ఈ రోజుల్లో తినే తిండి, ఉండే వాతావరణం మూలంగా జనాలు రకరకాల రోగాల బారిన పడుతున్నారు. వయసుతో పని లేకుండానే రకరకాల ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. వాటిని తగ్గించుకునేందుకు రకరకాల మందులను వాడుతున్నారు. ఈ మందుల మూలంగా మరికొన్ని సమస్యలు మొదలవుతున్నాయి. మొత్తంగా మనిషి చాలా ఇబ్బందులు పడుతున్నాడు.
ఇక బైపోలార్ డిజార్డర్, డిప్రెషన్ మొదలైన మానసిక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్న వారికి శరీరంలోని లిథియం స్థాయిల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడం చాలా ముఖ్యం. లిథియం స్థాయిలను ట్రాక్ చేయడం మూలంగా రోగి సూచించిన మోతాదులో మందులు తీసుకుంటున్నాడా? లేదా? అని డాక్టర్లు గుర్తించగలుగుతారు. దీని వల్ల క్రమం తప్పకుండా మందులు ఎలా వాడాలో వివరిస్తారు. అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న లిథియం స్థాయిలను కొలిచే పద్దతులు అత్యంత త్వరగా, కచ్చితత్వంతో ఫలితాలను ఇవ్వలేకపోతున్నాయి. ఈ నేపథ్యంలో సరికొత్త పరికరాన్ని అందులోకి తీసుకొచ్చేందుకు పరిశోధకులు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్న ఈ పరికరం అత్యంత సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు పరిశోధకులు గుర్తించారు.
ఈ సరికొత్త పరికరం.. ఎలెక్ట్రోకెమికల్ సెన్సింగ్, గ్లిసరాల్‌తో కూడిన నీటి-ఆధారిత జెల్‌ని ఉపయోగించి చెమటలోని లిథియం స్థాయిని సెకెన్ల వ్యవధిలో గుర్తిస్తుంది. సెన్సార్ కు సంబంధించి ఎలక్ట్రానిక్ భాగానికి నియంత్రిత వాతావరణాన్ని సృష్టించడంలో జెల్ సహాయ పడుతుంది. లిథియం అయాన్లు జెల్ గుండా వెళ్ళిన తర్వాత వాటిని సంగ్రహించడానికి, పరిశోధకులు అయాన్-సెలెక్టివ్ ఎలక్ట్రోడ్‌ను ఉపయోగించారు. రిఫరెన్స్ ఎలక్ట్రోడ్ తో పోల్చినప్పుడు సేకరించే అయాన్ లు ఎలక్ట్రికల్ పొటెన్షియల్ లో వ్యత్యాసాన్ని కలిగిస్తాయి. చెమటలో ఉన్న లిథియం యొక్క గాఢతను గుర్తించడానికి వీలుకలుగుతుంది.
ప్రస్తుతం ఈ పరికరం పరిశీలన దశలో ఉంది. ఇప్పటి వరకు మంచి ఫలితాలను అందిస్తున్నట్లు పరిశోధకులు గుర్తించారు. లిథియం చికిత్స నియమావళికి అనుగుణంగా ఔషధ వినియోగానికి ముందు, ఆ తర్వాత వ్యక్తికి సంబంధించిన లిథియం స్థాయిలను పరిశోధకులు ట్రాక్ చేశారు. ఇందులో కచ్చితమైన ఫలితాలు వచ్చినట్లు గుర్తించారు. అయితే ఈ ఫలితాలు లాలాజలం నుంచి తీసుకున్నప్పుడు చాలా కచ్చితంగా వచ్చినట్లు గుర్తించారు. ప్రస్తుతం ఈ పరికరం ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది. ఈ పరికరం అన్ని టెస్టులు పూర్తి చేసుకుని.. త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు పరిశోధకులు చెప్తున్నారు.
Also read: ఆహారంలో చేసే ఈ చిన్న మార్పు మీ జీవితకాలాన్ని పెంచుతుంది, చేసి చూడండి
Also read: వీటిని ఫ్లూ లక్షణాలు అనుకుంటున్నారా, గుండెపోటుకు సంకేతాలు కూడా కావచ్చు