Diabetes in Summer | మీకు డయాబెటీస్ ఉందా? అయితే, జాగ్రత్త. ఈ సమ్మర్‌లో తగిన జాగ్రత్తలు పాటించకపోతే.. అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశాలున్నాయి. ఏప్రిల్ నుంచి ఎండలు ఇప్పటికంటే రెట్టింపు అవుతుంది. ఫలితంగా తీవ్రమైన వేడి, దాహం పెరుగుతుంది. దీని వల్ల నీళ్లు అతిగా తాగేస్తుంటాం. కొందరు కూల్ డ్రింక్స్ కూడా తాగేస్తుంటారు. ఈ పానీయాలు శరీరంలోని బ్లడ్ సుగర్స్‌ నియంత్రణపై ప్రభావం చూపుతాయి. శరీరంలో చక్కెర స్థాయిలు అదుపుతప్పితే.. వేసవి మీకు ప్రమాదకరంగా మారుతుంది. క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ ప్రకారం.. రక్తంలో చక్కెర నియంత్రణ కోల్పోయినట్లయితే స్వేద స్వేద గ్రంధుల నరాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. ఫలితంగా మీకు సరిగ్గా చెమట పట్టకపోవచ్చు. దీనివల్ల హీట్ ఎగ్జాషన్, హీట్ స్ట్రోక్‌కు గురయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి, ఈ వేసవిలో మీ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించాలంటే.. ఈ చిట్కాలు పాటించండి.


నీళ్లు బాగా తాగాలి: వేసవిలో హైడ్రేటెడ్‌గా ఉండటం ఎంతో ముఖ్యం. ఎండ వేడికి బయపడి ఇంట్లోనే ఉండాల్సిన అవసరం లేదు. కాసేపు బయటకి వెళ్లి కొన్ని శరీరక పనులు చేయండి. వాకింగ్ లేదా హైకింగ్ చేస్తున్నప్పుడు, క్రీడలు ఆడుతున్నప్పుడు చిన్న నీటి బాటిల్ వెంట పెట్టుకోండి. లేదా తక్కువ క్యాలరీలు కలిగిన ఎలక్ట్రోలైట్-రిప్లెనిషింగ్ స్పోర్ట్స్ డ్రింక్స్ తీసుకెళ్లండి.


రక్తంలో చక్కెర స్థాయిలను పరీక్షించుకోండి: వేడి ఉష్ణోగ్రతలు రక్తంలో చక్కెర స్థాయిలలో హెచ్చుతగ్గులకు కారణమవుతాయి. కాబట్టి, బ్లడ్ సుగర్ స్థాయిలను తరచుగా పరీక్షించడం మంచిది. ఫలితంగా చక్కెర స్థాయిలను బట్టి డైట్ పాటించడం సాధ్యమవుతుంది. సూర్య కాంతి నేరుగా మీ చర్మానికి తగలనివ్వకండి. సూర్య కిరణాల నుంచి మీ చర్మాన్ని రక్షించండి. సన్‌బర్న్ మీ శరీరాన్ని ఒత్తిడికి గురి చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను పెంచేస్తుంది. 


చాక్లెట్ బార్‌ను తీసుకెళ్లండి: వేసవిలో బ్లడ్ షుగర్‌ స్థాయిలు అకస్మాత్తుగా కోల్పోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే, మీ ఎనర్జీ అంతా చెమట రూపంలో బయటకు వెళ్లిపోయే ప్రమాదం ఉంది. సుగర్ తగ్గినట్లయితే కళ్లు తిరుగుతాయి. శరీరం అదుపు తప్పుతుంది. కాబట్టి, వేసవిలో బయటకు వెళ్లేప్పుడు తప్పకుండా మీ వద్ద ఒక చాక్లెట్ ఉండాలి. చాక్లెట్లు, గ్లూకోజ్ ట్యాబ్‌లు, గ్లూకోజ్ జెల్ ఇలా ఏదైనా మీతో ఉంచుకోవాలి. అలాంటి సమయాల్లో మిమ్మల్ని ఆదుకొనే గ్లూకాగాన్ కిట్ గురించి మీ వైద్యుడిని సంప్రదించండి. ఎప్పటికప్పుడు స్నాక్స్ తీసుకోండి. 


Also read: షాకింగ్, రక్తంలోనూ చేరిపోయిన ప్లాస్టిక్ , నిరూపించిన కొత్త పరిశోధన


మీ ఇన్సులిన్ మోతాదును గమనించండి: వ్యాయామం చేసే ముందు అదనపు కార్బోహైడ్రేట్లను తీసుకోవడం ద్వారా మీ ఇన్సులిన్‌ను సర్దుబాటు చేయొచ్చు. అయితే, ఇందుకు మీరు వైద్యుడి సంప్రదించాల్సి ఉంటుంది. వారి సూచన మేరకే ఎంత ఇన్సులిన్ తీసుకోవాలి. అధిక ఉష్ణోగ్రతల నుంచి మీ ఇన్సులిన్ పంప్‌ను జాగ్రత్తగా ఉంచాలి. కాంతి తక్కువగా ఉన్న, పొడి, చల్లటి ప్రాంతంలో మందులను ఉంచండి. దాహం ఎక్కువగా ఉందనే కారణంతో కూల్ డ్రింక్స్, చల్లని నీటిని ఎక్కువగా తాగవద్దు. వీలైతే కొబ్బరి బొండాన్ని తాగండి. అది దాహాన్ని నియంత్రించడమే కాకుండా శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తుంది.  


Also read: త్వరలో మగవారికీ గర్భనిరోధక మాత్రలు, అవి వస్తే ఆడవారి కష్టాలు తీరినట్టే


గమనిక: పైన పేర్కొన్న ఈ చిట్కాను పాటించాలన్నా.. మీరు వైద్యుడిని సంప్రదించాలి. ఈ కథనంలో పేర్కొన్న అంశాలు కేవలం మీ అవగాహన కోసమే. ఇది వైద్యానికి, నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదని గమనించగలరు.