ఎండాకాలం ముగిసింది, వర్షాకాలం మొదలువుతోంది. మారుతున్న రుతువులతో పాటు ఆహార నియమాలు మార్చుకోవాల్సి ఉంటుంది. కొన్ని రకాల జీవన శైలి మార్పులతో వర్షాకాలాన్ని ఆనందంగా, ఆరోగ్యంగా గడిపేయొచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
ఎండ వేడి నుంచి తొలకరితో ఉపశమనం దొరుకుతుంది. అయితే వర్షాకాలంలో ఉండే తేమ వాతావరణం వల్ల రకరకాల వ్యాధులు వ్యాపిస్తాయి. ఈ సమయంలో రోగ నిరోధక వ్యవస్థ చాలా బలంగా ఉండాల్సిన అవసరం ఉంది. అందుకే తీసుకునే ఆహారం మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. వర్షాకాలంలో ఎలాంటి ఆహార నియమాలు పాటించాలో ఇక్కడ తెలుసుకుందాం.
ఇవి చెయ్యాలి
హైడ్రేటెడ్ గా ఉండాలి
హెర్బల్ టీలు, సూప్ లు, అల్లం కషాయం వంటి వెచ్చని ద్రవాలను తీసుకోవాలి. ఇవి జీవక్రియల వేగం పెంచుతాయి. హైడ్రేటెడ్ గానూ ఉంచుతాయి.
సీజనల్ ప్రూట్స్ తినాలి
పియర్స్, ఆపిల్, దానిమ్మ, చెర్రీస్ వంటి ఈ కాలంలో దొరికే పండ్లను తప్పకుండా తీసుకోవాలి. వాటిలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి.
తేలికైన తాజగా వండినవే తినాలి
వేపుళ్లు, కొవ్వు కలిగిన ఆహారాలను వీలైనంత తక్కువగా తీసుకోవాలి. తేలికగా ఉండే తాజాగా వండిన భోజనాన్ని మాత్రమే తీసుకోవాలి. చేపలు, కూరగాయలు, తేలికైన ప్రొటీన్లు కలిగిన ఆహారాలు, తృణధాన్యాలను తీసుకోవాలి. ఇవి ఈ కాలంలో శరీరానికి అవసరమయ్యే పోషకాలను అందిస్తాయి. తేలికగానే జీర్ణమవుతాయి.
ప్రొబయోటిక్స్ అవసరం
పెరుగు, మజ్జిగ వంటి ప్రొబయోటిక్స్ తప్పకుండా తీసుకోవాలి. ఇవి జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి అవసరం. జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. రోగనిరోధక వ్యవస్థ బలంగా తయారవుతుంది.
ఇవి చెయ్యకూడదు
స్ట్రీట్ ఫూడ్, సలాడ్ లు వద్దు
వర్షాకాలంలో స్ట్రీట్ ఫూడ్, సలాడ్‌లకు దూరంగా ఉండాలి. ఈ కాలంలో నీటిలో పెరిగే బ్యాక్టీరియాతో వల్ల ఆహారం కలుషితం కావచ్చు. కలుషిత ఆహారం వల్ల కలిగే అనారోగ్యాలను నివారించేందకు ఇంట్లో వండిన ఆహారం మాత్రమే తీసుకోవడం మేలు.
వేపుళ్లు, మసాలలకు దూరం
నూనెలో వేయించిన పదార్థాలు, ఎక్కువ మసాలాలు కలిగిన పదార్థాలు ఎక్కువ తీసుకుంటే జీర్ణసమస్యలు వస్తాయి. అసిడిటి పెరగవచ్చు. కనుక వర్షాకాలంలో మసాలాలు కలిగిన కూరలు, కూర్మాలు, నూనెలో వేయించిన పకోడి, సమోసాల వంటివి తీసుకోకపోవడమే మంచిది.
పాలపదార్థాలు తగ్గించాలి
పాలు, చీజ్, పన్నీర్ వంటి పాల ఉత్పత్తులు తేమ కలిగిన ఈ వాతావరణంలో త్వరగా చెడిపోతాయి. పాల పదార్థాలు తీసుకోవాలని అనుకుంటే తప్పకుండా అవి తాజావని తెలిస్తేనే తినాలి. పాలకు బదులుగా బాదం పాలు, సోయాపాల వంటి ప్రత్యామ్నాయాలను ఉపయోగించవచ్చు.
ఆకుకూరలు తీసుకోవద్దు
ఈ కాలంలో ఆకుకూరల్లో సూక్ష్మక్రిములు ఉండవచ్చు. బచ్చలి, మెంతి ఆకుల వంటి వాటిని బాగా ఉడికించి తీసుకోవచ్చు.
ఆహారం విషయంలో ఈ జాగ్రత్తలు పాటించడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. నిరోధక వ్యవస్థ బలంగా ఉంటే త్వరగా ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉండవచ్చు. తాజా, వెచ్చని శుభ్రమైన ఆహారాన్ని తీసుకోవడం మంచిది.
Aslo read : ఒత్తిడిలో ఉన్నపుడు జంక్ ఫుడ్ తింటున్నారా? కొత్త అధ్యయనం ఏం చెబుతోందో తెలుసా?
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.