ICC Champions Trophy 2025 Latest Updates: ఆస్ట్రేలియా స్టార్ పేస‌ర్ మిషెల్ స్టార్క్.. ఐసీసీ చాంపియ‌న్స్ ట్రోఫీకి దూరంగా ఉన్న సంగ‌తి తెలిసిందే. వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తో త‌ను ఈ టోర్నీకి దూరంగా ఉన్న‌ట్లు క్రికెట్ ఆస్ట్రేలియా ప్ర‌క‌టించింది. అయితే తాజాగా దీనిపై స్టార్క్ స్పందించాడు. వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తోపాటు చీల‌మండ గాయం కార‌ణంగానూ మెగాటోర్నీకి దూరమ‌య్యాన‌ని తెలిపాడు. అయితే ప్ర‌స్తుతం తాను విశ్రాంతి తీసుకుంటున్నాని, విరామం అనంత‌రం అంత‌ర్జాతీయ క్రికెట్ కు స‌న్న‌ద్ధం కావాల‌ని భావిస్తున్న‌ట్లు పేర్కొన్నాడు. ఈక్ర‌మంలో ఐపీఎల్లో ఆడ‌నున్న‌ట్లు, ఆ త‌ర్వాత ప్ర‌పంచ టెస్టు చాంపియ‌న్ షిప్ ఫైన‌ల్స్, వెస్టిండీస్ టూర్లో ఆడ‌నున్న‌ట్లు పేర్కొన్నాడు. దీంతో చాలామంది స్టార్క్ పై విమ‌ర్శ‌లు వ్య‌క్తం చేస్తున్నారు. ఐపీఎల్లో ఆడ‌టం కోసమే మెగాటోర్నీని స్కిప్ చేశాడ‌ని పేర్కొంటున్నారు. అయితే గాయం కార‌ణంగానే త‌ను దూర‌మై, ఐపీఎల్లో ఆడ‌టం ద్వారా స‌న్నాహ‌కాల‌ను ప‌రిశీలించుకోవాల‌ని త‌ను భావిస్తున్న‌ట్లు వాదిస్తున్నారు. 

ఆరంభంలో లైట్ తీసుకున్నాం.. ప్ర‌పంచ టెస్టు చాంపియ‌న్ షిప్ ను 2021లో ప్రారంభించిన‌ప్పుడు లైట్ తీసుకున్నామ‌ని, అయితే ఫైన‌ల్ పోరును చాలా ఆస‌క్తిక‌రంగా చూశామ‌ని స్టార్క్ చెప్పుకొచ్చాడు. ఫైన‌ల్ కు ఎలాగైనా అర్హ‌త సాధించాల‌ని అప్పుడే అనుకున్నామ‌ని వెల్ల‌డించాడు. 2023లో భార‌త్ పై గెలిచి టైటిల్ ద‌క్కించుకున్న ఆసీస్.. 2025 ఎడిష‌న్ లోనూ ఫైనల్ కు అర్హ‌త సాధించింది. లండ‌న్ లోని లార్డ్స్ మైదానంలో జ‌రిగే ఫైన‌ల్లో సౌతాఫ్రికాతో అమీతుమీ తేల్చుకోనుంది .  ఈ మ్యాచ్ లో గెలిచి రెండోసారి క‌ప్పును సాధిస్తామ‌ని స్టార్క్ ధీమా వ్య‌క్తం చేశాడు. ఈనెల 28న ఆఫ్గ‌న్ తో ఆసీస్ త‌ల‌ప‌డ‌నుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జ‌ట్టు నాకౌట్ కు అర్హ‌త సాధిస్తుంది. త‌మ చివ‌రి మ్యాచ్ ల్లో ఇంగ్లాండ్ పైనే రెండు జట్లు గెలుపొందాయి. 

ముగ్గురు పేస‌ర్లు దూరం..నిజానికి  ఈ టోర్నీలో బ‌ల‌హీన‌మైన జ‌ట్టుతోనే ఆసీస్ బ‌రిలోకి దిగుతోంది. స్పీడ్ స్టార్లు కెప్టెన్ పాట్ క‌మిన్స్, స్టార్క్, జోష్ హేజిల్ వుడ్ లేకుండానే మెగాటోర్నీలో ఆసీస్ ఆడుతోంది. వారి స్థానాల్లో స్పెన్స‌ర్ జాన్స‌న్, బెన్ డ్వార్షియ‌స్, నాథ‌న్ ఎల్లిస్ త‌దిత‌ర పేస‌ర్లు ఆడుతున్నారు. ఇక టోర్నీ తొలి మ్యాచ్ లో ఇంగ్లాండ్ పై ఆసీస్ అద్భుత విజ‌యం సాధించింది. 350+ ప‌రుగుల టార్గెట్ ను కూడా జ‌ట్టు సునాయసంగా ఛేదించింది. ఆ త‌ర్వాత ప్రొటీస్ జ‌ర‌గాల్సిన మ్యాచ్ ర‌ద్దు కావ‌డంతో , ఆఫ్గానిస్థాన్ తో జ‌రిగే చివ‌రి మ్యాచ్ లో గెలిస్తే నాకౌట్ కు అర్హత సాధిస్తుంది. అనుభ‌వ‌జ్ఞుడైన కెప్టెన్ స్టీవ్ స్మిత్ జ‌ట్టును న‌డిపిస్తున్నాడు. ఇప్ప‌టికే రెండుసార్లు మెగాటోర్నీని సాధించిన ఆసీస్, ముచ్చ‌ట‌గా మూడోసారి గెలుపొందాల‌ని భావిస్తోంది. 2009 తర్వాత మళ్లీ ఆసీస్ ఎప్పుడూ మెగాటోర్నీ ఫైనల్ కు చేరలేదు. దీంతో ఈసారి ఆ లోటును తీర్చుకోవడంతోపాటు చాంపియన్ గా నిలవాలని భావిస్తోంది. 

Read Also: Rohit Injury Concern: ప్రాక్టీస్ లో పాల్గొన‌ని రోహిత్.. పాక్ తో మ్యాచ్ లో గాయం! మిగ‌తా ఆట‌గాళ్ల ముమ్మ‌ర సాధ‌న‌