ఐదో టెస్టులో టీమిండియా విజయానికి మరింత చేరువైంది. నాలుగో రోజు లంచ్ సమయానికి ఏడు వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. దీంతో మొత్తం ఆధిక్యం 361 పరుగులకు చేరుకుంది. ఇంకో మూడు వికెట్లు చేతిలో ఉన్నాయి. క్రీజులో రవీంద్ర జడేజా (17 బ్యాటింగ్: 36 బంతుల్లో, ఒక ఫోర్), మహ్మద్ షమీ (13 బ్యాటింగ్: 12 బంతుల్లో, రెండు ఫోర్లు) ఉన్నారు. వీరిద్దరూ స్కోరును 300 వరకు లాగినా, మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యం 132 పరుగులతో కలిపి మొత్తం లీడ్ 432 పరుగులకు చేరనుంది. కాబట్టి వీరు వీలైనంత వేగంగా ఆడితే మంచిది.


125-3 ఓవర్‌నైట్ స్కోరుతో బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా ఆరంభంలోనే మరో వికెట్ కోల్పోయింది. అర్థ సెంచరీ చేసి ఫాంలోకి వచ్చిన పుజారాను (66: 168 బంతుల్లో, రెండు ఫోర్లు) స్టువర్ట్ బ్రాడ్ అవుట్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన శ్రేయస్ అయ్యర్ (19: 26 బంతుల్లో, మూడు వికెట్లు) వేగంగా ఆడే క్రమంలో అవుటయ్యాడు. అర్థ సెంచరీ పూర్తి చేసిన పంత్ (57: 86 బంతుల్లో, 8 ఫోర్లు) కూడా కాసేపటికే అవుటయ్యాడు. దీంతో టీమిండియా 198 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. ఆ వెంటనే శార్దూల్ ఠాకూర్ (4: 26 బంతుల్లో) కూడా అవుటయ్యాడు.


షమీ, రవీంద్ర జడేజా మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడటంతో భారత్ 229-7 స్కోరుతో లంచ్‌కు వెళ్లింది. ప్రస్తుతం భారత్ ఆధిక్యం 361 పరుగులుగా ఉంది. వీరిద్దరూ ఎంత సేపు క్రీజులో నిలబడతారనే దానిపైనే టీమిండియా విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. ఇంగ్లండ్ బౌలర్లలో స్టువర్ట్ బ్రాడ్, మాథ్యూ పాట్స్ రెండేసి వికెట్లు తీసుకున్నారు. జేమ్స్ అండర్సన్, జాక్ లీచ్, బెన్ స్టోక్స్ తలో వికెట్ దక్కించుకున్నారు.