అందరూ ఏదో ఒక సమయంలో కళ్ళు నలుపుకుంటూ ఉంటారు. కళ్ళలో నలక లేదా దుమ్ము పడినప్పుడు, నిద్ర వస్తున్నప్పుడు వాటిని నలుపుతారు. ఇలా జరగడం సాధారణమే అని అందరూ అనుకుంటారు కానీ అది కంటి సంబంధిత సమస్యలను సూచిస్తుంది. కళ్ళను రుద్దడం అనేది ఇన్ఫెక్షన్స్, అలర్జీల వల్ల కూడా కావచ్చు. అయితే కళ్ళు రుద్దుకోవడం వల్ల కొంత వరకు లాభాలు ఉన్నాయి. కళ్ళు రుద్దడం వల్ల రక్త ప్రసరణ, లూబ్రికేషన్ ని ప్రేరేపిస్తుంది. ఇది దుమ్ము కణాలు, మలినాలు తొలగించడంలో సహాయపడుతుంది. ఐబాల్ ను సున్నితంగా రుద్దటం వల్ల వాగస్ నాడీని శక్తివంతం చేస్తుంది. అలాగే హృదయ స్పందన రేటు తగ్గుతుంది. ఒత్తిడి, ఆందోళన నుంచి ఉపశమనం పొందవచ్చు.


అయితే మీకు తరచుగా కళ్ళని రుద్దే అలవాటు ఉంటే మాత్రం వెంటనే మానుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఎంతో సున్నితంగా ఉండే కళ్ళ మీద కాస్త గట్టిగా స్ట్రోక్ చేస్తే అవి దెబ్బతింటాయి. నిరంతరం కళ్ళను రుద్దటం వల్ల కొన్ని నష్టాలు ఉన్నాయి. వాటి వల్ల ఒక్కోసారి కంటి చూపు శాశ్వతంగా కోల్పోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


కార్నియా దెబ్బతింటుంది: కంటిని పదే పదే రుద్దటం చేస్తే కార్నియాపై సన్నని గీతలు ఏర్పడతాయి. దీని వల్ల శాశ్వతంగా కంటి చూపు పోవడం వంటి తీవ్రమైన నష్టానికి దారితీస్తుంది.


అంటు వ్యాధులు: కళ్ళను రుద్దటం వల్ల కండ్లకలక వంటి ఇన్ఫెక్షన్స్ కూడా వస్తాయి. ఇది దురదను మరింత పెంచేలా చేస్తుంది. చేతి వేళ్ళ మీద ఉండే బ్యాక్టీరియా లేదా వైరస్ ఉంటుంది. మనం కళ్ళు నలిపినప్పుడు అందులోకి వెళ్ళి ఇన్ఫెక్షన్‌కి దారితీస్తుందని వైద్యులు చెబుతున్నారు. దీని వల్ల కంటి ప్రాంతం అంతా ఉబ్బి, ఎర్రగా మారిపోతుంది. ఇది అంటువ్యాధి. అలాగే కళ్ళలోని శ్లేష్మ పొర ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందనే వాదన వినిపిస్తుంది.


కేరటోకొనస్: కంటి కార్నియా పల్చబడినప్పుడు మంటగా ఉంటుంది. దీని వల్ల దృష్టి అస్పష్టంగా మారుతుంది. ప్రకాశవంతమైన కాంతిని కళ్ళు అసలు చూడలేవు.


హిస్టామిన్: కళ్ళను తరచుగా రుద్దడం వల్ల శరీరంలో హిస్టామిన్ క్రియ వేగవంతం అవుతుంది. హిస్టామిన్ అనేది ఒక న్యూరోట్రాన్స్మిటర్. ఇది కండరాల సంకోచం, రక్తనాళాల విస్తరణ జరిగేలా చేస్తుంది. హిస్టామిన్ అలర్జీ లక్షణాలను తీవ్రతరం చేస్తాయి.


కళ్ళలో వచ్చే అలర్జీలు


⦿ కళ్ళు మాటిమాటికి రుద్దటం వల్ల అలర్జీ కూడా వస్తుంది. బ్లెఫారిటిస్ అనేది కనురెప్పలలో వాపుకు కారణమవుతుంది. ఆయిల్ గ్రంథులు మూసుకుపోతాయి.


⦿ కళ్ళు ఎక్కువగా చూడటం వల్ల అలసిపోయినప్పుడు మంట, దురదగా అనిపిస్తుంది.


⦿ కళ్ళు తగినంత కన్నీళ్ళను ఉత్పత్తి చేయనప్పుడు పొడి కళ్ళు ఏర్పడతాయి. ఇవి నిరంతరం దురదకు కారణమవుతుంది.


నల్లటి వలయాలు


కొన్నిసార్లు నిరంతరం కళ్ళు రుద్దటం వల్ల ముదురు రంగు చర్మం ఉన్న వాళ్ళకి కళ్ళ చుట్టూ నల్లటి వలయాలు ఏర్పడతాయి. ఈ ప్రాంతంలో చర్మ వర్ణద్రవ్యం ఉత్పత్తి పెరగడం వల్ల ఇలా జరుగుతుందని వైద్యులు చెబుతున్నారు.


కళ్ళ నుంచి రక్తం కారటం


కళ్ళు ఎక్కువగా నలపడం వల్ల కేశనాళికలు విరిగిపోవడం, గాయపడటం జరుగుతుంది. అప్పుడు చిన్న చిన్న గడ్డలు ఏర్పడి కళ్ళ నుంచి రక్తం కారడం కూడా జరగొచ్చు.


కళ్ళని ఎలా కాపాడుకోవాలి


కళ్ళు ఎక్కువగా దురదలు పెడుతూ ఉంటే వైద్యులని కలిసి పరీక్షలు చేయించుకోవడం మంచిది. వీటితో పాటు ఇలా చేశారంటే కళ్ళు రుద్దటం నుంచి బయటపడొచ్చు.


☀ సెలైన్ లేదా ఐ డ్రాప్స్ వేసుకుంటే కళ్ళు శుభ్రపడతాయి. అందులోని మలినాలు బయటకి పోతాయి.


☀ చికాకు నుంచి ఉపశమనం పొందాలంటే కళ్ళకు కాస్త వెచ్చదనం ఇవ్వాలి.


☀ ఒత్తిడిగా ఉండి కళ్ళు అలసటగా ఉంటే కాస్త చల్లటి నీటితో కడగాలి.


☀ ప్రతిరోజు కనీసం 6-8 గంటల పాటు నిద్రపోవాలి.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.


Also Read: మీకు తెలుసా? పప్పుధాన్యాలు డయాబెటిస్‌ను కంట్రోల్ చేస్తాయట, ఎలాంటివి తీసుకోవాలంటే..