భారతీయ ప్రధాన ఆహారం బియ్యమే. దీంతో పులావ్, బిర్యాని తయారు చేస్తారు. అయితే డయాబెటిస్ వచ్చిన వారికి మాత్రం అన్నం ఎక్కువగా తినకూడదని చెబుతారు. అది ఒక శాపమనే చెప్పాలి. ఎందుకంటే భారతీయ ఆహారంలో టేస్టీ వంటకాలన్నీ తయారయ్యేవి బియ్యంతోనే. ఏ టేస్టీ కర్రీని తినాలన్నా అన్నంతో జతగా తింటేనే ఆ రుచి తెలుస్తుంది. కానీ మధుమేహం ఉన్నవారు అన్నాన్ని చాలా వరకు తగ్గించాలని చెబుతారు వైద్యులు. అలాంటి వారికి ఇప్పుడు ఒక శుభవార్త. అసోంలో పండించే జోహా  రకం బియ్యాన్ని మధుమేహం ఉన్నవారు హ్యాపీగా తినవచ్చు. ఇది మధుమేహం నియంత్రించడంలో సహాయపడుతుందని కొత్త అధ్యయనం చెబుతోంది.


ఇంతవరకు ఉన్న బియ్యం రకాలన్నీ కూడా మధుమేహాన్ని పెంచేవే. కానీ అసోంలో పండిస్తున్న జోహా బియ్యం మాత్రం మధుమేహాన్ని నియంత్రించడానికి సహాయపడుతుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కి చెందిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ వారు చేసిన తాజా అధ్యయనంలో ఈ జోహా రకం వరి రక్తంలో గ్లూకోజ్‌ని పెరగకుండా తగ్గించడంలో ప్రభావంతంగా పనిచేస్తున్నట్టు కనుగొన్నారు. అందుకే మధుమేహం ఉన్నవారు ఈ రకం బియ్యాన్ని తినడం వల్ల వారికి మేలు జరుగుతుందని చెబుతున్నారు అధ్యయనకర్తలు.


నివేదికల ప్రకారం జోహా రకం బియ్యాన్ని తినే వ్యక్తుల్లో మధుమేహం, హృదయ సంబంధ వ్యాధులు తక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఇది శీతాకాలపు వరి. బియ్యపు గింజలు చాలా చిన్నగా ఉంటాయి. అసోంలోనే అధికంగా పండుతాయి. ఈ బియ్యం నుంచి ఒక రకమైన సువాసన కూడా వస్తుంది. ఈ బియ్యంలో రెండు అసంతృప్త కొవ్వు ఆమ్లాలు లినోలేయిక్ ఆమ్లం, లినోలెనిక్ ఆమ్లం ఉంటాయి. వీటిని ఒమెగా 6, ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు అంటారు. 


ఇతర రకాల బియ్యాలతో పోలిస్తే జోహా రైస్‌లో ఒమేగా6 ఆమ్లాలు సమతుల్య నిష్పత్తి లో కలిగి ఉంటాయి. ఈ బియ్యంతో తయారుచేసిన రైస్ బ్రాన్ ఆయిల్ కూడా ఆరోగ్యానికి మంచిది. ఈ బియ్యాన్ని అధికంగా ఆయిల్ తయారు చేయడానికి ఉపయోగిస్తారు. ఇది మధుమేహం నిర్వహణలో ప్రభావంతంగా పనిచేస్తుంది. ఈ బియ్యంలో ఫైబర్, మాంగనీస్, సెలీనియం, మెగ్నీషియం, బి విటమిన్లు, కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. మధుమేహం ఉన్నవారు ఈ బియ్యాన్ని అనేక రకాలుగా వండుకొని తినవచ్చు.  ఇది వారికి ఎంతో శక్తిని అందిస్తుంది. 




Also read: పురుష ఉద్యోగులతో పోలిస్తే మహిళా ఉద్యోగుల మానసిక స్థితి దిగజారుతోంది


Also read: చీజ్ పౌడర్ ఇలా ఇంట్లోనే తయారు చేసుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు
































































































































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.