భారత వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్ ప్రస్తుతం తన కెరీర్ పీక్ ఫాంలో ఉన్నాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఎడ్జ్‌బాస్టన్ టెస్టు మ్యాచ్‌లో కొత్త రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో పంత్ 146 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. రెండో ఇన్నింగ్స్ కూడా పంత్ అర్థ సెంచరీ (57) సాధించాడు. దీంతో ఈ మ్యాచ్‌లో మొత్తం 203 పరుగులను పంత్ చేసినట్లు అయింది. ఆసియా బయట ఒక భారత వికెట్ కీపర్ చేసిన అత్యధిక స్కోరు ఇదే.
69 సంవత్సరాల క్రితం 1953లో వెస్టిండీస్‌పై విజయ్ మంజ్రేకర్ చేసిన 161 పరుగులే ఇంతకుముందు వరకు రికార్డుగా ఉండేది. ఇప్పుడు దాన్ని కూడా పంత్ బద్దలు కొట్టాడు. ఇక ఇంగ్లండ్‌లో ఒక టెస్టు మ్యాచ్‌లో పర్యాటక జట్టు వికెట్ కీపర్ చేసిన అత్యధిక పరుగులు ఇవే. 1950లో వెస్టిండీస్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ క్లైడ్ వాల్‌కాట్ 182 పరుగుల రికార్డును కూడా పంత్ బద్దలు కొట్టాడు.
ఇన్ని రికార్డులు సాధించిన పంత్ కెరీర్ ప్రారంభం అయి ప్రస్తుతానికి నాలుగు సంవత్సరాలు మాత్రమే అవుతుంది. మహేంద్ర సింగ్ ధోని సహా ఎందరో హేమాహేమీల రికార్డులను పంత్ బద్దలు కొడుతున్నాడు. ఒకే మ్యాచ్‌లో సెంచరీ, అర్థ సెంచరీ సాధించిన రెండో భారతీయ వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్ నిలిచాడు. 1973లో ఫరూక్ ఇంజనీర్ ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లోనే మొదటి ఇన్నింగ్స్‌లో 121, రెండో ఇన్నింగ్స్‌లో 66 పరుగులు సాధించాడు.
పంత్ హీరోచిత ఇన్నింగ్స్ మ్యాచ్‌లో భారత్‌ను ముందంజలో నిలిపింది. టీమిండియా లీడ్ 350 పరుగులు దాటింది. ఈ మ్యాచ్ విజయం సాధిస్తే టీమిండియా సిరీస్‌ను ఏకంగా 3-1 తేడాతో గెలుచుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఈ సిరీస్‌లో ఇండియానే 2-1తో లీడ్‌లో ఉంది. ఈ సిరీస్‌ను టీమిండియా గెలిస్తే 2007లో ద్రవిడ్ బృందం తర్వాత ఇంగ్లండ్‌లో సిరీస్ విజయం సాధించిన ఘనతను ప్రస్తుత టీమిండియా గెలుచుకోనుంది.