పిల్లల్లో పోషకాహార లోపం తరచూ తలెత్తుతుంది. అలాంటి పిల్లలకు అల్పహారాన్ని ప్రత్యేకంగా తయారు చేసి తినిపిస్తే ఆ లోపం తలెత్తదు. రోజూ ఇంట్లో చేసే పూరీ, దోశె, ఇడ్లీనే...కానీ వాటికి మరిన్ని పోషకాలు జతచేర్చి పెట్టాలి. అలా జత చేర్చడం చాలా సులువు. ఎలాగో ఓసారి చూడండి.
ఇడ్లీ
కావాల్సిన పదార్థాలు
ఇడ్లీ పిండి - ఒక కప్పు
క్యారెట్ తురుము - అరకప్పు
క్యాప్సికం తురుము- అరకప్పు
ఉడకబెట్టిన పెసరపప్పు - పావు కప్పు
ఉప్పు - రుచికి సరిపడా
తయారీ ఇలా
1. ఇడ్లీ పిండిని ముందుగా ఎలా సిద్ధం చేసుకుంటారో అలాగే చేసుకోవాలి.
2. ఇడ్లీ పెట్టడానికి ముందు ఆ పిండిలో క్యారెట్ తురుము, క్యాప్సికం తురుము, ఉడకబెట్టిన పెసరపప్పు, ఉప్పు వేసి బాగా కలపాలి.
3. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లకు నూనె లేదా, నెయ్యి రాసి రుబ్బు వేసుకోవాలి.
4. ఇరవై నిమిషాలు ఉడికించుకుంటే సరి, మిక్స్‌డ్ వెజిటబుల్ ఇడ్లీ రెడీ అయినట్టే.
5. కొబ్బరి చట్నీతో లేదా టమాటా చట్నీతో ఈ ఇడ్లీ తింటే అదిరిపోతుంది.
ఈ ఇడ్లీని తరచూ పెట్టడం వల్ల ఎన్నో పోషకాలు అందుతాయి. పోషకాహార లోపం తలెత్తదు.
........................................................
దోశె
కావాల్సిన పదార్థాలు
పొట్టు తీయని పెసరపప్పు - అర కప్పు
మినప గుళ్లు - ఒక కప్పు
క్యారెట్ తురుము - అర కప్పు
కొత్తిమీర తురుము - పావు కప్పు
నూనె - సరిపడా
ఉప్పు - రుచికి తగినంత
తయారీ ఇలా
1. ముందుగా పెసరపప్పు, మినప గుళ్లను నానబెట్టుకోవాలి. ముందు రోజు రాత్రి నానబెట్టుకుంటే మరుసరి రోజు ఉదయానికి అవి మెత్తగా అవుతాయి.
2. పెసరపప్పు పొట్టను తీయకూడదు. అలాగే పప్పులను కడిగేసి మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి.
3. రెండు పప్పులను కలిపేసే రుబ్బుకోవాలి.
4. ఇప్పుడు రుబ్బులో ఉప్పు, మెత్తటి క్యారెట్ తురుము, కొత్తిమీర తురుము, ఉప్పు వేసి బాగా కలపాలి.
5. వాటిని దోశెల్లా పోసుకోవాలి.
6. ఈ దోశెలను ఒక్కసారి తినిపిస్తే మళ్లీ మళ్లీ కావాలని అడుగుతారు పిల్లలు. అంత రుచిగా ఉంటాయి.
7. కొబ్బరి చట్నీ, టమాటా చట్నీ, వేరు శెనగ పలుకుల చట్నీతో ఈ దోశె బావుంటుంది.
................................................
పూరీ
కావాల్సిన పదార్థాలు
గోధుమపిండి - ఒకటిన్నర కప్పు
పాలకూర తరుగు - అర కప్పు
క్యారెట్ తరుగు - పావు కప్పు
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - వేయించడానికి సరిపడా
నీళ్లు - సరిపడా
తయారీ ఇలా
1. గోధుమపిండితోనే పిల్లలకు పూరీలు చేసి పెట్టాలి. చాలా మైదా పిండి వాడతారు. ఇది ఆరోగ్యానికి హానికరం
2. పాలకూరను సన్నగా తరిగి కళాయిలో కాస్త నూనె వేసి మగ్గించాలి. ఆకులు మెత్తగా నలిగి దగ్గరగా వస్తాయి. నీళ్లు ఇంకిపోతాయి.
3. ఒక గిన్నెలో గోధుమపిండి, నీళ్లు, ఉప్పు వేసుకుని పూరీ పిండిలా కలుపుకోవాలి.
4. ఆ సమయంలో ఉడకబెట్టిన పాలకూర, తురిమిన క్యారెట్ వేసి పిండిని కలుకోవాలి.
5. ఇప్పుడు పూరీల్లా ఒత్తుకుని నూనెలో వేసి వేయించుకోవాలి.
6. అంతే పోషకాల పూరీ రెడీ అయినట్టే.
కూరలు తినని పిల్లలకు ఇలాంటి టిఫిన్లు పెట్టడం వల్ల పోషకాహార లోపం తలెత్తదు.
Also read: వీటిని రోజూ తింటే డయాబెటిస్ వచ్చే అవకాశం సగం వరకు తగ్గిపోతుంది