Singapore Organ Donation | దానాల్లో కంటే గొప్పది.. అవయవదానం. ఔనండి, మనిషి మరణించినా.. అవయవాలకు మాత్రం చావు ఉండదు. అవి మరొకరి ప్రాణాలు నిలబెడతాయి. అందుకే చాలామంది తమ అవయవాలను దానం చేయడానికి స్వయంగా ముందుకొస్తున్నారు. అయితే, అవయదానంపై ఇంకా చాలామందికి అవగాహన లేదు. ఇప్పటివరకు అవయవదానమనేది తప్పనిసరి కాదు. ఇష్టమైతేనే ఇందుకు దరఖాస్తు చేయాలి. లేదా బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి అవయవాలను.. కుటుంబ సభ్యుల అంగీకారంతో స్వీకరించి, ఇతరులకు అమర్చవచ్చు. కానీ, కొన్ని దేశాలు అవయదానాన్ని సీరియస్‌గా తీసుకుంటున్నాయి. ఇందుకు ప్రత్యేకమైన చట్టాలు కూడా తీసుకొచ్చాయి. వాటి ప్రకారం.. ప్రతి ఒక్కరూ మరణం తర్వాత అవయవదానానికి అర్హులే.
ఇప్పటివరకు ఈ రూల్ ఫ్రాన్స్‌లో మాత్రమే కచ్చితంగా అమలవుతోంది. అక్కడ పిల్లలు మినహా, పెద్దవాళ్లంతా అవయదానానికి అర్హులే. వారి మరణం తర్వాత అవయవాలు సేకరించడానికి పూర్తి హక్కులు ప్రభుత్వానికి ఉన్నాయి. కుటుంబ సభ్యులు నిరాకరించినా.. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఇదే చట్టాన్ని సింగపూర్ కూడా ప్రవేశపెట్టింది. ఈ చట్టం ప్రకారం.. ఇకపై 21 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ అవయ దానానికి అర్హులే. ఇందుకు ప్రత్యేకంగా దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. 21 ఏళ్లు దాటగానే.. వారి పేరు ఆటోమెటిక్‌గా అవయవ దాతల జాబితాలో చేరిపోతుంది. ఈ చట్టంపై ఆన్‌లైన్‌లో ఇప్పుడు ప్రశంసల వర్షం కురుస్తోంది.
ఎప్పుడు మొదలైంది?: 1987లో సింగపూర్ తీవ్రమైన అవయవ కొరతను ఎదుర్కొంది. దీంతో 2009లో మానవ అవయవ మార్పిడి చట్టం(HOTA) అమల్లోకి తెచ్చింది. 21 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న సింగపూర్ ప్రజలు, మానసిక రోగాలు లేని వారందరినీ ఈ చట్టం పరిధిలోకి తీసుకొచ్చారు. ఈ చట్టాన్ని సింగపూర్ తమ చరిత్రలోనే గొప్ప నిర్ణయంగా పేర్కొంటోంది. చనిపోతారని భావించిన వ్యక్తులు అవయదాతల వల్ల తిరిగి ఊపిరి అందుకున్నారని, మరణించిన దాతల నుంచి సేకరించిన అవయవాలు.. వారికి ప్రాణం పోశాయని తమ వెబ్‌సైట్‌లో పేర్కొంది.
HOTAతో ప్రయోజనాలెన్నో: ఈ HOTA చట్టం పరిధిలో ఉన్నవారు ఇతరులకు దానం చేయడంలోనే కాదు. అవయవాలను పొందేందుకు కూడా అర్హత పొందుతారు. వారికి అవసరమైతే అవయ మార్పిడి వెయిటింగ్ లిస్టులో ప్రాధాన్యత కూడా ఉంటుంది. ఉదాహరణకు.. అవయవదాతగా దరఖాస్తు చేసుకున్న వ్యక్తి అనుకోకుండా అనారోగ్యానికి గురయ్యాడు. అతడికి అత్యవసరంగా కిడ్నీ మార్పిడి చేయాలి. ఇందుకు అతడు కిడ్నీ లభించేవరకు వేచి చూడాల్సిన అవసరం ఉండదు. అవయదానంలో అతడి పేరు అప్పటికే నమోదు చేయబడి ఉంది కాబట్టి.. వెయిటింగ్ లిస్టులో అతడి పేరును ముందుకు తీసుకువచ్చి వెంటనే చికిత్స అందించే అవకాశం ఉంటుంది.
