Blood Sugar Management Diet : మధుమేహం రావడానికి వివిధ కారణాలు ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఎందరో ఈ దీర్ఘకాలిక వ్యాధి బారిన పడుతున్నారు. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపు తప్పినప్పుడు మధుమేహం వస్తుంది. ఇది ఎన్నో రకాలున్నా.. టైప్ 1, టైప్ 2 కామన్​గా వినిపిస్తూ ఉంటాయి. వయసుతో సంబంధం లేకుండా ఎందరో ఈ ఆరోగ్య సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. మీరు కూడా ఈ మధ్యనే డయాబెటిస్​ ఉందని గుర్తిస్తే మీరు డైట్​లో, లైఫ్​స్టైల్​లో కొన్ని మార్పులు చేసుకోవాలి. 

ముఖ్యంగా మీకు రీసెంట్​గా షుగర్​ ఉందని గుర్తిస్తే కచ్చితంగా మీరు తీసుకునే ఆహారంలో మార్పులు చేయాలి. అలాగే పలు వ్యాయామాలు చేయడంతో పాటు లైఫ్​స్టైల్​ మార్పులు అవసరం. దీనివల్ల డయాబెటిస్ కంట్రోల్​లో ఉంటుందని చెప్తున్నారు నిపుణులు. ఇంతకీ డైట్​లో చేయాల్సిన మార్పులు ఏంటో.. ఇతర మార్పులు ఏమి అవసరమో ఇప్పుడు చూసేద్దాం. 

డైట్ ప్లాన్ 

డయాబెటిస్​ని కంట్రోల్ చేయాలంటే అర్థం.. మీకు ఇష్టమైన ఆహారాన్ని దూరం చేసుకోవడమే. మీకు నచ్చిన స్వీట్స్​ నుంచి రోడ్ సైడ్ దొరికే స్నాక్స్​ వరకు అన్ని కంట్రోల్ చేయాల్సి ఉంటుంది. ఏ ఆహారం తీసుకున్నా.. దానిపై కచ్చితంగా ఫోకస్ ఉండాలి. లేదంటే బ్లడ్​లో షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. కాబట్టి తీసుకునే ప్రతి ఫుడ్​ మీద అవగాహన ఉండాలి. డైట్ ఎలా ఉండాలంటే.. 

సమతుల్య ఆహారం.. 

శరీరానికి అన్ని పోషకాలు అందిస్తూ బ్యాలెన్స్డ్​గా డైట్​ ఉండేలా చూసుకోవాలి. దీనిలో భాగంగా కూరగాయలు, పండ్లు, మిల్లెట్స్, లీన్ ప్రోటీన్, హెల్తీ ఫ్యాట్స్, ప్రాసెస్ చేయని ఫుడ్ తీసుకోవాలి. ఇవన్నీ మీరు తీసుకునే మీల్​లో ఉంటే అది సమతుల్య ఆహారం అవుతుంది. తృణధాన్యాలు, పండ్లు, కూరగాయల్లో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని కార్బ్స్​గా తీసుకోవచ్చు. 

చికెన్, ఎగ్, చేపలు, బీన్స్, పప్పులు, లో ఫ్యాట్ మిల్క్ ప్రొడెక్ట్స్​ని లీన్ ప్రోటీన్​ సోర్స్​గా తీసుకోవచ్చు. నట్స్, అవకాడోలు, ఆలివ్ నూనెలో హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి శరీరానికి చాలా అవసరం. మీరు తీసుకునే ఆహారంలో షుగర్స్​ని దాదాపు తగ్గించేయండి. అలాగే ఒకేసారి పూర్తి భోజనం లాగించేయకుండా. తరచుగా.. ఎక్కువసార్లు తక్కువ ఫుడ్ తీసుకుంటూ ఉంటే మంచిది. హైడ్రేటెడ్​గా ఉండేందుకు రోజంతా నీటిని తాగుతూ ఉండాలి. 

స్వీట్స్, షుగర్ డ్రింక్స్, ఆల్కహాల్, ప్రాసెస్ చేసిన ఫుడ్స్​కి దూరంగా ఉండాలి. అలాగే లో కార్బో డైట్​ని ఫాలో అవ్వాలి. కార్బోహైడ్రేట్లు ఎక్కువగా తీసుకుంటే గ్లైసెమిక్ ఇండెక్స్ పెరుగుతుంది. ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను వేగంగా మార్చేస్తుంది. 

వ్యాయామం

మధుమేహం వచ్చాక లైఫ్​స్టైల్​లో చేయాల్సిన అత్యంత ప్రధానమైన మార్పు వ్యాయామం. ఏ వయసులో షుగర్ వచ్చినా.. రోజులో కనీసం ఏదొక వ్యాయామం చేస్తే ఆరోగ్యానికి మంచి ఫలితాలు ఉంటాయి. బ్రిస్క్ వాకింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్, డ్యాన్స్ వంటివి ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతాయి. కండరాలు బలహీనం కాకుండా కాపాడుతాయి. యోగా, స్ట్రెచ్ వంటివి ఫ్లెక్సీబులిటీ పెంచుతాయి. పూర్తి ఆరోగ్యానికి హెల్ప్ చేస్తాయి. 

మరిన్ని మార్పులు 

రెగ్యులర్​గా శరీరంలో షుగర్​లెవెల్స్​ని చెక్ చేసుకోవాలి. ఏ ఫుడ్ తీసుకున్నప్పుడు శరీరం ఎలా రియాక్ట్ అవుతుందో.. చక్కెర స్థాయిలు ఎంతో ఉన్నాయో చూసుకుంటే మంచిది. దానికి అనుగుణంగా మార్పులు చేసుకోవచ్చు. తీసుకునే ఆహారాన్ని తగ్గించాలి. పోర్షన్ కంట్రోల్ ఉండాలి. వైద్యులు ఇచ్చే మందులు రెగ్యులర్​గా వాడాలి. అలాగే డైటీషియన్​ని మీట్ అయితే మీ వయసు, మీ ఆరోగ్య పరిస్థితులకు అనుగుణంగా డైట్​ను సూచిస్తారు. ఇది మీ ఆరోగ్యాన్ని మరింత కాపాడుకోవడంలో హెల్ప్ చేస్తుంది. 

Also Read : ఆరోగ్య ప్రయోజనాలకై, బరువు తగ్గడం కోసం 14 రోజులు ఈ డైట్​ ఫాలో అయిపోండి.. మీల్ ప్లాన్ ఇదే

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.