పాలు లేదా పెరుగు మీద మీగడ తీసి ఒక గిన్నెలో వేసి ఫ్రిజ్ లో పెట్టడం అందరి ఇళ్ళలో రోజూ చూస్తూనే ఉంటారు. మందంగా ఉండే దీన్ని ఫ్రెష్ క్రీమ్ అని కూడా పిలుస్తారు. కొవ్వులు, ప్రోటీన్లతో నిండి ఉంటుంది. ఎంతో రుచిగా ఉంటుంది. ఎక్కువ మంది దీనితో వెన్న చేసి తర్వాత నెయ్యిగా మారుస్తారు. అలా చేసిన దేశీ నెయ్యి మంచి సువాసనతో పాటు చక్కని రుచి కూడా కలిగి ఉంటుంది. ఈ మీగడని నెయ్యిగా మార్చుకోవడమే కాదు ఇతర వంటలకు ఉపయోగించుకోవచ్చు. అందంగా కనిపించడం కోసం ముఖానికి కూడా రాసుకోవచ్చు.


స్ప్రెడ్ గా రాసుకోవచ్చు


శాండ్ విచ్ తయారు చేసేటప్పుడు బయట నుంచి తెచ్చిన వెన్న లేదా పీనట్ బటర్ స్ప్రెడ్ గా రాసుకుంటారు. కానీ దానికి బదులుగా మీగడతో చేసిన వెన్న రాసుకుని చూడండి అద్భుతమైన రుచిని ఇస్తుంది. మీగడని ఒక గిన్నెలోకి తీసుకుని స్పూన్ లేదా ఫోర్క్ తో గిలకొట్టి దాన్ని శాండ్ విచ్ మీద అప్లై చేసుకుని తినేయండి. ఇందులో దోసకాయ, టొమాటో, ఇతర కూరగాయలు పెట్టుకుని తింటే బయట దొరికే శాండ్ విచ్ కంటే ఇంట్లో చేసుకునేది సూపర్ గా ఉంటుంది.


డెజర్ట్ లు కూడా


మీగడ కాస్త తియ్యటి రుచి కలిగి ఉంటుంది. దీనితో డెజర్ట్ లు కూడా చేసుకోవచ్చు. అందులో కొద్దిగా చక్కెర పొడి కలుపుకుని డెజర్ట్ గా చేసుకుని చపాతీతో కలిపి తినొచ్చు. ఇదే కాకుండా బర్ఫీ, లడ్డు, బ్రెడ్ మలై రోల్స్ వంటి రుచికరమైన డెజర్ట్ లు తయారుచేసుకోవచ్చు.


కూరలకు చిక్కదనం ఇస్తుంది


కూరలకు చక్కటి చిక్కదనం ఇస్తుంది. మీగడ నుంచి వచ్చే ఫ్రెష్ బటర్ పనీర్, కోఫ్తా, చికెన్ కూరల్లో వేసుకోవచ్చు. కూర ఉడికేటప్పుడు కొద్దిగా వెన్న వేయడం వల్ల ముక్కలు త్వరగా ఉడుకుతాయి, అలాగే గ్రేవీగా కూడా ఉంటుంది. మంచి రుచిని అందిస్తుంది.


పాలక్ చేదు తగ్గిస్తుంది


పాలక్ లో కొంచెం సహజమైన చేదు ఉంటుంది. దాన్ని పోగొట్టుకునేందుకు మీగడ ఉపయోగించుకోవచ్చు. పాలక్ పనీర్ తయారు చేసుకునేప్పుడు 3-4 టేబుల్ స్పూన్ల మీగడతో చేసిన వెన్న వేసుకోవచ్చు. ఇది కూరకు గ్రేవీని ఇస్తుంది. కొద్దిగా తీపి రుచి కూడా ఇస్తుంది. ఉడకబెట్టిన పాలక్ లో నేరుగా కూడా మీగడ వేసుకోవచ్చు.


నెయ్యి చేసుకోవచ్చు


మార్కెట్లో దొరికే నెయ్యి అంతగా రుచి ఉండదు. అందుకే ప్రతిరోజు గిన్నెలో మీగడ తీసి గిన్నె నిండిన తర్వాత దాన్ని బ్లెండ్ చేసుకుని వెన్న తీసుకోవచ్చు. దాన్ని శుభ్రంగా నీటితో కడిగి నెయ్యిగా కాస్తే సరిపోతుంది. ఘుమఘుమలాడే నోరూరించే నెయ్యి రెడీ అయిపోతుంది.


చర్మ సంరక్షణ కోసం


మీగడ తినడానికి మాత్రమే కాదు సౌందర్య ప్రయోజనాల కోసం కూడా ఉపయోగపడుతుంది. టాన్ ని తొలగించుకోవడానికి మీగడని బాగా గిలకొట్టి ముఖం, చేతులు, కాళ్ళపై అప్లై చేసుకోవచ్చు. 10 నిమిషాల పాటు ఉంచుకున్న తర్వాత తేలికగా స్క్రబ్ చేసుకోవాలి. ఫేస్ ప్యాక్ వేసుకోవడానికి అందులో కొద్దిగా రోజ్ వాటర్, శనగపిండి కలిపి ప్యాక్ వేసుకోవచ్చు. ఇది చర్మాన్ని మృదువుగా మార్చి సహజమైన మెరుపుని అందించడంలో సహాయపడుతుంది.  


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.