మీరు పళ్ళు సరిగ్గా శుభ్రం చేసుకోవడం లేదా? ఏదో మొక్కుబడిగా బ్రష్ చేస్తూ మమ అనిపిస్తున్నారా? అయితే జాగ్రత్త.. మీ గుండె ప్రమాదంలో పడినట్టే. అదేంటి దంతాలకు, గుండెకి సంబంధం ఏంటా అని అనుకుంటున్నారా? అక్కడే ఉంది అసలు విషయం. చిగుళ్ళ వ్యాధి కారణంగా గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉందని కొత్త అధ్యయనంలో వెలుగులోకి వచ్చింది. చిగుళ్ళ వ్యాధిని ప్రేరేపించే బ్యాక్టీరియా శరీరం అంతటా వ్యాపించి గుండె నాళాల్లో మంటను ప్రేరేపిస్తుందని, గుండె కవాటాల్లో ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతుందని తాజా అధ్యయనం వెల్లడించింది.


కరొనరీ హార్ట్ డిసీజ్ అనేది గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ధమనుల గోడలో ఏర్పడే ఫలకం వల్ల వస్తుంది. కొలెస్ట్రాల్ ధమనుల్లో పేరుకుపోతే రక్తప్రసరణ, ఆక్సిజన్ అందటం మరింత కష్టంఅవుతుంది. దీని వల్ల గుండె పోటు వస్తుంది. అయితే నోటి ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియా కారణంగా కూడా గుండె ఇబ్బందులో పడబోతోంది. స్విట్జర్లాండ్ కి చెందిన పరిశోధన బృందం దీని మీద పరిశోధనలు జరిపింది. అయితే నోటి బ్యాక్టీరియ ఫ్యూసోబాక్టీరియం న్యూక్లియేటమ్ చికిత్స తీసుకోవడం వల్ల గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించగలవని కూడా పరిశోధకులు తెలిపారు.


అధ్యయనం సాగింది ఇలా..


ఈ అధ్యయనంలో దాదాపు 3,459 మంది పాల్గొన్నారు. వారి జెనెటిక్ ఇన్ఫర్మేషన్ తో పాటు ఆరోగ్య సమాచారం, బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నారు. 12 సంవత్సరాల పాటు వారిని పరిశీలించారు. వాళ్ళలో 6 శాతం మంది 12 ఏళ్ల వ్యవధిలో గుండె పోటు లేదా గుండెకి సంబంధించిన జబ్బులను ఎదుర్కొన్నారు. చిగురువాపు, పిరియాంటైటిస్ కు కారణమయ్యే బ్యాక్టీరియా శరీరంలోని ఇతర చోట్ల రక్త నాళాలకు కూడా ప్రయాణించడాన్ని గుర్తించారు. వాటి వల్ల రక్తనాళాల వాపు, నష్టం కలుగుతుంది. దీంతో రక్తం గడ్డకట్టడం, గుండె పోటు, స్ట్రోక్ సంభవించే ప్రమాదం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. పరిశోధన బృందం అధ్యయనంలో పాల్గొన్న వారి రక్తనమూనాలో 15 వేర్వేరు వైరస్లు, ఆరు బ్యాక్టీరియాయ, ఒక పరాన్నజీవి కదలికల గురించి పరీక్షించారు.


నోటిలో ఇన్ఫెక్షన్స్ కి కారణమయ్యే F. న్యూక్లియేటమ్‌ వల్ల కార్డియో వాస్కులర్ డిసీజ్ తో ముడిపడి ఉందని అధ్యయనం కనుగొన్నది. F. న్యూక్లియేటమ్ బ్యాక్టీరియా కారణంగా ధమనుల్లో ఫలకం ఏర్పడుతుంది. రక్తనాళాలు కూడా సంకుచితం అవుతాయి. అయితే ఈ బ్యాక్టీరియా పోగొట్టేందుకు చేసే చికిత్స వల్ల గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే గుండె జబ్బుల ఉన్నవారిని ఈ బ్యాక్టీరియా మరింత ప్రమాదంలోకి నెట్టేస్తుంది. ఈ అధ్యయనం మీద విస్తృత పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు తెలిపారు.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.


Also Read: కళ్ళు పదే పదే నలిపేస్తున్నారా? జాగ్రత్త, శాశ్వతంగా కంటి చూపు పోవచ్చు