ఫోన్ పక్కన పెట్టలేని వ్యక్తులకు అనుబంధాలు దూరమయ్యే ప్రమాదం చాలా ఎక్కువని అంటున్నారు పరిశోధకులు.
ప్రస్తుతం టెక్నాలజి విచ్చలవిడిగా అందుబాటులో ఉన్న సమాజం ప్రతీ చోట అత్యంత ఎక్కువగా కనిపిస్తున్న ప్రవర్తనా లోపం ఫబ్బింగ్ గా చెప్పుకోవచ్చు. ఈ పరిశోధనలో ముఖ్యంగా శృంగార భాగస్వాముల మధ్య అనుబంధం మీద టెక్నాలజీ ప్రభావాన్ని గురించి అధ్యయనం చేశారు. ఫబ్బింగ్ అలవాటున్న భాగస్వామి వల్ల తమకు సాన్నిహిత్యంలో లోపం ఉన్న భావన కలుగుతోందనే అభిప్రాయాన్ని చాలా మంది వెలువరించారు.
Also read : బ్రెయిన్ ఫాగ్ - కన్‌ప్యూజన్‌గా, పిచ్చి పిచ్చిగా బుర్ర తిరుగుతోందా? ఆ విటమిన్ లోపమే కారణం!
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial