Momos and Shawarma in Hyderabad : ఆఫీస్ వర్క్ అయిపోయిన తర్వాత లేదంటే.. కాలేజ్​ నుంచి ఇంటికి వెళ్లేప్పుడు ఫ్రెండ్స్​తో బయటకెళ్లి సాయంత్రం స్ట్రీట్ ఫుడ్ ఎంజాయ్ చేస్తే.. ఉన్న బాధలు మరిచి కబుర్లు చెప్పుకుని హాయిగా రోజుని ముగించొచ్చు. లేదంటే రోడ్డుపై వెళ్తున్నప్పుడు వచ్చే ఘుమఘుమలు కూడా టెంప్ట్ చేస్తూ ఉంటాయి. ఇలా స్ట్రీట్​ ఫుడ్​కి మంచి డిమాండ్ ఉంది. హైదరాబాద్​లో కూడా చాలా ఫేమస్ అయిన స్ట్రీట్ ఫుడ్స్ ఉంటాయి. వీటిని కూడా చాలామంది ఇష్టంగా తింటూ ఉంటారు. అయితే ఈ మధ్య వస్తోన్న కొన్నివార్తలు స్ట్రీట్ ఫుడ్ జోలికి పోకుండా చేస్తున్నాయి. ఎందుకంటే.. 


తాజాగా బంజారాహిల్స్​లో మోమోలు తిని ఓ యువతి మృతి చెందిన ఘటన అందరినీ షాక్​కు గురిచేసింది. మరో 20మంది ఈ మోమోస్ తిని అస్వస్థతకు గురయ్యారు. స్ట్రీట్​ సైడ్ దొరికి ఈ మోమోస్​ను తిని ఇంతమంది సిక్ అవ్వడంతో అధికారులు రంగంలోకి దిగారు. అయితే మోమోస్​తో ఇచ్చే చట్నీ, మయోనైజ్ వల్లే ఇది జరిగినట్లు ప్రాథమికంగా నిర్థారించారు. అలాగే ఇటీవల షవర్మాపై కూడా ఈ తరహా వార్తలు వచ్చాయి. అల్వాల్​లోని ఓ చోట షవర్మా తిన్న కొందరు హాస్పటల్​ బారిన పడ్డారు. షవర్మ తినేందుకు ఇచ్చే మయోనైజ్​ కలుషితమైనట్లు గుర్తించారు. 


అంతా మయోనైజ్ వల్లే.. 


ఈ రెండిటీలో కామన్​గా ఉంది మయోనైజ్. ఈ మధ్య దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు, కంప్లైయింట్స్ వస్తున్నాయి. అందుకే దీనిని నిషేదించాలని జీహెచ్​ఎంసీ సలహా ఇచ్చింది. ఈ కలుషిత మయోనైజ్​ని మోమోస్, షవర్మాల్లో మాత్రమే అనుకుంటే పొరపాటే. దీనిని మండి బిర్యానీల్లో, కబాబ్స్​లో, పిజ్జాలు, బర్గర్లు, శాండ్​విచ్​లు వంటి ఇతర ఆహార పదార్థాల్లో కూడా దీనిని వినియోగిస్తారు. అందుకే స్ట్రీట్ ఫుడ్ తినేప్పుడు జాగ్రత్త ఉండాలని సూచిస్తున్నారు ఆహారం నిపుణులు. 


మయోనైజ్​ను ఎలా చేస్తున్నారంటే.. 


వెజ్ మయోనైజ్ ధర ఎక్కువగా ఉండడంతో.. ఎగ్ మయోనైజ్​ను తేలికగా తయారు చేసుకుంటున్నారు. నిమ్మరసం, నూనె, ఉప్పు, పచ్చసొనను కూడా ఉపయోగించి ఎగ్ మయోనైజ్ తయారు చేస్తున్నారు. వీటిని తయారు చేసేప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల వాటిలో బాక్టీరియా ఎక్కువైపోతుంది. అంతేకాకుండా చేతులు కడుక్కోకుండా అశుభ్రంగా చేయడం వల్ల వీటి ప్రభావం మరింత ఎక్కువైపోతున్నట్లు గుర్తించారు. అలా చేసిన మయోనైజ్​ను ఎక్కువ రోజులు ఉపయోగించడం వల్ల కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే వెజ్ తినేవారికి కూడా ఇది అంత మంచిది కాదు. 



కలుషితమైన మయోనైజ్ తీసుకుంటే.. 


నాసిరకం, కలుషితమైన మయోనైజ్​ను తీసుకుంటే వాంతులు, విరేచనాలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇవి తిన్నవారికి బ్లడ్ టెస్ట్ చేస్తే హానికరమైన సాల్మనెల్లా బ్యాక్టీరియా ఉన్నట్లు గుర్తించారు. కాబట్టి స్ట్రీట్ ఫుడ్స్ తీసుకునే సమయంలో కచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ మీరు తినాలనుకుంటే వాటిని ఇంట్లోనే తయారు చేసుకుని తింటే మంచిదంటున్నారు. 



Also Read : ఉదయం నడిస్తే మంచిదా? సాయంత్రం నడక బెటరా? ఎప్పుడు వాక్ చేస్తే మంచిదో తెలుసా?