స్త్రీ అంటే వంటింటికే పరిమితం అనుకొనే రోజులు పోయాయి. ఇప్పుడు పరిస్థితులు మారాయి. నారీ శక్తి తన సత్తా చాటుతోంది. గృహిణిగా రాణిస్తూనే ఎన్నో అవాంతరాలను దాటుకుని ముందడుగు వేస్తూ అంచెలంచెలుగా ఎదుగుతోంది. అన్ని రంగాల్లో రాణిస్తూ పురుషులుకు ధీటుగా పని చేస్తోంది. ఇల్లాలిగా, వ్యాపారవేత్తగా, ఆర్మీ, నేవీ రంగాల్లో కూడా పని చేస్తూ నారీమణులు భేష్ అనిపించుకుంటున్నారు. అయితే, ఓ ఊర్లో మాత్రం.. కేవలం మహిళలు మాత్రమే జీవిస్తున్నారు. ఇక్కడ మగవాళ్ళకి చోటే లేదు. పురుషులు వారి గ్రామంలోకి అడుగుపెడితే పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఇంతకీ ఆ గ్రామం ఎక్కడ ఉందో తెలుసా? ఆఫ్రికా దేశమైన కెన్యాలో ఉంది.


కెన్యా రాజధాని నైరోబికి సమీపంలోని ఉన్న గ్రామం ఉమెజా. ఈ ఊరికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ పురుషులకు చోటు లేదు, వాళ్ళు రావడానికి అనుమతి లేదు. ఇక్కడ స్త్రీలు మాత్రమే నివసిస్తారు. దాదాపు 48 మంది మహిళలు తమ పిల్లలతో కలిసి గుడిసెలు వేసుకుని నివసిస్తున్నారు. ఈ గ్రామంలో పురుషులపై నిషేధం ఉంది. అక్కడకి ఎవరైనా మగవాళ్ళు వెళ్తే స్థానిక పోలీసులు అరెస్ట్ చేస్తారు.


ఉమెజా ఎలా ఏర్పడింది?


1990వ సంవత్సరంలో కేవలం 15 మంది మహిళల బృందంతో ఈ ఊరు ఏర్పడింది. సంబురు, ఇసియోసొ సమీపంలో ఉన్న వాణిజ్య సరిహద్దు పరిసరాల్లో ఈ మహిళలపై బ్రిటిష్ సైనికులు అత్యాచారం చేసేవాళ్ళు. బాధిత మహిళలను కుటుంబ సభ్యులు అర్థం చేసుకోకుండా వారిని చీదరించుకోవడం, ఇంట్లో నుంచి వెళ్లగొట్టడం, చిత్ర హింసలకు గురి చేసేవారు. అత్యాచార బాధితులను సమాజం కూడా ద్వేషంగా, నీచంగా చూస్తూ అవమానించేది. దీంతో బాధిత మహిళలు అందరూ ఒక చోటకి చేరారు. ఆ ప్రాంతానికి ‘ఉమెజా’ అని పేరు పెట్టుకున్నారు. ఇక్కడ అత్యాచార బాధితులు, గృహ హింస బాధితులు, బాల్య వివాహాల నుంచి తప్పించుకున్న వాళ్ళు నివసిస్తారు. ఇళ్ల నుంచి బహిష్కరించబడిన మహిళలందరికీ ఈ ఊరు స్వాగతం పలుకుతుంది. వారికి ఆశ్రయమిచ్చి అండగా నిలుస్తుంది. ఇక్కడ మహిళలదే రాజ్యం. అన్నీ పనులు స్త్రీలే చేస్తారు. అన్ని వయసుల మహిళలు నివసించవచ్చు. ఇక్కడ 98 ఏళ్ల వృద్ధురాలు దగ్గర నుంచి 6 నెలల బాలిక వరకు జీవిస్తున్నారు. చాలా మంది మహిళలు గర్భవతిగా ఉన్న సమయంలో ఇక్కడికి వచ్చి నివసించే వాళ్ళు.


ఉమెజా గ్రామంలో మహిళలు పూర్తి స్వేచ్చతో సంతోషంగా జీవిస్తున్నారు. ఇక్కడ ఏ పనికి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు. రంగు రంగుల పూసలతో దండలు చేసి అమ్ముతారు. ఇది అక్కడి మహిళల జీవనాధారం. ఇక్కడ ఆడవాళ్ళు చెప్పిందే వేదం, వారి మాటే శాసనం. అన్ని పనులు మహిళలు చేసుకుంటారు. పురుషాధిక్య ప్రపంచం నుంచి వేరు పడి తమ జీవితాన్ని తమకి నచ్చినట్టుగా చేసుకుని బతుకుతారు. పురుషులతో సంబంధం లేకుండా సంతోషంగా జీవనం సాగిస్తున్నారు. 


Also read: వేసవిలో రోజుకో గ్లాసు మజ్జిగ, కొవ్వు కరుగుతుంది తేలిగ్గా - ఇంకా చాలా లాభాలున్నాయ్!


Also Read: హోలీ రంగుల నుంచి మీ జుట్టుని ఇలా సంరక్షించుకోండి