దక్షిణాది స్టార్ హీరోయిన్ గా అనుష్క శెట్టి తన సత్తా చాటింది. తన కెరీర్ లో కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేసింది. 'అరుంధతి', 'భాగమతి' లాంటి సినిమాలు ఆమె స్థాయిని పెంచాయి. 'బాహుబలి' సినిమాతో దేశవ్యాప్తంగా పాపులర్ అయింది ఈ బ్యూటీ. కొన్నాళ్లపాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న అనుష్క్.. మళ్లీ సినిమాలు ఒప్పుకోవడం మొదలుపెట్టింది. 


ఇప్పటికే యూవీ క్రియేషన్స్ లో ఓ సినిమా చేయడానికి ఒప్పుకుంది అనుష్క. నవీన్ పోలిశెట్టి హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. మహేష్.పి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. అనుష్కకు 48వ చిత్రమిది. 'మిర్చి', 'భాగమతి' విజయాల తర్వాత యూవీ క్రియేషన్స్ సంస్థలో ఆమె నటిస్తున్న హ్యాట్రిక్ సినిమా (Anushka Shetty hat trick  movie with UV Creations). ఇందులో ఆమె సరికొత్త లుక్ లో కనిపించనున్నారు.  తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం మొత్తం నాలుగు దక్షిణాది భాషల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. 


ఇక ఈరోజు అనుష్క పుట్టినరోజు సందర్భంగా.. చిత్రబృందం ఒక పోస్టర్ ను రిలీజ్ చేసి అనుష్కకు బర్త్ డే విషెష్ తెలిపింది. పోస్టర్ లో అనుష్క చెఫ్ గెటప్ లో వంట చేస్తూ కనిపించింది. సినిమాలో ఆమె అన్విత రవళి శెట్టి అనే పాత్రలో కనిపించనుంది. ఇదొక రొమాంటిక్ లవ్ స్టోరీ అని సమాచారం. వయసులో దాదాపు ఇరవై ఏళ్లు గ్యాప్ ఉన్న ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమ పుట్టడం.. వాళ్లు ఎదుర్కొనే పరిమాణాల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.


యంగ్ హీరో నవీన్ పోలిశెట్టికి కెరీర్ ఆరంభంలోనే అనుష్క లాంటి హీరోయిన్ తో కలిసి నటించే ఛాన్స్ రావడమంటే విశేషమనే చెప్పాలి. పైగా సినిమాలో ఇద్దరి రోల్స్ చాలా కొత్తగా ఉంటాయట. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 


Also Read: ప్రభాస్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్, ‘ఆదిపురుష్’ విడుదల వాయిదా, తేదీ ప్రకటించిన ఓం రౌత్ - రీషూట్ కోసమేనా?


అనుష్క బ్యాక్ గ్రౌండ్:


అనుష్క బెంగుళూరులో యోగా శిక్షకురాలిగా ఉండేది. అనుకోకుండా నాగార్జున నటించిన సూపర్ చిత్రంలో రెండో హీరోయిన్ ఛాన్సు కొట్టేసింది. ఆ సినిమాలో ఆమెను తొలిసారి చూసిన వాళ్లంతా ‘వావ్ ఎవరీ అమ్మాయి?’ అనుకున్నారు. హీరోలతో సమానమైన ఎత్తుతో, సన్నని మల్లెతీగలా ఉంది ఆ సినిమాలో. ఇక విక్రమార్కుడు సినిమాలో ఆమె డ్యాన్సులు జనాలకు విపరీతంగా నచ్చేశాయి. ఆమెను టాప్ హీరోయిన్ గా నిలబెట్టిన సినిమా అయితే ‘అరుంధతి’ అనే చెప్పాలి. అనుష్క కెరీర్ అరుంధతికి ముందు, తరువాత అనేంతగా మారింది. అప్పట్నించి లేడీ ఓరియంటెడ్ మూవీ అనగానే అందరికీ అనుష్కనే గుర్తొచ్చేది. 2005లో టాలీవుడ్ లో అడుగుపెట్టిన అనుష్క వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాకుండా కెరీర్ సాగుతోంది. ఇక ఆమె కెరీర్ లో బాహుబలి సినిమా అంతర్జాతీయ స్థాయి గుర్తింపును తెచ్చి పెట్టింది. ఆమె కెరీర్లో 2005 నుంచి 2020 వరకు వరుస పెట్టి ప్రతి ఏడాది రెండుకి మించి ఆమె సినిమాలు విడుదలయ్యేవి. 2010లో అయితే ఏకంగా 8 సినిమాలు విడుదలయ్యాయి. అయితే 2021లో మాత్రం బ్రేక్ తీసుకుంది అనుష్క. ఆ ఏడాది ఒక్కసినిమా కూడా విడుదల కాలేదు. ఈ ఏడాది కూడా ఆమె నుంచి సినిమా వచ్చేలా లేదు.