Immunity Boosting Foods For Children: ఎండలతో తీవ్ర ఇబ్బందులు పడ్డ ప్రజలకు వానాకాలం ఉపశమనం కలిగిస్తుంది. మండే ఎండలు కాస్త వరుణుడి కరుణతో కూల్ గా మారిపోతాయి. అయితే, వానాకాలంలో చాలా ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా పిల్లలకు ఈజీగా జబ్బు చేస్తుంది. అధిక తేమ కారణంగా బ్యాక్టీరియా, వైరస్ విజృంభించి పిల్లల్లో జలుబు, ఫ్లూ సహా జీర్ణ సమస్యలను కలిగిస్తాయి. సో, వర్షాకాలంలో పిల్లలు ఆరోగ్యంగా,  చురుకుగా ఉండాలంటే రోగనిరోధక శక్తిని పెంచే ఫుడ్ అందివ్వాలి. ముఖ్యంగా వారికి ఈ 5 రకాల ఫుడ్స్ అందిస్తే  ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు. ఇంతకీ ఆ ఫుడ్స్ ఏంటంటే..


పిల్లల్లో రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాలు


1. సిట్రస్ పండ్లు


నారింజ, నిమ్మ లాంటి సిట్రస్ పండ్లలో విటమిన్ C పుష్కలంగా ఉంటుంది. పిల్లల్లో రోగనిరోధక శక్తిని ఈ పండ్లు బాగా పెంచుతాయి. శరీరంలో ఇన్ఫెక్షన్లకు కారణం అయ్యే సూక్ష్మ క్రిములను చంపేసే తెల్ల రక్తకణాలను యాక్టివేట్ చేస్తాయి. వానాకాలంలో ఎదురయ్యే ఆరోగ్య సమస్యలను అరికట్టడంలో సిట్రస్ పండ్లు కీలక పాత్ర పోషిస్తాయి. పిల్లలకు రోజూ ఓ గ్లాస్ ఆరెంజ్ జ్యూస్ తాగించడం వల్ల అనారోగ్యం దరిచేరదు.  


2. అల్లం, తేనె


అల్లం శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో సాయపడుతుంది. సహజంగా రోగనిరోధక శక్తిని పెంచే యాంటీమైక్రోబయల్ లక్షణాలను కలిగి తేనెను అల్లంతో కలిపి తీసుకోవడం వల్ల ఈజీగా ఇమ్యూనిటీ బూస్టింగ్ కలుగుతుంది. పిల్లలకు తేనె కలిపిన అల్లం టీని ఇవ్వడం వల్ల వానాకాలంలో ఆరోగ్యంగా ఉంటారు.  


3. పెరుగు


పెరుగులోని ప్రోబయోటిక్స్ జీర్ణ వ్వస్థను బలోపేతం చేస్తుంది. మంచి బ్యాక్టీరియాను పెంచుతుంది. రెగ్యులర్ గా పిల్లలకు పెరుగు తినిపించడం వల్ల రోగనిరోధక శక్తి బలోపేతం అవుతుంది. వీలైనంత వరకు పెరుగు, ఉప్పును కలిపి తీసుకోవడం మంచిది. పెరుగులో చక్కెరను కలిపి తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదంటున్నారు నిపుణులు.


4. పసుపు


పసుపు  బోలెడు ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. పసుపులో కర్కుమిన్ అనే పదార్థం పుష్కలంగా ఉంటుంది. ఇది  బలమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. సూప్‌లు, కూరలతో పాటు పాలలో కలిపి పిల్లలకు ఇవ్వడం వల్ల వారిలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.  


5. బాదంపప్పులు


బాదం పప్పులు కూడా పిల్లల ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతాయి. బాదంపప్పులో విటమిన్ E పుష్కలంగా ఉంటుంది. బాదంలోని యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచడంలో సాయపడుతాయి. ఇవి శరీరానికి కావాల్సిన హెల్దీ ఫ్యాట్స్, ఫైబర్,  ప్రోటీన్లను అందిస్తాయి. రోజూ నానబెట్టిన బాదం పప్పులు పిల్లలకు ఇవ్వడం వల్ల అవసరమైన పోషకాలు అందుతాయి. వర్షాకాలంలో ఎలాంటి ఆరోగ్య సమస్యలకు గురికాకుండా ఆరోగ్యంగా ఉంటారు.


Read Also: వామ్మో, వానాకాలం - ఆహారం విషయంలో జాగ్రత్త, ఈ నియమాలు పాటిస్తేనే మీరు సేఫ్



Read Also: మోకాళ్ల నొప్పులు వేధిస్తున్నాయా? ఆపరేషన్, మందులు వాడకుండా.. ఈ ఒక్క పనిచేస్తే చాలు - ఎగిరి గంతేస్తారు