పిల్లలు కలగక మనోవేదన అనుభవించే మహిళలకు ఇది కలవరపెట్టే విషయమే. అసలే తల్లిని కాలేకపోయానని బాధపడుతుంటే ఇప్పుడు పులి మీద పుట్రలా వారిలో గుండె పోటు వచ్చే అవకాశాలు ఎక్కువని చెబుతోంతి ఓ కొత్త అధ్యయనం. వంధ్యత్వ చరిత్ర (పిల్లల కలగకపోవడం) గుండె వైఫల్యంతో ముడిపడి ఉందని ఈ అధ్యయనం తేల్చింది. అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ జర్నల్ ఈ పరిశోధన తాలూకు ఫలితాన్ని ప్రచురించారు. మసాచుసెట్స్ జనరల్ ఆసుపత్రి వైద్యులు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. సాధారణ మహిళలతో పోలిస్తే పిల్లలు పుట్టని మహిళల్లో గుండె ఆగిపోయే ప్రమాదం 16 శాతం ఎక్కువట. 


అమెరికాలోని ప్రతి అయిదు మంది మహిళల్లో ఒకరు పిల్లలు కలగక ఇబ్బంది పడుతున్నారు. ఇంతవరకు వంధ్యత్వానికి, గుండె వైఫల్యానికి మధ్య సంబంధాన్ని ఎవరూ కనిపెట్టలేదు. ఇప్పుడు కొత్తగా ఆ విషయం బయటపడింది. ఈ అధ్యయనం కోసం 38,528 మంది మహిళలను ఎంచుకున్నారు. వారిపై 15 ఏళ్లుగా పరిశోధన చేశారు. వారిలో 14 శాతం మంది పిల్లలు కలగక వంధ్యత్వంతో బాధపడుతున్నట్టు తేలింది. పదిహేనేళ్ల తరువాత వారందరినీ పరిశీలించగా పిల్లలు పుట్టకపోవడం అనేది గుండె వైఫల్యంతో సంబంధాన్ని కలిగి ఉన్నట్టు తేలింది. దీనికి కారణం HFpEF పరిస్థితి. అంటే గుండె ఎడమవైపు ఉండే కండరం సరిగా రక్తాన్ని పంపు చేయలేదు. దాన్నే HFpEF అని సూక్షంగా పిలుస్తారు. 


పరిశోధకులు మాట్లాడుతూ ‘ఈ అధ్యయనం మాకు సవాలుతో కూడుకున్నదిగా మారింది. ఎందుకంటే HFpEF ఎలా అభివృద్ధి చెందుతుందో మాకు ఇంకా పూర్తిగా అర్థం కాలేదు. దానికి మంచి చికిత్స విధానాలు కూడా లేవు’ అని వివరించారు. ఒక మహిళకు పిల్లలు కలగలేదని తెలిస్తే వైద్యులు అదిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, ధూమపానం వంటి విషయాలలో జాగ్రత్తగా ఉండమని సూచిస్తారు. ఇప్పుడు గుండె ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోమని సలహా ఇవ్వాల్సి రావచ్చు. 


పిల్లలు కలగని మహిళలు ఆరోగ్య జాగ్రత్తల్లో భాగంగా అప్పుడప్పుడు గుండె వైద్యులను కలిసి చెక్ చేయించుకోవడం ఉత్తమం. అంతేకాదు గుండెకు బలాన్ని, శక్తిని ఇచ్చే ఆహారాన్ని తినాలి. రక్తనాళాల పూడికకు కారణమయ్యే ఆహారాలను దూరం పెట్టాలి. మానసిక ప్రశాంతతకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే గుండె వైఫల్యం నుంచి తప్పించుకోవచ్చు.


Also read: భూమి బావుంటేనే మనం బావుంటాం, భూమిని ఇలా కాపాడుకుందాం


Also read: ప్రపంచంలోనే ‘ఒంటరి ఇల్లు’, ఇప్పుడు అమ్మకానికి వచ్చింది, ధరెంతో తెలుసా?