MLAs Poaching Case Supreme Court :   ఫామ్ హౌస్ కేసులో సీబీఐ విచారణకు అడ్డంకులు తొలగిపోయాయి. సీబీఐ విచారణకు ఆదేశిస్తూ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై స్పందించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.సీబీఐని తాము నియంత్రించలేమని స్పష్టం చేసింది. దీంతో సీబీఐ విచారణకు అటంకాలు లేనట్లయింది. తదుపరి విచారణను ఇరవై ఏడో తేదీకి సుప్రీంకోర్టు వాయిదా వేసింది. విచారణ సమయంలో తెలంగాణ ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన దుష్యంత్ దవే ఈ కేసులో ఆధారాలన్నీ బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నాయని ఈ క్రమంమలో కేసును సీబీఐ కి ఎలా అప్పగిస్తారని వాదించారు. కేసుపై వాదనల కోసం మరింత సమయం కావాలని కోరారు. ఈ కేసులో సీబీఐ ఒత్తిడి చేయకుండా ఆదేశాలివ్వాలని విజ్ఞప్తి చేశారు. అయితే ధర్మాసనం మాత్రం సీబీఐని తాము నియంత్రించలేమని స్పష్టం చేసి తదుపరి విచారణను 27వ తేదీకి వాయిదా వేసింది. 


న్యాయపరమైన  అడ్డంకులు లేకపోయినా విచారణ ప్రారంభించని సీబీఐ  


నిజానికి పిటిషన్ వేసినప్పుడు ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు తీర్పు అమలుపై స్టే కోరినా సుప్రీంకోర్టు ఇవ్వలేదు. అయినా సిట్ వ‌ద్ద ఉన్న డీటెయిల్స్ ఇవ్వడానికి తెంంగాణ సీఎస్ సిద్ధం కాలేదు. వాటి కోసం  ఎస్పీ స్థాయి అధికారి సీఎస్ కి ఆరుసార్లు లేఖ రాశారు.  సుప్రీంలో విచారణ తర్వాత ఇస్తామని మౌఖికంగా సమాధఆనం చెబుతున్నారు.  అందుకే శుక్ర‌వారం ఏం జ‌ర‌గ‌బోతుందని ఉత్కంఠ నెల‌కొంది. హైకోర్టు తీర్పును అమ‌లు చేయ‌డం లేద‌ని శుక్రవారం  విచార‌ణ త‌ర్వాత కోర్టు ధిక్క‌ర‌ణ కేసు ఫైల్ చేయ‌నున్న‌ట్లు సీబీఐ వ‌ర్గాలు  చెబుతున్నాయి. అయితే సుప్రీంకోర్టులో అనుకూల తీర్పు రాకపోతే..  వెంటనే ఫైల్స్ అన్నీ సిట్ అధికారులు సీబీఐకి ఇచ్చే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. లేకపోతే కోర్టు ధిక్కరణ కింద అధికారులే ఎక్కువగా ఇబ్బంది పడతారు. సీబీఐ విచారణ కూడా ఎదుర్కోవాల్సి రావొచ్చన్న అనుమానాలు ఉన్నాయి. 


కేసు సీబీఐ చేతికి వెళ్తే రాజకీయంగా ఇబ్బందులన్న అంచనాలో బీఆర్ఎస్


ఫామ్ హౌస్ కును బీఆర్ఎస్ ..,బీజేపీపై రాజకీయ పోరాటానికి ఆయుధంగా ఎంచుకుంది. కానీ అనూహ్యంగా ఇది సీబీఐ చేతుల్లోకి వెళ్తూండటం ఆ పార్టీ నేతల్ని ఆందోళనకు గురి చేస్తోంది. సాక్ష్యాలన్నీ బీజేపీ నేతలకు వ్యతిరేకంగా ఉంటాయని.. సీబీఐ నిష్ఫాక్షికంగా పని చేయడం లేదని.. వారి చేతుల్లోకి వెళ్తే ధ్వంసం చేస్తారని వాదిస్తున్నారు. అయితే పైకి ఇలా చెప్పినా కేసును చివరికి ఎమ్మెల్యేల దగ్గరకు తీసుకు వస్తే అది బీఆర్ఎస్ నేతలపై ఒత్తిడి పెంచుతుంది. రాజకీయంగా కీలక పరిణామాలకు కారణం అవుతుంది. అందుకే.., వీలైనంత వరకూ అత్యున్నత స్థాయిలో న్యాయపోరాటం చేసి కేసు సీబీఐకి వెళ్లకుండా చూడాలనుకుంటున్నారు. కానీ సుప్రీంకోర్టులోనూ అనుకూల ఫలితం రావడం లేదు. 


ఇప్పటికే సీబీఐ గ్రౌండ్ వర్క్ చేసేసిందా? 
  
 ఫాంహౌస్ కేసు విచారించేందుకు సీబీఐ అధికారులు ప్ర‌త్యేక బృందంగా ఏర్పడ్డారన్న ప్రచారం జరుగుతోంది.  మొయినాబాద్ పోలీస్ స్టేష‌న్ ఎఫ్ఐఆర్, ఆనాటి ఫుటేజీని ప‌రిశీలించారు. సీఏం వ‌ద్ద‌కు ఎవ‌రు చేర‌వేశారో కాల్ డేటా, ట‌వ‌ర్ లొకేష‌న్స్ ప‌రిశీలించారు. పోలీస్ అధికారుల టైమింగ్స్, ఎమ్మెల్యేల స్పై కెమెరాల‌ను స‌రిచూసుకున్నారు. టెక్నిక‌ల్ గా ఎఫ్ఐఆర్ న‌మోదు చేయ‌కుండానే ఎవరెవ‌ర‌ని విచారించాలో ప్లాన్ చేసుకున్న‌ట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు సీబీఐ ఏం చేస్తుందన్నది  కీలకంగా మారింది.