మ్యాగీ పిల్లలకు హాట్ ఫేవరేట్ పుడ్‌గా మారిపోయింది.రోజూ పెట్టినా విసుక్కోకుండా తినే పిల్లలు ఎంతోమంది. దీన్ని తయారు చేయడం చాలా సులభం కనుక తల్లులు కూడా ప్యాకెట్ల కొద్దీ కొని ఇంట్లో పెడతారు. అయితే కేవలం మ్యాగీనే తినడం వల్ల పిల్లలకు అందే పోషకాలు తక్కువే. దాన్ని హెల్తీ మీల్‌గా మార్చాలంటే కొన్ని పదార్థాలు జత చేరిస్తే చాలు. మ్యాగీని రోజూ తినిపించడం మంచిది కాదు. కాబట్టి ఇలా మార్పులు చేసి, మరొకొన్ని ఆరోగ్యాన్నందించే పదార్థాలను కలపడం వల్ల పోషకాలు పుష్కలంగా అందే అవకాశం ఉంది. 


వెజ్ మ్యాగీ
మ్యాగీని చేసేటప్పుడు నీళ్లు, మ్యాగీ, మ్యాగీ మసాలా తప్ప ఇంకేం వేయడం లేదా? అది తిన్నా తినకపోయినా ఒకటే. అందులో క్యారెట్లు, బంగాళాదుంప ముక్కలు, బీన్స్, పచ్చి బఠాణీ వంటివి కలిపి పెడితే ఉపయోగం ఉంటుంది. కూరగాయ ముక్కల శాతాన్ని పెంచి మ్యాగీ నూడుల్స్ ను తగ్గించండి. ఇలా చేయడం వల్ల పిల్లలు నూడుల్స్ తిన్నట్టు ఫీలవుతారు, వారికి పోషకాలు కూడా అందుతాయి. 


ఎగ్ మ్యాగీ
కోడిగుడ్డు, మిరియాల పొడి, మ్యాగీ, మ్యాగీ మసాలా ప్యాకెట్, ఉప్పు... వీటితో కూడా టేస్టీ ఎగ్ మ్యాగీ చేయచ్చు. మ్యాగీని ఎప్పటిలాగే వండేసి పక్కన పెట్టుకోండి. గుడ్డును బుర్జీలా చేసి మిరియాల పొడి చల్లాలి. దీన్ని సర్వ్ చేసే ముందు మ్యాగీ పై గుమ్మరించేయాలి. అంతే టేస్టీ ఎగ్ మ్యాగీ రెడీ. ఎగ్ లో ఉండే పోషకాలన్నీ శరీరంలో చేరుతాయి. 


చికెన్ మ్యాగీ 
చికెన్ ముక్కలను కోసుకుని వాటిని ఉడకబెట్టి రెడీగా ఉంచుకోవాలి. ఉడకబెట్టేప్పుడు కాస్త ఉప్పు, పసుపు వేసి ఉడకబెట్టుకోవాలి. మ్యాగీని వేరుగా వండి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి అందులో చికెన్, క్యాప్సికమ్, ఉల్లిపాయలు, మిరియాల పొడి వేసి బాగా వేయించి మ్యాగీపై వేసి సర్వ్ చేయాలి. 


చీజ్ మ్యాగీ
చీజ్ మ్యాగీ చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చి బఠానీ, క్యారెట్ ముక్కలు, ఉల్లిపాయలు, పచ్చి మిర్చి అన్నీ వేయించి నీళ్లు పోసి మ్యాగీ ముక్కలు వేయాలి. అందులో కాస్త ఉప్పు, మ్యాగీ మసాలా కూడా కలపాలి. అంతా రెడీ అయ్యాక ఒక కప్పులోకి తీసుకుని పైన చీజ్ ను తురిమి నిండుగా వేయాలి. దాన్ని ఓవెన్లో కాసేపు పెడితే చీజ్ కరిగి మ్యాగీలో కలుస్తుంది. అది తింటే అదిరిపోతుంది. 


మ్యాగీని పోషకాలతో నించే చాలా సింపుల్ రెసిపీలు ఇవన్నీ. అయితే రోజూ మ్యాగీ తినిపించడం మాత్రం మంచిది కాదు. కాబట్టి వారానికోసారి ఇలా చేసి పెట్టండి. పిల్లలు ఇష్టంగా తింటారు. 


Also read: మూడ్ బాగోలేదా? వెంటనే ఓ చాక్లెట్‌ ముక్కను నోట్లో వేసుకోండి



Also read: మిస్ ఇండియా 2022గా సినీ శెట్టి, నాట్యమే ప్రాణమంటున్న అందాల రాణి