ఉగాది రోజు ఉగాది పచ్చడి చేయడం ఎంత కచ్చితమో, పులిహోర (Prasadam Pulihora) చేయడం కూడా దాదాపు అంతే. తెలుగు వారి పండుగల్లో పులిహోరది ప్రత్యేక స్థానం. పులిహోరను ఎన్నో రకాలు తయారుచేస్తారు. నిమ్మకాయ పులిహోర, మామిడి కాయ పులిహోర, దబ్బకాయ పులిహెర, టమాటో పులిహోర, అటుకుల పులిహోర, చింతచిగురు పులిహెర... ఇలా ఎన్నిరకాలుగా చేసినా టేస్టీగానే ఉంటుంది. గుళ్లలో చేసే ప్రసాదం పులిహోర అంటే  ఎక్కువ మందికి ఇష్టం. కానీ ఇంటి దగ్గర మాత్రం అలా చేసుకోలేరు. ఇంట్లో ఇలా సులువుగా ప్రసాదం పులిహోర చేసుకోవచ్చు. రుచి అదిరిపోతుంది. 


కావాల్సిన పదార్థాలు
వండిన తెల్లన్నం - రెండు కప్పులు
చింతపండు - చిన్న ఉండ
ఆవాలు -ఒక టీస్పూను
మినపప్పు - ఒక టీ స్పూను
శెనగపప్పు - ఒక టీస్పూను
వేరుశెనగ పలుకులు - గుప్పెడు
నూనె - రెండు టేబుల్ స్పూన్లు
పచ్చిమిర్చి - రెండు
ఎండు మిర్చి - రెండు
కరివేపాకులు - గుప్పెడు
ఉప్పు - రుచికి సరిపడా
పసుపు - ఒక టీస్పూను 


పొడి కోసం
ఎండు మిర్చి - రెండు
ఆవాలు -ఒక టీస్పూను
మినపప్పు - ఒక టీ స్పూను
శెనగపప్పు - ఒక టీస్పూను
మెంతులు - పావు టీస్పూను
నువ్వులు - ఒక టీస్పూను


తయారీ ఇలా...


1. కళాయి స్టవ్ మీద పెట్టి వేడి చేయాలి. వేడెక్కాక ఎండు మిర్చి, ఆవాలు, మినపప్పు, శెనగపపప్పు ఒక్కో స్పూను వేసి వేయించాలి. మెంతులు పావు టీస్పూను వేయాలి. చివర్లో నువ్వులు వేసి వేయించాలి. అన్నింటినీ మిక్సీలో వేసి పొడి చేసుకుని పక్కనపెట్టుకోవాలి. 
2. అన్నం వండుకున్నప్పుడు ఒక చుక్క నూనె, ఉప్పు వేసి వండేయాలి. నూనె వేయడం వల్ల అన్నం పొడిపొడిగా వస్తుంది. 
3. చింతపండును నీళ్లలో నానబెట్టాలి. తరువాత బాగా పిండి పిప్పిని పడేయాలి. 
4. ఇప్పడు కళాయిలో ఆయిల్ వేసి వేడెక్కాక ఆవాలు, పల్లీలు, మినపప్పు, శెనగపప్పు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. కరివేపాకు, ఎండు మిర్చి కూడా వేసి వేయించాలి.అందులో చింతపండు రసం వేసి ఉడికించాలి.నూనె పైకి తేలేంత వరకు మరిగించాలి. 
5. ఇప్పుడు అందులో పసుపు, ఉప్పు వేసి కలపాలి. ముందుగా చేసిపెట్టుకున్న పొడిని కూడా వేసి కలపాలి. 
6. స్టవ్ కట్టేసి ఆ మిశ్రమంలో అన్నాన్ని కలుపుకోవాలి. అంతే ప్రసాదం పులిహోర సిద్ధమైనట్టే. 



Also read: షడ్రుచులను అందించే ఉగాది పచ్చడి తయారీ విధానం ఇలా


Also read: ఇలా రాగిదోశ చేస్తే వదిలిపెట్టకుండా తినేస్తారు, అధిక బరువు నుంచి మధుమేహం వరకు ఎన్నో రోగాలకు చెక్ పెట్టొచ్చు