ధుమేహం వచ్చిందంటే ఆహారంలో మార్పులు చేసుకోకతప్పదు. లేదంటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోతాయి. గణాంకాల ప్రకారం భారత్ లో దాదాపు 72 మిలియన్లకి పైగా ప్రజలు డయాబెటిస్ తో బాధపడుతున్నారు. ఈ వ్యాధి శరీరంలో తగినంత ఇన్సులిన్ ని తయారు చేయదు. దాని వల్ల రక్తంలో చక్కెర ఉండి గుండె జబ్బులు, దృష్టి మందగించడం, ఊబకాయం, మూత్రపిండాల వ్యాధులు వంటి తీవ్రమైన అనారోగ్య సమస్యల్ని తీసుకొస్తుంది. అందుకే మధుమేహులు తీసుకునే ఆహారం విషయంలో అంతగా జాగ్రత్త పడటం అవసరం.


పప్పుధాన్యాలు మధుమేహులకు చక్కని ఎంపిక. ఇవి శరీరానికి అవసరమైన ప్రోటీన్లను అందించడమే కాకుండా కొవ్వుని తగ్గించడంలో సహాయపడుతుంది. పప్పుల్లో కరిగే ఫైబర్ ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. పీచు పదార్థాలను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల పేగు క్యాన్సర్ ని కూడా నివారిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని ఫైబర్ గుణాలు పొట్టకి నిండుదనాన్ని ఇస్తాయి. కొవ్వుని తగ్గించుకోవాలని అనుకున్న వాళ్ళకి ఇది బెస్ట్ ఫుడ్ అని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.


మధుమేహులకు పప్పుల వల్ల ఉపయోగాలు


భారతీయ వంటకాల్లో పప్పు కూర లేకుండా అసలు ఉండదు. చాలా మంది ప్రజలు తమ భోజనంలో తప్పనిసరిగా ఒక గిన్నె పప్పు తీసుకుంటారు. ఇందులో కార్బోహైడ్రేట్లు ఉంటాయి. పప్పులు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్‌ జాబితాలో ఉన్నాయి. అందుకే వైద్యులు వీటిని తీసుకోవచ్చని సూచిస్తున్నారు. ఇది గ్లూకోజ్ స్థాయిలను పెంచినప్పటికీ మధుమేహ వ్యాధిగ్రస్తులకు రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా పెరగవని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అందుకు కారణం వీటిలో మంచి మొత్తంలో ఫైబర్, ప్రోటీన్లను కలిగి ఉండటమే. జంతు, మాంసకృతులు తీసుకొని వారికి పప్పుల ద్వారా ప్రోటీన్స్ పొందవచ్చు.


మధుమేహులు తినాల్సిన పప్పులు


వైద్యులు చెప్పిన దాని ప్రకారం GI 0 నుంచి 55 వరకు ఉంటుంది. గ్లైసెమిక్ ఇండెక్స్‌లో 55 కంటే తక్కువ ఉన్న పప్పులు మధుమేహులు తీసుకోవచ్చు. ఇవి వారికి ఆరోగ్యాన్ని అందిస్తాయి. డయాబెటిక్ రోగులు తినాల్సిన పప్పుల జాబితా ఇది.


చనా దాల్: బెంగాల్ గ్రామ్ అని కూడా పిలుస్తారు. ఈ పప్పు కేవలం 8 GIని కలిగి ఉంటుంది. ఇందులో ప్రోటీన్లు, ఫోలిక్ యాసిడ్ నిండి ఉంటాయి. కొత్త కణాల ఏర్పాటుకు, వాటి పెరుగుదలకు సహాయపడుతుంది.


రాజ్మా: రాజ్మా లేదా కిడ్నీ బీన్స్ GI 19ని కలిగి ఉంటుంది. చర్మం, కళ్ళకు చాలా మంచిది. ఇందులో శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ ఉన్నాయి. రక్తపోటుని అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది.


పెసరపప్పు: మూంగ్ దాల్ లేదా పెసరపప్పు ఆరోగ్యకరమైన పప్పుల్లో ఒకటి. వృద్ధులకు, గర్భిణీ స్త్రీలకు, పిల్లలకి చక్కని ఆహారం. ప్రోటీన్లు, ఐరన్, విటమిన్లతో నిండిన మూంగ్ పప్పు సలాడ్, సూప్ లో కూడా ఉపయోగించుకోవచ్చు. రాత్రంతా నానబెట్టుకుని మొలకెత్తిన గింజలుగా పెసరపప్పు తీసుకుంటే చాలా మంచిది. బరువు తగ్గడంలో సహాయపడుతుంది.


శనగలు లేదా చోలే: శనగలు చాలా రుచికరమైన పప్పు. అన్ని విధాలుగా ఇది ఉపయోగపడుతుంది. చిరుతిండిగా వీటిని తీసుకోవచ్చు. ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల ఎక్కువ సేపు పొట్ట నిండుగా ఉంచుతుంది. GI కూడా తక్కువగా ఉంటుంది.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.


Also Read: మీగడతో ఇన్ని లాభాలా? అందాన్నీ పెంచుకోవచ్చు, రుచి కూడా అద్భుతం!