నువ్వుల నూనెతో వంటలు చేస్తూ రుచి బాగోదని చాలా మంది భావిస్తుంటారు. అంతేకాదు వాసన కూడా కాస్త భిన్నంగా ఉంటుంది. రుచి, వాసన కోసం తినడం మానేస్తే చాలా నష్టపోయినట్టే. ముఖ్యంగా మగవారు. నిజానికి నువ్వుల నూనెలో వండిన వంటలు రెండు రోజులు తింటే త్వరగానే అలవాటయిపోతాయి. నువ్వులను గానుగలో ఆడించి తీసే ఆర్గానిక్ నువ్వుల నూనె ఎక్కడైనా దొరికితే కొని ఇంటికి తెచ్చుకోండి. మగవారు కనీసం ఒక స్పూను నువ్వుల నూనెను ఆహారంలో కలుపుకుని తింటే మంచిది. వీర్య కణాలు వృద్ధి చెందుతాయి. స్పెర్మ్ కౌంట్ తగ్గితే సంతానోత్పత్తి సామర్ధ్యం తగ్గిపోతుంది. అలాగే స్పెర్మ్ నాణ్యత కూడా పెరుగుతుంది. బిడ్డ ఆరోగ్యకరమైన డీఎన్ఏ తో పుట్టడానికి ఇది చాలా అవసరం. 


వారికే కాదు...
కేవలం మగవారికే కాదు ఆడవారికి కూడా నువ్వుల నూనె చాలా మేలు చేస్తుంది. సమయానికి రుతుస్రావం వచ్చేలా చేస్తుంది. అంతే కాదు ఆ సమయంలో వచ్చే సమస్యలను తగ్గిస్తుంది. అంతేకాదు చర్మవ్యాధులు, వాతం వంటివి రాకుండా అడ్డుకుంటుంది. కంటి చూపును మెరుగుపరచడంలో కూడా నువ్వుల నూనెలోని పోషకాలు మేలు చేస్తాయి. స్త్రీల జుట్టును ఆరోగ్యంగా మెరిసేలా చేస్తుంది. పిల్లలకు నువ్వుల నూనెతో వండిన ఆహారాన్ని పెట్టడం వల్ల వారి దేహం పుష్టిగా మారుతుంది. ఈ నూనెలో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి చిన్నారులకు నువ్వుల నూనె వంటలు తినిపించడం చాలా మంచిది. ఈ నూనెలో కాపర్, జింక్, ఐరన్, మెగ్నిషియం వంటి పోషకాలు ఉంటాయి. 


దీపారాధనకే కాదు...
చాలా మంది నువ్వుల నూనె దీపారాధనకు మాత్రమే ఉపయోగిస్తారు. దీన్ని వంటలకు ఉపయోగించే వారు చాలా తక్కువ. నువ్వుల నూనెను ఆయుర్వేద మందులలో, కాస్మోటిక్స్ తయారీలలో వీటిని వాడతారు. ఈ నూనెను తలకు పట్టించినా మంచిదే. తెల్ల జుట్టు రావడం తగ్గుతుంది. అదే శరీరానికి రాసుకుంటే చర్మ వ్యాధులు రాకుండా ఉంటాయి. 


ప్రసవం అయ్యాక బాలింతలకు నువ్వుల నూనెతో వండిన వంటకాలను తినిపిస్తుంటారు. దీని వల్ల తల్లి పాల ద్వారా బలమైన పోషకాలు బిడ్డను చేరుతాయి. బిడ్డ మెడ త్వరగా నిలబడడమే కాదు, ఎదుగుదల కూడా బావుంటుంది. అందుకే ప్రసవం అయ్యాక దాదాపు నాలుగు నెలల పాటూ నువ్వుల నూనెతో వండిన వంటలే తినిపిస్తారు.


Also read: మటన్ నిల్వ పచ్చడి, ఇలా చేస్తే ఆరునెలలైనా తాజాగా ఉంటుంది


Also read: పిల్లల కోసం మ్యాగీని ఇలా వండి హెల్తీ మీల్‌గా మార్చేయండి