మూడేళ్ల క్రితం వెలుగులోకి వచ్చిన కరోనా ఇప్పటికీ మ్యుటేషన్ చెందుతూనే ఉంది. కొత్త వేరియంట్లను పుట్టిస్తూనే ఉంది. ఈ మధ్యకాలంలో పుట్టుకొచ్చిన రెండు కొత్త కరోనా వేరియంట్లు... BA 2.86, Eris. వీటిలో BA 2.86 వేరియంట్... అమెరికాతో పాటు డెన్మార్క్, ఇజ్రాయిల్ దేశాల్లో కనిపించింది. దీనికి సంబంధించిన లక్షణాలను, తీసుకోవలసిన జాగ్రత్తలపై ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పందించింది. ఈ కొత్త వేరియంట్ వ్యాప్తి తీవ్రతను అర్థం చేసుకునేందుకు మరింత సమాచారం అవసరమని చెబుతోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. కోవిడ్ 19 వల్ల ఏర్పడిన ఆరోగ్య అత్యవసర పరిస్థితి ప్రపంచానికి అలవాటైపోయింది. గత మూడేళ్లుగా ఎక్కడో దగ్గర కొత్త కరోనా వేరియంట్లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఇప్పుడు మళ్లీ కొత్త వేరియంట్లు వచ్చాయని చెప్పినా ఆ విషయాన్ని తేలికగానే తీసుకుంటున్నారు ప్రజలు. కానీ ఎప్పుడు? ఏ వేరియంట్ ప్రమాదకరంగా మారుతుందో చెప్పలేము అని అంటుంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. అందుకే కనీస జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలని సూచిస్తోంది. తాజాగా పుట్టుకొచ్చిన మరో వేరియంట్ అయిన Eris.బ్రిటన్లో ఎరిస్ కేసులు బయటపడడం ఆందోళన కలిగించింది. జూలై రెండవ వారంలో ఎరిస్ కేసులు యూకేలో అధికంగా బయటపడ్డాయి. దీంతో మళ్లీ ప్రజల ఆరోగ్యం పై దృష్టి పెట్టాల్సిన అవసరం వచ్చిందని అక్కడి ఆరోగ్య శాఖ భావించింది. ప్రజలు అధిక సంఖ్యలో గుమిగుడితే ఈ కొత్త కరోనా వేరియంట్లు వేగంగా ప్రబలుతున్నాయని అక్కడి మీడియా నివేదికలు చెబుతున్నాయి
Eris, BA 2.86 ఈ రెండూ కూడా ఒమిక్రాన్‌కు చెందిన వేరియంట్లు. ఈ రెండు వేరియెంట్లు కూడా అతి వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. అలాగే ఇవి వ్యాక్సిన్ ఇమ్యూనిటీని కూడా కలిగి ఉన్నాయి. మన రోగ నిరోధక శక్తిని తప్పించుకునే సామర్థ్యం వీటికి ఉంది. అంటే వ్యాక్సిన్లు వేసుకున్న వారికి కూడా ఈ రెండూ సోకే ప్రమాదం ఎక్కువే. ఈ రెండు వేరియంట్లపైనే ప్రస్తుతం ప్రపంచ దేశాల్లోని ఆరోగ్య సంస్థలు మరింతగా దృష్టిపెట్టాయి. అయితే ఇప్పటివరకు ఉన్న నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఎరిస్ వేరియంట్ కేసులు అధికంగా ఉన్నట్టు గుర్తించారు. ఇక BA 2.86 కేసులు ఎక్కువగా ఉన్నాయో లేదో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ఏది డేంజర్?
ఇతర కరోనా వేరియంట్లతో పోలిస్తే BA2.86 కొన్ని అదనపు లక్షణాలను కలిగి ఉంది. ఈ వేరియంట్ ఇన్ఫెక్షన్లతో సంబంధం కలిగి ఉన్నట్లు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ వేరియంట్ సోకిన ప్రజలకు చర్మంపై దద్దుర్లు రావడం, కళ్ళు ఎర్రగా మారడం, విరేచనాలు కావడం జరుగుతున్నట్టు వివరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. అలాగే జ్వరం, దగ్గు, శ్వాస ఆడక పోవడం, అలసట, కండరాల నొప్పులు, తలనొప్పి, రుచి, వాసన తెలియకపోవడం, గొంతు నొప్పి వంటివి ఎరిస్ వేరియెంట్ సోకిన వారిలో కనిపిస్తున్న లక్షణాలు. దీన్నిబట్టి ఎరిస్ వేరియెంట్ సోకిన వారికి మునుపటి కరోనా లక్షణాలే కనిపిస్తున్నాయి. కానీ BA 2.86 వేరియంట్ సోకిన వారికి మాత్రం కొత్త లక్షణాలు కనిపిస్తున్నాయి. ఎరిస్ వేరియంట్‌తో పోలిస్తే BA 2.86 వేరియంట్ కొంత ప్రమాదకరంగా కనిపిస్తోంది. దీనిలో 36 కొత్త మ్యుటేషన్లు ఉన్నట్టు చెబుతున్నారు వైద్యశాస్త్రవేత్తలు. ఇవి ప్రతిరోధకాలను తప్పించుకొని మరి ప్రజలపై దాడి చేస్తాయని వివరిస్తున్నారు. అమెరికా, జర్మనీ దేశాల వారు ఈ కొత్త వేరియంట్లను ఎదుర్కోవడానికి ఫైజర్, మోడర్నా వ్యాక్సిన్లను మరింతగా అప్‌డేట్ చేస్తున్నారు. ఇంతకుముందు తయారైన వ్యాక్సిన్లు BA 2.86 వేరియంటును అడ్డుకోలేవని చెబుతున్నారు. కాబట్టి BA 2.86 ప్రమాదకరమైనదని చెప్పాలి.
Also read: పిల్లలకు గంట కంటే ఎక్కువ సేపు మొబైల్ ఫోన్లు ఇస్తున్నారా? వారి ఆరోగ్యం మీరే చెడగొడుతున్నట్టు లెక్క
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.