రద్ధీగా ఉన్న న్యూయార్క్ నగర వీధులు...
రంగురంగుల లెహెంగాలో ఓ కుర్రాడు నెమలిలా ఆడుతుంటే చూపు తిప్పుకోలేకపోయారు చుట్టూ ఉన్న జనం.
అబ్బాయికి, అమ్మాయి డ్రెస్సులో డ్యాన్సు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అని అడిగితే అతను చెప్పే సమాధానం ఒక్కటే...
‘లెహెంగాలో డ్యాన్సు వేస్తే చూసేందుకు కనులవిందుగా ఉంటుంది, అందుకే నేను తక్కువ సమయంలో మీ అందరికీ పరిచయం అయ్యా’ అంటాడు. నిజమే అతను సాధారణంగా ప్యాంటు, షర్టులో చేస్తే మనమంతా ఎందుకు ఇప్పుడిలా ప్రత్యేకంగా చెప్పుకుంటాం?
ఎవరితను?
న్యూయార్క్‌లో ఉన్న వారికి ‘మెన్ ఇన్ స్కర్ట్స్’అంటే చాలు జైనీల్ మెహెతా గుర్తొచ్చేస్తారు. ఇప్పుడక్కడ ‘మెన్ ఇన్ స్కర్ట్స్’ అనేది ఒక బ్రాండుగా మారిపోయింది. అది హ్యాష్ ట్యాగ్ గా మారి ట్రెండయ్యింది కూడా. న్యూయార్క్ వీధుల్లో కుచ్చుల లెహెంగాలో జైనీల్ చిందేస్తే బాలీవుడ్ హీరోయిన్లు గుర్తుకు రావాల్సిందే. న్యూయార్క్ మీడియాకు జైనీల్ బాగా పరిచయం ఉన్న వ్యక్తిగా మారిపోయారు.అక్కడున్న అన్ని మీడియాలు ఇతనిపై కథనాలు ప్రచురించాయి. అమ్మాయిలతో దుస్తుల షాపింగ్ కు వెళ్లేందుకే ఇష్టపడని అబ్బాయిలు ఎంతో మంది. అలాంటిది వారి దుస్తులు వేసుకుని పబ్లిక్‌లో డ్యాన్సులు వేయడానికి చాలా ధైర్యముండాలి. అందుకేనేమో జైనీల్ మెహెతా తక్కువ సమయంలోనే గుర్తింపు సాధించారు.
సొంతూరు ఎక్కడ?
జైనీల్‌ది ముంబై. చిన్నప్పట్నించి క్లాసికల్ డ్యాన్సు నేర్చుకున్నారు. పదమూడేళ్ల వయసులో అమెరికా వలస వెళ్లారు. అక్కడే డ్యాన్సులో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి కొరియోగ్రాఫర్ గా కెరీర్ మొదలుపెట్టారు. ఏడేనిదేళ్ల వయసు నుంచే ఇలా లెహెంగాలో డ్యాన్సులు వేయడం మొదలుపెట్టానని చెబుతున్నారు జైనీల్. తనకు లెహెంగాల రంగులు, కుచ్చులు నచ్చుతాయని అందుకే అవి వేసుకుని డ్యాన్సులు చేయడం ప్రారంభించినట్టు చెబుతారు. మొన్నీ మధ్యనే అలియా భట్ సినిమా ‘గంగూబాయి కఠియావాడి’ సినిమాలోని ‘జుమె రె గోరి’ పాటకు డ్యాన్సు చేస్తే దాదాపు కోటి డబ్బై లక్షల మంది వీక్షించారు.
సామి సామి పాటకు ఇలా...
పుష్ప సినిమా తెలుగులో కన్నా హిందీలో సూపర్ హిట్ కొట్టింది. అందులోని సామి సామి పాట ఎంతగా పాపులర్ అయ్యిందో చెప్పక్కర్లేదు. హిందీ ‘సామి సామి’ పాటకు చక్కగా నాట్యం చేశారు జైనీల్. చూస్తే అలా చూస్తూ ఉండిపోవాలనిపించేలా ఉంది. ఇలాంటి ఎన్నో ఉమెన్ ఓరియంటెడ్ పాటలకు నర్తించి ‘మెన్ ఇన్ స్కర్ట్స్’గా మారుమోగి పోయారు.
లింగ సమానత్వం కోసం...
జెండర్ న్యూట్రలిటీకి పరోక్షంగా ఎంతో మద్ధతు ఇస్తున్నారు జైనీల్. అందుకే అతనికి వచ్చే మెసేజుల్లో దానికి సంబంధించే ఉంటాయి. ‘అమ్మాయిల డ్రెస్సు వేసుకుని ఇంత కాన్ఫిడెంట్ గా ఎలా డ్యాన్సు చేయగలుగుతున్నావ్? నువ్వు గ్రేట్’ అంటూ ఎన్నో మెచ్చుకోళ్లు అందుకుంటున్నారు. ‘పాజిటివ్ వైబ్స్ పంచడంలో నీ తరువాతే ఎవరైనా’ అంటూ అమ్మాయిలు రోజూ వందలాదిగా మెసేజులు పెడుతుంటారు.
ఆయన ఇన్ స్టా ఖాతా స్కర్టుతో చేసిన డ్యాన్సులతో నిండిపోయింది. కావాలంటే మీరూ ఓ లుక్కేయండి... కచ్చితంగా రీఫ్రెష్ అవుతారు.
Also read: మీకు ఇంజెక్షన్ అంటే భయమా? అయితే మీ భయం పేరిదే
Also read: శరీరంలో షుగర్ స్థాయిలు నియంత్రణలో లేకపోతే ఏమవుతుందో తెలుసా? జరిగేది ఇదే