చాలా ఏళ్లుగా వ్యక్తి ఎత్తుకు, రాబోయే వ్యాధులుకు మధ్య సంబంధాన్ని కనుక్కోవడానికి అధ్యయనాలు, పరిశోధనలు జరుగుతున్నాయి. ఎత్తు ఎక్కువగా ఉండే వ్యక్తులకు వచ్చే జబ్బులు, తక్కువ ఉండే వ్యక్తులకు వచ్చే జబ్బులను అంచనా వేసేందుకు ఎంతో మంది పరిశోధకులు కష్టపడుతున్నారు. అలా కొన్ని జబ్బులు పొడవుగా ఉన్నవారికి వచ్చే అవకాశం ఉన్నట్టు తేలింది. అందులో ఎత్తుగా ఉన్నవారిలో గుండె జబ్బులు, అల్జీమర్స్ వంటి వ్యాధులు త్వరగా వచ్చే ఛాన్సు ఉన్నట్టు తేలింది. ఇక పొట్టిగా ఉండే వారిలో టైప్2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. 


ఎత్తు ఒక్కటే కారణమా?
అయితే పరిశోధనల్లో ఎత్తు ఒక్కటే ఈ జబ్బులు రావడానికి కారణమా లేక పోషకాహార, పర్యావరణ కారకాలు కూడా ఉన్నాయా అన్న విషయాలను పరిశోధనలు స్పష్టంగా చెప్పలేకపోయాయి. అయితే రాకీ మౌంటైన్ రీజినల్ వీఎ మెడికల్ సెంటర్ కు చెందిన పరిశోధకులు ఒక వ్యక్తి ఎత్తుతో ముడిపడిన జన్యు విశ్లేషణను శోధించారు. పొడవుగా ఉన్నవారిలో గుండెలయ తప్పటం, కాలి సిరల్లో రక్తం గడ్డం కట్టడం వంటి ముప్పు అధికమేనని తెలిసింది. అలాగే వీరిలో హైబీపీ, అధిక కొలెస్ట్రాల్ ప్రమాదం కూడా పొంచి ఉంటుందని కనుగొన్నారు. అలాగే కాళ్లు, చేతుల్లో నాడులు దెబ్బతినే అవకాశం కూడా ఉందని గుర్తించారు. దీన్ని బట్టి చూస్తే పొడవుగా  ఉన్న వారు ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. 


పొడవాటి వ్యక్తికి కొన్ని వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ, అలా ఎందుకని అడిగినప్పుడు నిపుణులు ఈ విధంగా సమాధానం ఇచ్చారు... ‘జీవక్రియ, శరీర ప్రాథమిక ప్రక్రియలు ఎత్తుకు సంబంధించినవి. ఇవి ఆరోగ్యానికి సంబంధించిన అనే అంశాలతో అనుసంధానించి ఉండడంతో పెద్ద ఆశ్చర్యం లేదు’ అని అన్నారు. తమ పరిశోధనల్లో ఎత్తుగా ఉండడం ప్రమాదకారకంగా గుర్తించామని చెప్పారు. 


గత అధ్యయనాల్లో కూడా ఎత్తు ఎక్కువగా ఉన్నవాళ్లకే వందకు పైగా రోగాలు వచ్చే అవకాశం అధికంగా ఉన్నట్టు తేలింది. గతంలో దాదాపు రెండున్నర లక్షల మంది పురుషులు,స్త్రీలపై పరిశోధన సాగింది. వారందరి ఎత్తు 5.9 అడుగులు లేదా అంతకన్నా ఎక్కువ ఉన్నవారే. వీరిలో ఎముక ఇన్ఫెక్షన్లు, చర్మ ఇన్ఫెక్షన్లు, రక్తం గడ్డటం వంటి సమస్యలు వారిలో ఎక్కువగా కలుగుతున్నట్టు గుర్తించారు. 


స్త్రీలలో...
5.3 అడుగుల కన్నా అధిక ఎత్తు ఉన్న స్త్రీలు ఆస్తమా బారిన పడే అవకాశం అధికంగా ఉన్నట్టు ఆ అధ్యయనంలో తేలింది. ఏది ఏమైనా ఆరోగ్యకరమైన జీవనశైలి ద్వారా ఇలాంటి సమస్యలను కచ్చితంగా తప్పించుకోవచ్చని సూచిస్తున్నారు అధ్యయనకర్తలు.  


Also read: వెంట్రుకలు పీక్కుంటున్నారా? అది అలవాటు కాదు రోగం, ఆ రోగానికి కారణాలు ఇవే


Also read: నువ్వుల నూనెతో వండిన వంటలు తింటే మగవారికెంతో లాభం