కొంతమంది ఏదో ఆలోచిస్తూ జుట్టు పీక్కుంటారు, చేతిలోకి వెంట్రుకలు తెగి వచ్చినా పట్టించుకోరు. మరొకొందరు ఒక్కో వెంట్రుకలను పట్టి లాగేసి పడేస్తుంటారు. అదేదో టైమ్ పాస్ పనిలా ఫీలవుతుంటారు, కానీ ఈ అలవాటు మానసిక రోగాలకు సంకేతం అని మాత్రం అర్థం చేసుకోరు. జుట్టు అతిగా పీక్కునే వారిని కచ్చితంగా ఓసారి మానసిక వైద్యులకు చూపించాల్సిందే.
ఇదే ఆ రోగం
ఇలా జుట్టు పీక్కోడాన్ని హెయిర్ పుల్లింగ్ డిజార్డర్ లేదా ట్రైకోటిల్లోమానియా అంటారు. ఇదొక మానసిక రుగ్మత. అతడను తల, లేదా కనుబొమ్మలు ఇలా జుట్టు పెరుగుదల ఉన్న చోట వెంట్రుకలను తెంపడానికి ప్రయత్నిస్తాడు. ఈ డిజార్డర్ తో బాధపడుతున్న వ్యక్తులకు వెంట్రుకలను తెంపాలన్న కోరిక విపరీతంగా ఉంటుంది. కొంతమందికి ఈ డిజార్డర్ వల్ల బట్టతల కూడా వచ్చేస్తుంది. కొంతమందిలో ఈ డిజార్దర్ తేలికపాటిగా ఉండొచ్చు, మరికొందరిలో తీవ్రంగా ఉండొచ్చు. అంతేకాదు ఈ డిజార్డర్ ఉన్న వారు గోళ్లు, పెదాలు కూడా అధికంగా కొరుకుతూ ఉంటారు. జుట్టు పీకడం నొప్పితో కూడుకున్నదే అయినా అది వారికి ఆహ్లాదంగా అనిపిస్తుంది. అంతేకాదు కొంతమంది పీక్కున్న జుట్టును తింటారు కూడా.
ఈ డిజార్డర్ ఎందుకు వస్తుంది?
1. ఒత్తిడి ఒక కారణంగా భావించవచ్చు. ఒత్తిడి బారిన పడిన వ్యక్తి జుట్టును లాగడం ప్రారంభిస్తారు. ముందు అప్పుడప్పుడు వెంట్రుకలు తెంపే వ్యక్తి కాల క్రమేణా దీన్ని అలవాటుగా మార్చుకుంటాడు.
2. తీవ్రమైన భావోద్వేగాల బారిన పడిన వ్యక్తి కూడా ఇలా జుట్టు పీక్కునే అలవాటు బారిన పడొచ్చు. తీవ్ర భావోద్వేగాలను అనుభవించినప్పుడు ఇలా చాలా మంది జుట్టు పీకేసుకుంటారు.
3. మానసిక ఆందోళనలు అధికంగా ఉన్నప్పుడు కూడా ఇలా జరుగుతుంది. తీవ్రమైన నిరాశ, పోస్ట్ ట్రమాటిక్ స్ట్రెస్ డిజార్డర్ లో బాధపడుతున్న వ్యక్తులకు ఈ డిజార్డర్ వచ్చే అవకాశం ఉంది.
దీని వల్ల వచ్చే సమస్యలు
1. వెంట్రుకలు అలా బలవంతంగా పీకేయడం వల్ల తలపై ఉన్న చర్మానికి నష్టం జరుగుతుంది. జుట్టు కూడా పలుచబడి పోతుంది. ఇది అలెర్జీలకు దారి తీస్తుంది. జుట్టు పెరుగుదల కూడా తగ్గిపోతుంది.
2. జుట్టును నిరంతరం పీకేయడం వల్ల జుట్టు పలుచబడి పోతుంది. బట్టతలలా కనిపిస్తుంది. దీని వల్ల నలుగురిలో ఉన్నప్పుడు కాస్త ఇబ్బందిగా అనిపించవచ్చు.
3. శరీరంలో హెయిర్ బాల్ సమస్య ఉత్పన్నమవుతుంది. దీనివల్ల మరణం కూడా సంభవించవచ్చు. జుట్టు పీక్కునే అలవాటున్న వారిలో చాలా మంది ఆ జుట్టుని తింటారు. ఇది జీర్ణవ్యవస్థలో ఉండలా చుట్టుకుపోతుంది. దీని వల్ల కడుపునొప్పి తీవ్రంగా వస్తుంది. సర్జరీ కూడా అవసరం పడుతుంది.
కాబట్టి ఎవరికైనా జుట్టు తినే అలవాటు ఉన్నా, అతిగా వెంట్రుకలు పీక్కుంటున్నా వెంటనే వైద్యులను సంప్రదించాలి. మానసిక ఒత్తిడి, ఇతర సమస్యలకు చికిత్స చేస్తే ఈ డిజార్డర్ దానంతట అదే పోతుంది.
Also read: నువ్వుల నూనెతో వండిన వంటలు తింటే మగవారికెంతో లాభం