ఇరవై ఒక్కేళ్ల తరువాత భారతదేశానికి మిస్ యూనివర్స్ కిరీటాన్ని తీసుకొచ్చింది హర్నాజ్ కౌర్ సంధు. అయిదడుగుల తొమ్మిది అంగుళాల ఈ నిలువెత్తు అందాన్ని చూసి ప్రపంచమే మురిసింది. అలాంటి హర్నాజ్ ఇటీవల బాడీ షేమింగ్ బారిన పడింది. దానికి కారణం ఆమె కాస్త లావు కావడమే. ఇటీవల ఆమె లాక్మే ఫ్యాషన్ వీక్ ర్యాంప్ పై ‘స్పెజియా మైక్రో వెల్వెట్ గౌను’తో నడిచింది. ఆ గౌనులో ఆమె లావుగా కనిపించింది. ఆ ర్యాంప్ వాక్ ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండయ్యాయి. వాటిపై కొంతమంది తీవ్రంగా ట్రోల్ చేశారు. ‘ఇలా లావుగా అయిపోయావేంటి?’ అంటూ కామెంట్లు నడిచాయి. ‘ఇలాగే అందాల పోటీలో గెలిచావా’ అంటూ కొంతమంది గేలి చేశారు. దీనికి హర్నాజ్ కౌర్ సంధు ఘాటుగానే స్పందించింది. 


నాకు ఆ సమస్య ఉంది...
ట్రోలింగ్ బాధపడిన హర్నాజ్ తానెందుకు లావయ్యానో చెప్పుకొచ్చింది. ‘నేను ఎదుర్కొంటున్న సమస్యేంటో నాకు మాత్రమే తెలుసు. నాకు గ్లూటెన్ ఎనర్జీ. చాలా రకాల ఆహారపదార్థాలు నాకు పడవు. దీన్నే సెలియాక్ డిసీజ్ అంటారు. దీనివల్ల అతిగా లావు కావడం లేదా బక్కగా అయిపోవడం జరుగుతుంది. నేను ఎంతగా ప్రయత్నిస్తున్నా ఈ వ్యాధి వల్లే నేను లావవుతున్నాను.’అని చెప్పుకొచ్చింది. మొదట్లో తనను ఎంత సన్నగా ఉన్నావో అనే వారని, ఇప్పుడు లావుగా ఉన్నానని అంటున్నారని తెలిపింది. ‘నాకున్న వ్యాధి గురించి ఎవరికీ తెలియదు. గోధుమపిండితో చేసిన ఏ వంటకలు నేను తినలేను. అంతే కాదు ఇంకా చాలా ఆహారపదార్థాలు తినకూడదు’ అని చెప్పుకొచ్చింది విశ్వసుందరి.


ఏంటి ఈ వ్యాధి?
సెలియక్ డిసీజ్ (ఉదరకుహర వ్యాధి) అనేది చాలా విచిత్రమైనది. ఒక వ్యక్తి రోగనిరోధక వ్యవస్థ సొంత శరీరంపైనే వ్యతిరేకంగా పనిచేస్తుంది.గ్లూటెన్ తింటే రోగనిరోధక శక్తి శరీరంపైనే దాడి చేస్తుంది. ఈ వ్యాధి వల్ల పోషకాహారలోపం, ఎముక సాంద్రత తగ్గిపోవడం, సంతానోత్పత్తి సమస్యలు ఉత్పన్నమవడం, నాడీ సంబంధిత వ్యాధులు, కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంది. ఈ వ్యాధి గురించి చాలా మందిలో అవగాహన లేకపోవడం వల్ల దీన్ని గుర్తించలేక అడ్వాన్స్ స్టేజ్‌కు చేరుకుంటున్నారు.   


లక్షణాలు ఎలా ఉంటాయి?
ఈ వ్యాధి లక్షణాలలో కొన్ని చాలా సాధారణమైనవి. మలబద్ధకం, కాళ్లలో తిమ్మిరి, విరేచనాలు, రుతుచక్రం క్రమంగా లేకపోవడం, దంతాల రంగు మారడం, కడుపునొప్పి, కడుపుబ్బరం, కండరాల తిమ్మిరి, కీళ్లనొప్పులు, చర్మం దురద, గ్యాస్ట్రిక్, పిల్లలు పుట్టకపోవడం... ఇలా ఉంటాయి. 


వారసత్వంగా...
ఈ వ్యాధి ఎందుకొస్తుందో తెలియదు కానీ, వారసత్వంగా వచ్చే అవకాశం పుష్కలంగా ఉందని చెబుతున్నారు వైద్య నిపుణులు. మీ కుటుంబంలో ఎవరికైనా ఈ సమస్య ఉంటే ముందుతరాల వారికి సెలియాక్ డిసీజ్ రావచ్చన్నమాట. మీకు ఎక్కువ కాలం పాటూ కడుపు ఉబ్బరం, మలబద్ధకం, కడుపునొప్పి, బరువు తగ్గడం, లేదా బరువు ఎక్కువ పెరగడం...ఇలాంటి లక్షణాలు కనిపిస్తే ఓసారి వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం. 





Also read: సుప్రీంకోర్టుకు చేరిన ‘నిమ్మరసం’ పంచాయతీ? అది నిమ్మ రసమా లేక పండ్ల రసమా?


Also read: ఉగాదికి ప్రసాదం పులిహోర ఇలా చేసుకుంటే టేస్టు అదిరిపోవడం ఖాయం