ప్రతి ఒక్కరూ తమ పిల్లలు గొప్పగా ఉండాలని ఆశపడతారు. కానీ అందుకు తగ్గ కృషి చేయడంలో విఫలం అవుతుంటారు. పిల్లలు చిన్న తప్పు చేసిన వాళ్ళ మీద గట్టిగా అరిచేసి తిట్టడం కొట్టడం వంటివి చేస్తారు. కానీ అలా చెయ్యడం వల్ల ఆ పసిమనసులు గాయపడతాయి. అది వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తుంది. నీకేం చేతకాదు, నువ్వెప్పుడు ఇంతే నీకేమి రాదు అనే మాటలు అసలు అనకూడదు. అవి వాళ్ళ మనసుల్లో బలంగా నాటుకుపోతాయి. వాళ్ళ తప్పులని ఎత్తి చూపిస్తూ దెప్పిపొడుస్తారు. అలా చెయ్యడం వల్ల పిల్లలు తమలో ఉన్న సృజనాత్మకతని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉందని మానసిక నిపుణులు చెబుతున్నారు.


పిల్లల పట్ల బాధ్యతాయుతంగా ఉండాలి


తమ పిల్లలు సవాళ్లను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడుతుంటే వాళ్ళని తక్కువ చేసి అసలు మాట్లాడకూడదు. అలా చెయ్యడం వల్ల వాళ్ళు తప్పులని తెలుసుకోకపోగా అదే దారిలో నడుస్తారు. మీ పిల్లల్లో ఉన్న ప్రతిభ ఏంటో గుర్తించి దాన్ని ఎంకరేజ్ చేయాలి. అప్పుడు సమాజం ముందు వాళ్ళు గొప్ప స్థానంలో నిలబడతారు. అంతే కానీ వాళ్ళ తప్పులని ఎత్తి చూపిస్తూ తిట్టడం వల్ల వారి ఓటమికి మీరే బాధ్యులుగా మారతారు. మీకు తోడుగా ఇంట్లో పనులు చేయడంలో సహాయం చేస్తే వాళ్ళని కించపరిచే విధంగా మాట్లాడకూడదు. వాళ్ళు చేసింది చిన్న పనైనా మెచ్చుకుంటే చాలా సంతోషిస్తారు.


సొంతంగా ఎదుర్కోవడం నేర్పించాలి


ప్రతి చిన్న విషయానికి ఎదుటి వారి మీద ఆధారపడకుండా తమకి ఎదురయ్యే సవాళ్ళని సొంతంగా ఎదుర్కొనే విధంగా వాళ్ళని మోటివేట్ చేయాలి. పిల్లలు తీసుకునే నిర్ణయాల్లో చాలా మంది తల్లిదండ్రులు జోక్యం చేసుకుంటారు. వాళ్ళు తప్పుడు మార్గాన్ని ఎంచుకుంటే దాన్ని సరిచేయాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. సొంతంగా ఆలోచించి ఏది మంచి ఏది చెడు అని గ్రహించే విధానాన్ని వాళ్ళు అలవరుచుకునేలాగా తల్లిదండ్రులు నేర్పించాలి. కొన్ని సార్లు వాళ్ళు ఇష్టంగా  తీసుకునే నిర్ణయాల్లో జోక్యం చేసుకోకూడదు. ఆ నిర్ణయాల వల్ల ఏదైనా తప్పు జరిగితే వాళ్ళే స్వయంగా తెలుసుకుంటారు. దాని నుంచి ఒక గుణపాఠం నేర్చుకుంటారు. అందుకే తప్పులే గొప్ప గురువులు అంటారు. ఇది మీ పిల్లల ధైర్యాన్ని పెంపొందిస్తుంది.


భావోద్వేగాలు చూపించాలి


ప్రతి ఒక్కరి జీవితంలో భావోద్వేగాలకి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. తమ భావోద్వేగాలని సరైన రీతిలో వ్యక్తపరిచేలా మానసిక స్థైర్యాన్ని ఇవ్వాలి. పాజిటివ్ గా ఆలోచించడం నేర్పించాలి. వాళ్ళల్లో ఉన్న బలహీనతలేంటో వాళ్ళే  తెలుసుకునేలా చేసి వాటిని అధిగమించేందుకు ప్రయత్నించాలని చెప్పాలి. అప్పుడే వాళ్ళు భవిష్యత్ లో ఎటువంటి సమస్యనైనా సులువుగా, ఒంటరిగా ఎదుర్కోగలరు. 


తమ స్థాయి తగ్గే విధంగా మాట్లాడకూడదు


పిల్లలు ఏదైనా ఆశపడి అడిగితే మనకి అంతా స్థోమత లేదు మనం పెదవాళ్ళం అనే మాటలు వారితో చెప్పడం మానుకోవాలి. ఇది పిల్లల మానసిక పరిస్థితి మీద తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఇతరులు మాదిరిగా తాము బతకలేము అనే ఆత్మన్యూనత  భావం వారిలో వస్తుంది. దీని వల్ల వాళ్ళు చెడు దారుల వైపు వెళ్ళే అవకాశం ఉంది.  అలా చేయకుండా వారిలో ధైర్యాన్ని నింపాలి. మనం కష్టపడి సాధిస్తే ఏదైనా సొంతం చేసుకోగలం అని చెప్పాలి. ఇలా చెయ్యడం వల్ల వారిలో ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది.


శిక్షలు వేయడం మానుకోవాలి


పిల్లలు తప్పు చేస్తే మందలించాలి అంతే కానీ శిక్ష పేరుతో వారిని బాధించకూడదు. కొంత మంది తల్లిదండ్రులు తమ పిల్లల్లో మార్పు తీసుకురావడం కోసం కఠినమైన శిక్షలు వేసి భయపెడతారు. అలా శిక్షించడం వల్ల వారిలో ప్రతికూల ఆలోచనలు కలిగే విధంగా ప్రేరేపిస్తుంది. ఓర్పు, ప్రేమతో మీ బిడ్డని దగ్గరకి తీసుకుని అర్థం అయ్యేవిధంగా చెప్పాలి. ఇది మీ పిల్లల జీవితంలో సొంతంగా సమస్యలను పరిష్కరించేందుకు దోహదపడుతుంది. ఇది జీవితంలో గొప్ప విజయానికి దారి తీస్తుంది. 


Also Read: డబుల్ చిన్ మీ అందాన్ని పోగొడుతుందా? ఈ వ్యాయామాలు చేసి చూడండి


Also read: అనుమానమే లేదు, మగవారి కన్నా ఆడవాళ్లే శక్తిమంతులు