గర్భవతిగా ఉన్నప్పుడు మహిళలు తీసుకునే ఆహారం అది వారి కడుపులో బిడ్డ మీద ప్రభావం చూపిస్తుందని అంటారు. అందుకే ఇంట్లో పెద్ద వాళ్ళు కడుపుతో ఉన్న వాళ్ళు ఒకరి కోసం కాదు, ఇద్దరి కోసం తినాలని చెప్తూ ఉంటారు. బిడ్డ ఆరోగ్యంగా పుట్టాలంటే పోషకాలు నిండిన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. అలాగే గర్భవతిగా ఉన్నపుడు ఏవేవో తినాలని కోరికలు రావడం సహజంగానే జరుగుతుంది. అలా అని ప్యాక్ చేసిన ప్రాసెస్ ఫుడ్స్, ఫిజీ డ్రింక్స్ ఎక్కువగా తీసుకోవడం ఆరోగ్యానికి అంత శ్రేయస్కరం కాదు. ఎందుకంటే ఈ ఆహారాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల పుట్టబోయే బిడ్డ ఊబకాయం సమస్యతో పుట్టే అవకాశం ఉందని తాజా అధ్యయనం వెల్లడించింది. ఇవి తినడం వల్ల బరువు పెరగడం మాత్రమే కాదు, ఒబేసిటీ సమస్య కూడా వస్తుంది.


ఏమిటి ఈ అధ్యయనం?


యూఎస్ కి చెందిన ఒక పరిశోధకుల బృందం 14,553 మంది తల్లులకి జన్మించిన 19,958 మంది పిల్లలపై అధ్యయనం చేశారు. 7-17 సంవత్సరాల పాటు వారి ఆరోగ్యం గురించి గ్రోయింగ్ అప్ స్టడీ పేరిట డేటాను పరిశీలించారు. మరొక అధ్యయనంలో తల్లి, బిడ్డ తీసుకునే ఆహారం, ఇతర కారకాలు ప్రతి రెండు సంవత్సరాలకి ఒకసారి అధ్యయనం చేశారు. వారిలో దాదాపు 2,790 మంది తల్లులు, 2,925 మంది పిల్లలు గర్భం దాల్చడానికి మూడు నెలల ముందు నుంచి డెలివరీ(పెరి ప్రెగ్నెన్సీ) వరకి వాళ్ళు తీసుకునే ఆహారం గురించి ప్రత్యేకంగా విశ్లేషణ చేశారు. ప్రెగ్నెన్సీ తర్వాత ప్రాసెస్ ఆహారం తీసుకున్న వారిలో ఊబకాయం వచ్చే ప్రమాదం ఎక్కువగా లేదు. కానీ ప్రెగ్నెన్సీ సమయంలో తింటే మాత్రం అది కడుపులోని బిడ్డపై ప్రభావం చూపించింది.


ఊబకాయం మాత్రమే కాదు..


ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం 39 మిలియన్లకి పైగా పిల్లలు అధిక బరువు లేదా ఊబకాయంతో ఉన్నారని వెల్లడించింది. ఇవే కాకుండా గుండె జబ్బులు, మధుమేహం, క్యాన్సర్లు, ముందస్తు మరణాల ప్రమాదాన్ని కూడా పెంచుతుందని పేర్కొంది. అందుకే గర్భవతిగా ఉన్న సమయంలో తల్లి పోషకాలు నిండిన ఆహారం తీసుకోవాల్సిన ప్రాముఖ్యత ఎంతో ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో తగిన మార్పులు చేసుకోవాలని సూచించారు.


ప్రాసెస్ చేసిన స్నాక్స్ లో అధిక మొత్తంలో కార్బోహైడ్రేట్లు, కొవ్వులు ఉంటాయి. వీటిని అధికంగా తీసుకోవడం వల్ల తల్లిలో కూడా స్థూలకాయం సమస్య పెరిగే అవకాశం ఉందని పరిశోధనలు వెల్లడించాయి. గర్భధారణ సమయంలో తల్లి అసాధారణంగా బరువు పెరిగితే దాని ప్రభావం సంతానం మీద పడుతుందని బాల్యంలో ఊబకాయానికి కారణం అవుతుందని నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు. అల్ట్రా ప్రాసెస్ట్ ఫుడ్ తీసుకొని వారి కంటే ప్యాకేజ్డ్ ఫుడ్ ఎక్కువగా తీసుకునే మహిళలు, వారి పిల్లల్లో ఊబకాయం వచ్చే ప్రమాదం 20 శాతం ఎక్కువగా ఉందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకే వైద్యుల సలహా మెరకు పోషకాలు నిండిన ఆహరం తీసుకోవడమే తల్లీ, బిడ్డ ఇద్దరికీ మంచిది.  


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.


Also read: వీటిని రోజూ తింటే డయాబెటిస్ వచ్చే అవకాశం సగం వరకు తగ్గిపోతుంది