Signs of Nerve Weakness and Prevention Tips : శరీరంలోని ప్రతి అవయవం సరిగ్గా పనిచేయడంలో నరాల వ్యవస్థ (Nervous System) కీలక పాత్ర పోషిస్తుంది. నరాలు మెదడు నుంచి శరీరంలోని అన్ని భాగాలకు సంకేతాలను చేరవేసి అన్ని పనులు సక్రమంగా జరిగేలా చేస్తాయి. అయితే కొన్ని కారణాల వల్ల నరాలు బలహీనపడితే చేతులు, కాళ్లలో తిమ్మిర్లు, మొద్దుబారడం, కండరాల బలహీనత వంటి సమస్యలు కనిపించవచ్చు.

Continues below advertisement

ఈ సమస్యను తేలికగా తీసుకుంటే.. రోజువారీ పనులపై కూడా తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి నరాల బలహీనతకు ప్రధాన కారణాలు ఏంటి? దాన్ని నివారించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో.. నిపుణుల సూచనలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

నరాల బలహీనతకు కారణాలు

Continues below advertisement

నరాల ఆరోగ్యానికి విటమిన్ B12 చాలా అవసరం. ఈ విటమిన్ లోపిస్తే చేతులు, కాళ్లలో తిమ్మిర్లు, మొద్దుబారడం, నడవడంలో ఇబ్బందులు, జ్ఞాపకశక్తి తగ్గడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా, ఎక్కువకాలంగా ఉంటే నరాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. దీనిని డయాబెటిక్ న్యూరోపతి అంటారు. హైపోథైరాయిడిజం వల్ల కూడా నరాలపై ప్రభావం పడే అవకాశం ఉంది.

Also Read : మధుమేహం, కంటి ఆరోగ్యం మధ్య సంబంధం ఏంటి? అపోహలు vs వాస్తవాలు

ఆల్కహాల్ ఎక్కువకాలంగా, ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల నరాలకు అవసరమైన పోషకాలు తగ్గి, నరాల పనితీరు దెబ్బతినవచ్చు. మెడ లేదా వెన్నెముక డిస్క్ సమస్యలు, కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ వంటి పరిస్థితుల్లో నరాలపై ఒత్తిడి పెరిగి నొప్పి, తిమ్మిర్లు రావచ్చు. కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్లు, ఆటోఇమ్యూన్ వ్యాధులు కూడా నరాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. కొన్ని రకాల మందులు కూడా నరాలపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి.

నరాల బలహీనత లక్షణాలు

చేతులు, కాళ్లలో తిమ్మిర్లు లేదా మొద్దుబారడం, సూదులతో గుచ్చినట్లు అనిపించడం, కండరాల బలహీనత, నడవడంలో ఇబ్బంది, మండుతున్నట్లు లేదా విద్యుత్ షాక్ తగిలినట్లు నొప్పి, వస్తువులను గట్టిగా పట్టుకోలేకపోవడం, స్పర్శను సరిగా గుర్తించలేకపోవడం వంటి లక్షణాలు నరాల బలహీనతకు సంకేతాలే.  

Also Read : 90 శాతం మహిళల్లో విటమిన్ డి లోపం ఉందట.. ఎముకల నొప్పి, అలసట, మూడ్ స్వింగ్స్​కు ఇదే కారణమట

తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే

నరాల బలహీనతను గుర్తిస్తే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. విటమిన్ B12, B6, ఫోలేట్, విటమిన్ D, విటమిన్ E అధికంగా ఉండే ఆహారాలను డైట్‌లో చేర్చుకోండి. మధుమేహం ఉన్నవారు రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవాలి. రోజుకు కనీసం 30 నిమిషాలు నడక, యోగా లేదా తేలికపాటి వ్యాయామం చేయడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుంది. స్మోకింగ్, డ్రింకింగ్ మానేయాలి. లేదంటే అవి నరాల ఆరోగ్యాన్ని మరింత డ్యామేజ్ చేస్తాయి. 

ఒకే చోట, ఒకే భంగిమలో ఎక్కువసేపు కూర్చోకూడదు. పని మధ్యలో లేచి కొద్దిసేపు నడవడం, స్ట్రెచింగ్ చేయడం అలవాటు చేసుకోండి. రోజుకు 7 నుంచి 9 గంటల నాణ్యమైన నిద్ర ఉండేలా చూసుకోవాలి. నిద్ర చాలా కీలకపాత్ర పోషిస్తుంది. అలాగే నరాల బలహీనత లక్షణాలు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుల సాయం తీసుకోవాలి. లేదంటే పరిస్థితి తీవ్రంగా మారుతుంది.

ఆరోగ్యం గురించిన మరిన్ని కథనాలు, ఇంట్రెస్టింగ్ ఇంటి చిట్కాల కోసం దీనిని క్లిక్ చేయండి.

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.