చైనాలో మళ్లీ కరోనా కలవరం


కొవిడ్ పుట్టినిల్లు చైనాలో మరోసారి కరోనా వ్యాప్తి భయపెడుతోంది. జీరో కొవిడ్ పాలసీ తీసుకొచ్చి కొన్నాళ్ల పాటు బాగానే కట్టడి చేసినా వైరస్ ధాటికి ఆ చర్యలూ ఏం చేయలేకపోయాయి. ఉన్నట్టుండి చైనాలో మళ్లీ కేసుల సంఖ్య పెరగటం మొదలైంది. లాక్‌డౌన్‌లూ విధించుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు చైనా రాజధాని బీజింగ్‌ను వైరస్‌ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. బార్‌లు, షాపింగ్ మాల్స్‌, వీధుల్లో మాస్ టెస్టింగ్‌ చేపడుతున్నారు. ఫలితంగా ఒక్కసారిగా కేసుల సంఖ్య పెరిగిపోయింది. కమర్షియల్‌ హబ్‌గా పేరు తెచ్చుకుని షాంఘైలోనూ పెద్ద మొత్తంలో కరోనా పరీక్షలు చేస్తున్నారు. వారం రోజుల నుంచి బీజింగ్‌లో కొవిడ్ ఆంక్షల్ని కఠినతరం చేశారు. చావోయంగ్ ప్రాంతం ఇప్పటికే లాక్‌డౌన్ దిగ్భందంలో ఉంది. అంతర్జాతీయంగా చూస్తే చైనాలో ఇన్‌ఫెక్షన్ రేట్ తక్కువగానే ఉన్నప్పటికీ  అధ్యక్షుడు జిన్‌పింగ్ మాత్రం కొవిడ్ నిబంధల్ని పాటించటంలో ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించకూడదని చాలా గట్టిగానే హెచ్చరికలు పంపారట. వైద్యారోగ్య వ్యవస్థపై ఎలాంటి ఒత్తిడి పడకుండా 
జాగ్రత్త పడుతూనే పౌరుల్ని కాపాడుకోవాలని ఆదేశాలు జారీ చేశారు జిన్‌పింగ్. ముఖ్యంగా వృద్ధుల ప్రాణాలను సంరక్షించేందుకు చైనా గట్టిగానే ప్రయత్నిస్తోంది. ఇందుకోసం ఎంత కఠినంగా అయినా వ్యవహరించేందుకు సిద్ధపడుతోంది. 


బార్‌ కారణంగానే ఇన్ని కేసులు..? 


ఇటీవల అమాంతం కేసులు ఎందుకు పెరిగాయని ఆరా తీయగా వారంతా ఓ బార్‌కి, ఈ కేసుల పెరుగుదలకు సంబంధం ఉన్నట్టు తేలింది. వీరి కారణంగా ఇంకెంత మందికి వైరస్ వ్యాప్తి చెందింది అనేది తేల్చే పనిలో పడ్డారు చైనా అధికారులు. అయితే ఈ కరోనా బాధితుల్లో వైరస్ లోడ్‌ చాలా ఎక్కువగా ఉందని, ఇది క్రమక్రమంగా భారీగా కేసుల పెరుగుదలకు కారణమయ్యే ప్రమాదముందని అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఇది కరోనా కేసుల "ఎక్స్‌ప్లోజివ్‌"గా మారొచ్చని కలవర పడుతున్నారు. ప్రస్తుతానికి బాధితులందరినీ ఐసోలేషన్‌కు తరలించారు. వీరి ఆరోగ్య పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. కొత్త వేరియంట్‌ ఏమైనా వచ్చిందా..? మరో  వేవ్‌కు కారణమవుతుందా అనే కోణంలో పరిశోధనలు చేపడుతున్నారు. ఈ బార్‌కి వచ్చిన వారిలో 115 మంది కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. వీరితో 6 వేల మందికి డైరెక్ట్‌ లింక్ ఉండటం వల్ల వారందరినీ గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు అధికారులు. ఇది తెలిసినప్పటి నుంచి బీజింగ్ ప్రజలు వణికిపోతున్నారు. దాదాపు రెండున్నర కోట్ల మంది ఉన్న బీజింగ్‌లో అందరికీ పరీక్షలు నిర్వహించటం ఎంత కష్టమో ఊహించొచ్చు. అయినా సరే వెనక్కి తగ్గకుండా అందరికీ కచ్చితంగా కొవిడ్ టెస్ట్‌లు చేయాల్సిందేనన్న పట్టుదలతో ఉంది చైనా ప్రభుత్వం.