ఇష్టం లేకపోతే?: కొంతమందికి కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి. మరణించిన తర్వాత జీవితం ఉంటుందని, అవయవదానం వల్ల వచ్చే జన్మలో వారు వికలాంగులుగా పుడతారనే అపోహను చాలామంది నమ్ముతున్నారు. ఈ మూఢ నమ్మకాల వల్ల చాలామంది అవయదానానికి ముందుకురారు. అలాంటివారు ఆ దేశ ఆరోగ్య శాఖను సంప్రదించి.. అవయదాతల జాబితా నుంచి తమ పేరును తొలగించాలని కోరవచ్చు. అయితే, దీనివల్ల వారికి నష్టం ఉంది. వీరికి అవయవ మార్పిడి అవసరమైతే.. వెయిటింగ్ జాబితాలో ఎక్కువ రోజులు వేచి చూడాల్సి వస్తుంది. వారి పేరు జాబితాలో అందరి కంటే చివర ఉంటుంది. కేవలం అవయదానానికి అంగీకరించిన వారికి మాత్రమే వెంటనే అవయవాలు లభిస్తాయి. చైనా అవయవ దానాన్ని వ్యతిరేకిస్తోంది. ఇందుకు అక్కడి సాంప్రదాయాలు, విశ్వాసాలే కారణం. అందుకే, సింగపూర్‌లో నివసించే చైనీయులు ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారు.
అమెరికాలో కూడా..: సింగపూర్‌లోనే కాదు, అమెరికాలో కూడా ఇలాంటి రూల్ ఉంది. మీరు అవయవ దాతగా పేరు నమోదు చేసుకుంటే.. మీకు అవసరమైనప్పుడు అవయవ మార్పిడిని స్వీకరించే అవకాశం ఉంది. ఆస్ట్రేలియాలో ఈ నిర్ణయం పూర్తిగా ప్రజలకే వదిలేశారు. 18 ఏళ్లు పైబడిన వ్యక్తి తమ అవయవాలు లేదా కణజాలాలను దానం చేయాలా వద్దా అనే నిర్ణయాన్ని వారికే వదిలేశారు. యూకేలో 2020 నుంచి ఈ రూల్ అమల్లోకి వచ్చింది. అయితే, ప్రపంచవ్యాప్తంగా క్రొయేషియా, స్పెయిన్‌లోనే అత్యధిక అయవదానాలు జరుగుతున్నాయట.
Also Read: డయాబెటిస్ బాధితులకు ఈ సమ్మర్ పెద్ద సవాలే, ఈ జాగ్రత్తలు పాటిస్తేనే సేఫ్!
ఇండియాలో ఇలా..: మన దేశంలో ఏటా 0.5 మిలియన్ల మంది ప్రజలు తమకు కావలసిన అవయవాలు అందుబాటులో లేకపోవడం వల్ల మరణిస్తున్నారు. అవయవమార్పిడి ద్వారా వీరిని బతికించే అవకాశం ఉంది. కానీ, అవసరమైన స్థాయిలో అవయవాలు లేవు. అవయదానంపై ప్రజలకు తగిన అవగాహన లేకపోవడమే ఇందుకు కారణం. ఇండియాలో అవయవ దానం రేటు కేవలం 0.01 శాతం మాత్రమే. క్రొయేషియాలో ఈ రేటు ఏకంగా 36.5 శాతం ఉండగా, స్పెయిన్‌లో 35.3% ఉంది. ఇండియాలో మానవ అవయవాల మార్పిడి చట్టం (THOA), 1994 ప్రకారం.. అవయవ దానం చట్టబద్ధమైనది. బ్రెయిన్ డెడ్, మరణించిన వ్యక్తుల నుంచి అవయవాలను స్వీకరించవచ్చు.
Also Read: ‘ఏక్ మినీ కథ’ - ఇండియాలో అందరిదీ ఇదే వ్యథా? ఆ ‘సైజు’పై ఈ సర్వే వివరాలు నమ్మొచ్చా?
వ్యతిరేకత ఎందుకు?: మరణం భావోద్వేగానికి సంబంధించినదని, అవయవాలు తీసుకోవాలా, వద్దా అనే నిర్ణయాన్ని.. మరణించిన వ్యక్తి కుటుంబానికే వదిలేయాలని పలువురు అంటున్నారు. వ్యక్తిని కోల్పోయిన బాధలో ఉన్న కుటుంబికులను అది మరింత బాధించే అవకాశం ఉందని అంటున్నారు. అయితే, అవయదానం ద్వారా మరొకరికి ప్రాణం పోయడమే కాదు, మీ ఆప్తులను వారిలో చూసుకోవచ్చని ఆర్గాన్ డొనేషన్ మద్దతుదారులు అంటున్నారు. మరి, అవయదానంపై మీ అభిప్రాయం ఏమిటీ? అవయదాతలుగా పేరు నమోదు చేసుకోడానికి మీరు సిద్ధమేనా?