నువ్వులను వినియోగించేవారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. గ్రామాల్లో తప్ప నగరాల్లో నువ్వులను వాడే వాళ్లు తగ్గిపోయారు. నిజానికి నువ్వులతో చేసే వంటలు శరీరానికి శక్తిని ఇవ్వడంతో పాటూ చాలా రోగాలను దూరంగా ఉంచుతాయి. వారానికి కోసారైనా ఇలా నువ్వుల పచ్చడి చేసుకుని తింటే శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. గుండె ఆరోగ్యం కాపాడుకోవడానికి నువ్వులు మేలు చేస్తాయి. నువ్వులు శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించేందుకు ప్రయత్నిస్తాయి. అయితే డయాబెటిస్ ఉన్న వారు మాత్రం నువ్వులను తక్కువ తినాలి. దీని వల్ల షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంది. చర్మ సౌందర్యాన్ని ఇవి ఇనుమడింప జేస్తాయి. వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, ఐరన్ అధికంగా ఉంటుంది. కాబట్టి రక్త హీనత సమస్య దరిచేరదు. రక్త ప్రసరణ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. మొటిమలు సమస్య కూడా తగ్గుతుంది. నువ్వులతో చేసిన వంటలను పిల్లలు, మహిళలు తింటే మంచిది. వారిలో కాల్షియం లోపం రాకుండా ఉంటుంది. ఎముకలు గట్టిపడతాయి.
కావాల్సిన పదార్థాలు
నువ్వులు - రెండు కప్పులు
పచ్చిమిర్చి - ఆరు
(మీకు కారంగా కావాలనుకుంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు)
మెంతులు - ఎనిమిది గింజలు
చింతపండు - చిన్న నిమ్మకాయ సైజులో
ధనియాలు - అరస్పూను
ఆవాలు - అరస్పూను
ఎండు మిర్చి - ఒకటి
కరివేపాకు - గుప్పెడు
పసుపు - చిటికెడు
నూనె - ఒక స్పూను
తయారీ ఇలా
1. స్టవ్ పై కళాయి పెట్టి నువ్వులను ఒక నిమిషం పాటూ వేయించాలి. నువ్వులను మాడ నివ్వద్దు. రుచి బాగోదు. నువ్వులు వేగాక వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి.
2. ఇప్పుడు ధనియాలు, మెంతులు కూడా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి.
3. ఇప్పుడు మిక్సీ గిన్నెలో నువ్వులు వేసి మెత్తగా పొడి చేయాలి.
4. అందులోనే ధనియాలు, మెంతులు, నానబెట్టిన చింతపండు, పచ్చిమిర్చి, ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. చిన్న కప్పుతో నీళ్లో పోస్తే మెత్తని చట్నీలా అవుతుంది.
5. ఆ మొత్తం మిశ్రమాన్ని తీసి ఒక గిన్నెలో వేసుకోవాలి.
6. ఇప్పుడు పోపు కోసం చిన్న కళాయి స్టవ్ మీద పెట్టి నూనె వేయాలి.
7. నూనె వేడెక్కాక ఇందులో ఆవాలు, ఎండు మిర్చి, కరివేపాకులు వేసి వేయించాలి. చివర్లో చిటికెడు పసుపు కూడా వేసి వెంటనే స్టవ్ కట్టేయాలి.
8. మీకు నచ్చితే ఇంగువ కూడా వేసుకోవచ్చు.
9. పోపును మిక్సీ చేసుకున్న చట్నీపైన వేయాలి. అంతే టేస్టీ నువ్వుల పచ్చడి సిద్ధం.