వేసవి వచ్చిదంటే నిమ్మ కాయతో చేసే జ్యూసులకు డిమాండ్ పెరిగిపోతుంది. రోడ్డంతా బండ్లపై నిమ్మరసాన్ని అమ్ముతూనే ఉంటారు. వాటికి ఒక్కోదానికి ఒక్కో పేరు పెట్టి అమ్ముతారు. పెప్సికో సంస్థ కూడా ప్రతి వేసవికి ‘నింబూజ్’ పేరుతో నిమ్మడ్రింకును మార్కెట్లో దించుతుంది. ఇప్పుడు ఈ డ్రింకు పేరు ట్విట్టర్లో ట్రెండ్ అవుతోంది. దానికి కారణం ఈ పానీయం గురించి సుప్రీంకోర్టులో పంచాయతీ జరుగబోతోంది. కొంత మంది దీన్ని నిమ్మరసం అంటుంటే, మరికొందరు దీన్ని పండ్ల రసంగా పిలవాలని డిమాండ్ చేస్తున్నారు. ట్విట్టర్లో నెటిజన్ల మధ్య మాటల యుద్దం జరిగింది. దీన్ని నిమ్మరసమో లేక పండ్ల రసమో తేల్చి చెప్పాలని కొంతమంది కోరుతున్నారు. ఈ సమాధానాన్ని ఇప్పుడు సుప్రీం కోర్టు తేల్చనుంది. 


ఎవరు వేశారు పిటిషన్?
ఆరాధనా ఫుడ్స్ అనే సంస్థ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రస్తుతం ఈ పానీయాన్ని ‘పండ్లు గుజ్జు లేదా పండ్ల రసం’ గా వర్గీకరించారు. అయితే దీన్ని తయారుచేసిన పెప్సికో సంస్థ మాత్రం కేవలం ‘నిమ్మరసం’గా మాత్రమే పిలవాలని కోరుకుంటోంది. తాజా నివేదికల ప్రకారం సుప్రీంకోర్టు ఈ పిటిషన్ ను న్యాయమూర్తుల ద్విసభ్య ధర్మాసనం ఏప్రిల్ లో విచారించనుంది. అది ఏ కేటగిరీ డ్రింకో నిర్ణయించుకున్న తరువాత దానికి విధించాల్సిన ఎక్సైజ్ సుంకాన్ని కూడా నిర్ణయించనున్నారు. 


2013లో తొలిసారి నింబూజ్‌ను పెప్సికో మార్కెట్లోకి విడుదల చేసింది. ఎటువంటి ఫిజ్ లేకుండా నిజమైన నిమ్మరసంతో తయారుచేసినట్టు వారు వివరించారు. ఆ తరువాత అది నిమ్మరసమా లేక పండరసమా అనే చర్చ మొదలైంది. 2015 మార్చిలో పిటిషనర్లు నింబూజ్ పై కేసును వేశారు. అప్పట్నించి కేసు నడూస్తూనే ఉంది. ఈ ఏప్రిల్ లో సుప్రీం కోర్టు తుది తీర్పు ఇవ్వనుంది.  


చాలా చిన్న అంశం సుప్రీంకోర్టు దాకా వెళ్లడంతో కొంత మంది నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఏదో ఒక రోజు ‘టమాటా పండా లేక కూరగాయ’ అనే అంశంపై కూడా సుప్రీంకోర్టులో వాదనలు జరిగే అవకాశం ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు.