ల్కహాల్ కంటే వైన్ తాగితే ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. మరీ ముఖ్యంగా రెడ్ వైన్  ఆరోగ్యపరంగా అనేక సమస్యలు దూరం చేస్తాయని, అది తాగితే ఎటువంటి ఇబ్బందులు ఉండవని అంటున్నారు. కానీ అది ఎంత వరకు నిజం?


దీని గురించి ఇప్పుడు ఒక షాకింగ్ అధ్యయనం బయటకి వచ్చింది. వైన్ తో సహా అన్ని రకాల ఆల్కహాలిక్ పానీయాలు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి. దీని గురించి బయటకు వినిపించేది మాత్రం వేరుగా ఉంటుంది. కొంతమంది ఆల్కహాల్ వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నమ్ముతున్నారు. వాస్తవానికి వైన్, బీర్, మద్యం వంటి ఇథనాల్ కలిగిన అన్ని రకాల పానీయాలు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి. రొమ్ము, నోరు, పెద్ద పేగు క్యాన్సర్ తో సహ ఏడు రకాల క్యాన్సర్ రకాలు ఆల్కహాల్ వినియోగంతో ముడిపడి ఉన్నాయి. అదే విషయాన్ని తాజా అధ్యయనం కూడా మరోసారి స్పష్టం చేసింది.


అసలేంటి ఈ అధ్యయనం?


ఆల్కహాల్ క్యాన్సర్ కి కారకం అని చాలా మంది ఆమెరికన్లకి తెలియదని ఒక అధ్యయనంలో తేలింది. దీనిపై అవగాహన కల్పించేందుకు యుఎస్ లోని నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఒక సర్వే నిర్వహించింది. ఆల్కహాల్ వల్ల క్యాన్సర్ వస్తుందని దాదాలు 31.2 శాతం మంది పెద్దలకి అవగాహన ఉంది. ఇక బీర్ వల్ల ప్రమాదం ఉందని 24.9 శాతం మంది నమ్మగా, వైన్ వల్ల 20.3 శాతం ఉందని చెప్పారు. కానీ పది శాతం మంది పెద్దలు మాత్రం వైన్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుందని చెప్పగా, 2.2 శాతం మంది బీర్ ఆ ప్రమాదాన్ని తగ్గిస్తుందని నమ్ముతున్నారు. 1.7 శాతం మంది మద్యం క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుందని అనుకుంటున్నారు.


ఇక 50 శాతం కంటే ఎక్కువ మంది పెద్దలు అసలు ఈ పానీయాల వల్ల క్యాన్సర్ ప్రమాదాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో తెలియడం లేదని చెప్పేశారు. అంటే ఆల్కహాల్ వల్ల జరిగే నష్టం గురించి ఎంతవరకి ప్రజల్లో అవగాహన ఉందో దీన్ని బట్టి తెలుస్తుంది. నిజానికి వైన్ తో సహా అన్ని రకాల ఆల్కహాలిక్ పానీయాలు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి. దీని గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలసిన అవసరం చాలా ఉందని సదరు పరిశోధనలు స్పష్టంగా చెప్తున్నాయని  యుఎస్ నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ బిహేవియరల్ రీసెర్చ్ ప్రోగ్రామ్ అసోసియేషన్ డైరెక్టర్ విలియం అభిప్రాయం వ్యక్తం చేశారు.


చివరకు వృద్ధులు కూడా ఆల్కహాల్ వల్ల క్యాన్సర్ ప్రమాదం లేదని నమ్ముతున్నారు. అంటే వారి అవగాహన ఎంతమేరకు ఉందో అర్థం చేసుకోవాలని అంటున్నారు. అవగాహన కలిగించడం వల్ల ఆల్కహాల్ వినియోగాన్ని నియంత్రించవచ్చు. అలాగే క్యాన్సర్ వల్ల వచ్చే మరణాలు కూడా తగ్గించవచ్చని అన్నారు.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.


Also Read: చలికాలంలో వెల్లులి తింటే జలుబు, దగ్గు దరిచేరవా?