WPL RCB Vs GG Live Updates: డబ్ల్యూపీఎల్ 2025లో ఆర్సీబీ మరో పరాజయాన్ని మూటగట్టుకుంది. డిఫెండింగ్ చాంపియన్ గా బరిలోకి దిగిన ఆర్సీబీ.. గత మ్యాచ్ లో సూపర్ ఓవర్లో యూపీ వారియర్జ్ చేతిలో ఓడిపోగా.. గురువారం జరిగిన మ్యాచ్ లో గుజరాత్ జెయింట్స్ చేతిలో చిత్తయ్యింది. సొంతగడ్డ బెంగళూరులో జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఆర్సీబీ.. స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయింది. బ్యాటర్ల వైఫల్యంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 125 పరుగులు చేసింది. కనిక అహుజా (28 బంతుల్లో 33, 1 ఫోర్, 2 సిక్సర్లు ) టాప్ స్కోరర్ గా నిలిచింది. బౌలర్లలో డియెండ్ర డాటిన్, తనుజ కన్వార్ కు రెండేసి వికెట్లు దక్కాయి. స్వల్ప ఛేదనతో బ్యాటింగ్ ప్రారంభించిన గుజరాత్ కు కెప్టెన్ యాష్లీ గార్డెనర్ మెరుపు ఫిఫ్టీ (31 బంతుల్లో 58, 6 ఫోర్లు, 3 సిక్సర్లు)తో చెలరేగి కీలక ఇన్నింగ్స్ ఆడింది. దీంతో గుజరాత్ ఛేదనను 16.3 ఓవర్లలో నాలుగు వికెట్లకు 126 పరుగులు చేసి విజయం సాధించింది. రేణుకా సింగ్, జార్జియా వారెహమ్ చెరో రెండు వికెట్లతో రాణించారు. గార్డెనర్ కే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. టోర్నీలో గుజరాత్ కిది రెండో విజయం కావడం విశేషం. శుక్రవారం జరిగే తర్వాత మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తో ముంబై ఇండియన్స్ తలపడతారు.
విఫలమైన బ్యాటర్లు..పవర్ ఫుల్ హిట్టర్లు ఉన్న ఆర్సీబీ ఈ మ్యాచ్ లో భారీ స్కోరు చేయడంలో విఫలమైంది. కెప్టెన్ స్మృతి మంధాన (20 బంతుల్లో 10) బంతులను బాగా వేస్ట్ చేసి ఔటయ్యింది డాని వ్యాట్ (4), ఎలీస్ పెర్రీ డకౌట్ విఫలం కావడంతో ఒక దశలో 25-3తో కష్టాల్లో నిలిచింది. ఈ దశలో రాఘవి బిస్త్ (22)తో కనిక జట్టును ఆదుకుంది. వీరిద్దరూ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొని కాసేపు వికెట్ల పతాన్ని ఆపారు. ఆ తరవాత పుంజుకుని, స్ట్రైక్ రొటేట్ చేసి, కీలక భాగస్వామ్యం అందించారు. నాలుగో వికెట్ కు 51 పరుగులు జోడించిన తర్వాత రాఘవి ఔటయ్యింది. ఆ తర్వాత కాసేపటికే కనిక కూడా పెవిలియన్ కు చేరింది. చివర్లో జార్జియా (20 నాటౌట్), కిమ్ గార్త్ (14) బ్యాట్ ఝుళిపించడంతో ఆర్సీబీ గౌరవప్రదమైన స్కోరు సాధించింది. మిగతా బౌలర్లలో గార్డెనర్, కశ్వీ గౌతం కి తలో వికెట్ లభించింది.
ఛేజింగ్ లో షాక్..ఛేదనలో గుజరాత్ కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. 32 పరుగులకు ఓపెనర్లు బేత్ మూనీ, డయలాన్ హేమలత వికెట్లకు కోల్పోయింది. ఈ దశలో ఫోబ్ లిచ్ ఫీల్డ్ (30 నాటౌట్)తో కలిసి గార్డెనర్ జట్టును దాదాపు విజయపు అంచుల వరకు తీసుకెళ్లింది. ఆతిథ్య బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్వించిన యాష్లీ.. గ్రౌండ్ నలువైపులా షాట్లు బాదింది. ఈ క్రమంలో 28 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకుంది. అయితే విజయానికి 8 పరుగుల దూరంలో యాష్లీ ఔటైనా, లిచ్ ఫీల్డ్ జట్టును విజయ తీరాలకు చేర్చింది.
Read Also: Kohli Vs Dhoni: కోహ్లీ స్పందన నిజమే.. నాపై ఆ ఫిర్యాదులు ఉన్నాయని మాజీ కెప్టెన్ ధోనీ వ్యాఖ్య