ఆయుర్వేదంలో మునగాకులకు చాలా విలువ ఉంది. దాదాపు మూడు వందల రకాల రోగాలను నయం చేసే సుగుణాలు దీనిలో ఉన్నాయి.ఈ ఆకులలో పోషకాలు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. పాలిచ్చే తల్లులు మునగాకుతో వండిన వంటకాలు తింటే పాలు అధికంగా పడతాయి. బరువు తగ్గాలనుకునేవారికి కూడా మునగాకు చాలా మంచిది. అతినీలలోహిత కిరణాలను తట్టుకునే శక్తిని మునగాకులు అందిస్తాయి. మునగాకుల్లో హైపోటెన్సివ్ లక్షణాలను కలిగి ఉంటుంది. దానిలో చాలా ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. ఇవి రక్తపోటును అదుపులో ఉంచుతుంది. అల్జీమర్స్ వ్యాధి బారిన త్వరగా పడకుండా ఉండాలంటే కూడా ఈ ఆకు కూర వారానికి కనీసం రెండుసార్లు తినాలి. పక్కతడిపే పిల్లలకు మునగాకు వంటలను తినిపిస్తే ఆ సమస్య తగ్గుముఖం పడుతుంది. కడుపునొప్పి, వాతం, అల్సర్లు, పేగు పూతలు వంటి వాటికి ఇది చక్కని పరిష్కారం చూపిస్తుంది. మునగాకుని పప్పులో కలిపి వండుకోవచ్చు. అలాగే చపాతీలో కలిపి పరాటాలా చేసుకోవచ్చు. తోటకూరలా వేపుడు చేసుకోవచ్చు. ఎలా తిన్నా ఇది మంచిదే. చపాతీకి జతగా ఇలా మునగాకుల కూర చేసుకుని చాలా బావుంటుంది.
కావాల్సిన పదార్థాలు
మునగాకులు - `మూడు కప్పులు
మినపప్పు - పావు కప్పు
ఆవాలు - ఒక టీస్పూన్
పచ్చి కొబ్బరి తురుము - రెండు టీస్పూన్లు
నూనె - మూడు టీస్పూన్లు
ఎండు మిర్చి - ఆరు
పసుపు - చిటికెడు
ఉల్లిపాయ - ఒకటి
తయారీ ఇలా
1. మినపపప్పును ఓసారి వేయించుకోవాలి. ఆ తరువాత నీటిలో నానబెట్టుకోవాలి. కనీసం అరగంటసేపు నానబెడితే మంచిది.
2. మునగాకులను బాగా కడిగి, సన్నగా తరుక్కోవాలి. అన్ని ఆకులను పళ్లెంలో వేసి తరిగేస్తే సులువవుతోంది. ఉల్లిపాయలు కూడా సన్నగా తరుక్కోవాలి.
3. స్టవ్ వెలిగించి దానిపై కళాయి పెట్టి ఒక స్పూను నూనె వేయాలి. ఆవాలు, ఎండు మిర్చి వేసి వేయించాలి.
4. మినపప్పును వడకట్టి వేయాలి. అందులో కాస్త పసుపు వేసి కలపాలి.
5. అవి కొంచెం వేగాక మునగాకును వేసి వేయించాలి. కాస్త ఉప్పు వేసి కలిపి మూత పెట్టాలి.
6. ఆకు బాగా ఉడికేందుకు కాస్త నీళ్లు చల్లాలి. దించడానికి అయిదు నిమిషాల ముందు కొబ్బరి తురుము వేసి కలుపుకోవాలి.
7. ఈ కూరని చపాతీకి జతగా తింటే చాలా టేస్టీగా ఉంటుంది.
Also read: మీ బీపీ ఎప్పుడు చూసినా ఎక్కువగా ఉంటోందా? కారణాలు ఇవి కావచ్చు
Also read: వీళ్లని చూడాలంటే ఎవరైనా తల ఎత్తాల్సిందే, వీడియో చూడండి