Gold Imports Jan: దేశీయ మార్కెట్‌లో బంగారం ధర రికార్డు స్థాయిలో, సామాన్యుడికి అందనంత ఎత్తులో ఉంది. ఈ నేపథ్యంలో, 2023 జనవరిలో బంగారం దిగుమతులు భారీగా తగ్గాయి. తగ్గడం అంటే కాస్తో, కూస్తో కాదు.. దిగుమతుల్లో ఏకంగా 76 శాతం వరకు క్షీణత నమోదైంది. దీంతో, గత నెలలో బంగారం దిగుమతులు 32 నెలల కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. 


జనవరి నెలలో భారతదేశంలో 10 గ్రాముల బంగారం ధర 58,900 రూపాయలకు చేరుకోవడమే దిగుమతుల్లో క్షీణతకు అతి పెద్ద కారణం. బంగారం రేటు కొండెక్కి కూర్చోవడంతో నగల షాపుల్లో రద్దీ తగ్గింది. అటు ఆర్నమెంట్‌ బంగారం, ఇటు స్వచ్ఛమైన బంగారం రెండిటి మీద ప్రజలు పెద్దగా ఆసక్తి చూపలేదు. ఈ పరిస్థితుల్లో దేశంలోని నగల వ్యాపారులు కూడా బంగారం కొనుగోళ్లను తగ్గించారు. అందువల్లే జనవరి నెలలో బంగారం దిగుమతులు భారీగా తగ్గాయి.


భారతదేశ వాణిజ్య లోటు తగ్గుతుంది
విశేషం ఏంటంటే, భారతదేశం ప్రపంచంలోనే రెండో అతి పెద్ద బంగారం మార్కెట్. ఇప్పుడు బంగారం దిగుమతులు క్షీణించడం వల్ల, దేశం మొత్తం దిగుమతుల్లో తగ్గుదల నమోదవుతుంది. తద్వారా వాణిజ్య లోటు తగ్గుతుంది. ఆర్థిక వ్యవస్థ దృక్కోణం నుంచి చూస్తే ఇది ఒక మంచి పరిణామం. 


2023 జనవరిలో, భారతదేశంలో మొత్తం పసిడి దిగుమతి 697 మిలియన్‌ డాలర్లకు తగ్గింది. 2022 జనవరిలో ఈ విలువ 2.38 బిలియన్ డాలర్లుగా ఉంది. 2022 జనవరిలో మొత్తం 45 టన్నుల బంగారం భారత్‌లోకి దిగుమతి కాగా, 2023 జనవరిలో అది 11 టన్నులకు తగ్గింది.


పెళ్లిళ్ల సీజన్‌లోనూ పెద్దగా లేని డిమాండ్‌
భారతదేశంలోని ప్రజలు వివాహ సీజన్‌లో భారీగా బంగారాన్ని కొనుగోలు చేస్తారు. భారతీయ సంస్కృతి ప్రకారం, పెళ్లి చేసుకున్న కొత్త జంటకు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, అతిథులు బంగారాన్ని బహుమతిగా ఇస్తుంటారు. ఈ పసుపు లోహాన్ని చాలా పవిత్రమైన వస్తువుగా భారతీయులు పరిగణిస్తారు. అంతేకాదు, బంగారు నగలు కూడా వధువు కట్నంలో ఒక భాగంగా ఉంటాయి. అయితే, భారీ ధరల వల్ల ఈసారి పెళ్లిళ్ల సీజన్‌లో బంగారం పెద్దగా మెరవలేదు.


దీంతో పాటు, పసిడి అక్రమ రావాణా లేదా స్మగ్లింగ్‌ను నిరోధించడానికి కేంద్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్‌లో బంగారం మీద దిగుమతి సుంకాన్ని తగ్గిస్తుందని నగల వ్యాపారులు ఆశించారు. ఆ కారణంగానే జ్యువెలర్లు & బులియన్ డీలర్లు జనవరి రెండో అర్ధభాగంలో ఎటువంటి బులియన్స్‌ను కొనుగోలు చేయలేదు. ఈ కారణం వల్ల కూడా బంగారం దిగుమతులు తగ్గాయి. అయితే.. బంగారం వ్యాపారాలు ఆశించినట్లు బంగారం మీద దిగుమతి సుంకంలో కేంద్ర ప్రభుత్వం మార్పులు చేసినా, ఆ తర్వాత కూడా, గత రేటే ఇప్పుడూ ఉంది. వెండి మీద మాత్రం దిగుమతి సుంకాన్ని పెంచింది.


ప్రస్తుతం, స్వర్ణం ధర గరిష్ట స్థాయి నుంచి 5% వరకు దిగి వచ్చింది. దీనివల్ల మళ్లీ కస్టమర్ల రష్‌ పెరుగుతుందని నగల వ్యాపారులు భావిస్తున్నారు. దీంతో పాటు.. దిగుమతి సుంకం మీద స్పష్టత వచ్చింది కాబట్టి, ఫిబ్రవరి నెలలో బంగారం దిగుమతుల్లో పెరుగుదల నమోదు కావచ్చని బులియన్ మార్కెట్ ఆశాభావం వ్యక్తం చేసింది.