మగవారికి ఓ అపారమైన నమ్మకం... ఆడవాళ్ల  కన్నా తామే శక్తివంతులమని,ధైర్యవంతులమని అనుకుంటారు. నిజమే శారీరక బలం విషయంలో వారు ఆడవాళ్ల కన్నా శక్తివంతులు కావచ్చు కానీ ఏదైనా సమస్య వస్తే మాత్రం ఆడవాళ్లే ధైర్యంగా నిలబడతారు. ప్రాణాంతక పరిస్థితులు ఎదురైనప్పుడు ఆడవారే ఆ పరిస్థితిని సమర్థంగా ఎదుర్కొంటారు. శక్తి అంటే శారీరకశక్తి మాత్రమే కాదు మానసిక శక్తి కూడా. కండలు చూసి శక్తివంతులమనుకుంటే అది మీ భ్రమే... ఇదంతా చెబుతున్నది మేము కాదు ఓ అధ్యయనం. మగవారి అతి నమ్మకాన్ని పటాపంచలు చేసింది ఆ అధ్యయనం. 


ఏమిటా అధ్యయనం?
నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ చేసిన అధ్యయనం ప్రకారం ప్రపంచంలో తీవ్ర కరవులు, అంటు వ్యాధులు, మహమ్మారి రోగాలు ప్రబలినప్పుడు మగవారితో పోలిస్తే ఆడవారే వాటిని ఎదుర్కొని నిలబడగలిగారు. భయాన్ని, పిరికితనాన్ని చూపించకుండా సమర్థంగా ఎదుర్కొన్నారు. మానసికంగా చాలా ధైర్యంగా నిలబడ్డారు. చరిత్రలో చాలా సార్లు మహమ్మారి రోగాలు ప్రపంచంపై దాడి చేశాయి. ఆ అన్ని సందర్భాల్లోనూ ఆడవాళ్లే ధైర్యంగా జీవించినట్టు అధ్యయనకర్తలు తేల్చారు. సదరన్ యూనివర్సిటీ ఆఫ్ డెన్మార్క్ ప్రొఫెసర్లు ప్రపంచంలో ఏడు అత్యంత క్లిషమైన పరిస్థితులను ఎంచుకున్నారు. ఆ సమయంలో ఆడవారు, మగవారిలో ఎవరు ధైర్యంగా ఉన్నారనే అంశాలను కనుగొనేందుకు పరిశోధనలు నిర్వహించారు. వారి ఆయుర్ధాయాన్ని బట్టి వారి శక్తిని అంచనా వేశారు. చాలా క్లిష్టపరిస్థితుల్లో మహిళలే ఎక్కువ కాలం జీవించినట్టు గుర్తించారు. ఉదాహరణకు ఐస్ లాండ్ లో తీవ్రంగా అంటువ్యాధులు ప్రబలాయి. 1882లో ఈ అంటువ్యాధులు చాలా మందిని బలితీసుకున్నాయి. ఆ సమయంలో ఆ దేశంలోని మహిళల సగటు ఆయుర్ధాయం 18.83 కాగా, మగవారిది మాత్రం 16.76 గా తేలింది. అంటే ఆ అంటువ్యాధులను తట్టుకుని నిలబడిన తెగువ ఆడవారిదే. అలాగే పాశ్చాత్యదేశాల్లోని చాలా దేశాల్లో మహిళల సగటు ఆయుర్ధాయం 83.1 కాగా, మగవాళ్లది కేవలం 79.5. అంటే ప్రపంచంలోని మారిన పరిస్థితులను, ఎదురైన సవాళ్లను సమర్థంగా ఎదుర్కొని ఎక్కువ కాలం జీవిస్తున్నది మహిళలేనన్నమాట. అందుకే ఆడవారే శక్తివంతులు అని తేల్చింది అధ్యయనం.


హార్మోన్లు కూడా ...
మగవారు తాము శక్తి వంతులం అని అనుకుంటారు కానీ వారి మగతనానికి కారణమైన టెస్టోస్టెరాన్ కూడా వారిపై ప్రతికూలంగా పనిచేస్తుంది. పురుషుల్లో అవసరానికి మించి టెస్టోస్టెరాన్ ఉత్పత్తి అయితే అది వారి రోగనిరోధక శక్తిపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. అదే మహిళల్లో ఈస్ట్రోజెన్ అధికంగా ఉత్పత్తి అయినా అది స్త్రీ శరీరానికి మేలే చేస్తుంది. వాతావరణ, సామాజిక పరిస్థితులను తట్టుకుని నిలబడడంలో మగవారి కన్నా ఆడవారే శక్తివంతులు. 


శారీరకంగా వారే
ఒక విషయం మాత్రం ఒప్పుకోవాల్సిందే. శారీరక బలం విషయానికి వస్తే మగవారే బలవంతులు. ఆ బలం బరువైన వస్తువులు మోయడానికే పనికొస్తుంది. ఎందుకంటే మగవారు ఆడవారు కన్నా 33శాతం అధిక శారీరక బలాన్ని కలిగి ఉంటారు. కానీ ఎందుకో విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు మాత్రం ఆ బలం వారిని సమర్థంగా ఎదుర్కొనేందుకు సాయపడడం లేదు. 


Also read: వాకింగ్‌ ఉదయానే చేయాలా? సాయంత్రం చేస్తే మంచి ఫలితాలు రావా?


Also read: మగవారిని నిశ్శబ్దంగా చంపేస్తున్న ప్రొస్టేట్ క్యాన్సర్, ఈ అలవాటు ఉంటే మానుకోండి


Also read: నెయ్యి అన్నం ఇలా చేస్తే పిల్లలు వదలకుండా తినేస్తారు