గత మూడేళ్లుగా కరోనాతోనే విలవిలలాడుతుంటే ఇప్పుడు మంకీపాక్స్ వచ్చి పడింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ 75 దేశాలలో 18000 పైగా కేసులు నమోదైనట్టు గుర్తించింది. అలాగే ఈ వైరస్ కారణంగా అయిదుగురు మరణించినట్టు చెప్పింది. అయితే ఈ మరణాలు ఆఫ్రికా దేశాల్లోనే సంభవించాయి. దీని వ్యాప్తి వేగంగా ఉండడంతో ‘ప్రపంచ ఆరోగ్య అత్యవసర పరిస్థితి’ని ప్రకటించింది. మంకీపాక్స్ కుటుంబంలో ఒకరికి వచ్చిందా... మిగతావారికి కూడా పాకే అవకాశం ఎక్కువ. అయితే కరోనాతో పోలిస్తే మాత్రం వ్యాప్తి చెందే తీవ్రత చాలా తక్కువనే చెప్పాలి. ఎప్పుడో అంతరించిపోయిన స్మాల్ పాక్స్ (మశూచి) కుటుంబానికి చెందిన వైరసే మంకీపాక్స్ కూడా. దీన్ని అరికట్టడానికి ఆరోగ్యసంస్థలు సర్వ విధాలా ప్రయత్నిస్తున్నాయి. మనదేశంలో కూడా నాలుగు మంకీ పాక్స్ కేసులు బయటపడ్డాయి. 


మగవారు జాగ్రత్త
మంకీపాక్స్ లైంగిక సంబంధాల వల్ల త్వరగా వ్యాప్తి చెందుతుంది. అందుకే ప్రపంచ ఆరోగ్యసంస్థ మగవారికి ప్రత్యేకంగా ఓ ప్రకటనను విడుదల చేసింది. తమని తాము కాపాడుకోవడానికి తక్షణ రక్షణ చర్యలు తీసుకోవాలని ప్రపంచఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనామ్ పిలుపునిచ్చారు. ముఖ్యంగా మగవారిలో ఎంతో మంది స్వలింగ సంపర్కులు ఉన్నారని, వారికే రిస్క్ ఎక్కువని ఆయన అభిప్రాయపడ్డారు. అంతేకాదు మగవారు త్వరగా తమ లైంగిక భాగస్వాములను మార్చేస్తూ ఉంటారని, దీనివల్ల వారిలోనే అధికంగా మంకీ పాక్స్ కేసులు బయటపడుతున్నాయని అన్నారు. ఎవరైనా కొత్త భాగస్వామి కలిస్తే వారి ఆరోగ్య వివరాలు కనుక్కుని, టెస్టులు చేయించుకున్నాకే వారికి దగ్గరవ్వాలని సూచించారు. మంకీ పాక్స్ వైరస్ వ్యాప్తి తగ్గేవరకు ఇలాంటి శారీరక సంబంధాలకు దూరంగా ఉండడం చాలా ఉత్తమమైన ఆలోచన అని అన్నారు. 


ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆరోగ్యనిపుణులు ముక్తకంఠంతో చెబుతున్న విషయం ‘ సెక్స్ సమయంలో మంకీపాక్స్ వ్యాపిస్తోంది, తెలియని వారితో వన్ నైట్ స్టాండ్ లు మానుకోవాలి, లైంగిక సంబంధాలు తగ్గించుకోవాలి’ అని చెబుతున్నారు. 


మంకీపాక్స్ సోకిన వ్యక్తితో లైంగిక సంబంధాన్ని పెట్టుకున్నా, వారి దుస్తులను వేసుకున్నా, వారి బెడ్ షీట్లను ఉపయోగించినా ఆ వైరస్ ఎవరికైనా సోకుతుందని ప్రపంచఆరోగ్య సంస్థ ప్రకటించింది. పిల్లలు, గర్భిణిలకు ఈ వైరస్ సోకితే ప్రమాద తీవ్రత పెరుగుతుందని హెచ్చరించింది. 


మనదేశంలో...
ఇప్పటివరకు మనదేశంలో నాలుగు మంకీ పాక్స్ కేసులను నిర్ధారించారు. కేరళలో మూడు, ఢిల్లీలో ఒక కేసు బయటపడింది. వైరస్ సోకిన వ్యక్తిని ఐసోలేషన్లో ఉంచుతున్నారు. అతనితో కాంటాక్ట్ అయిన వారిని కూడా 21 రోజుల పాటూ ఐసోలేషన్లో ఉంచుతున్నారు. 


Also read: కిడ్నీ స్టోన్‌లతో బాధపడుతున్న వారు తినకూడనివి ఇవే, ఇక తినాల్సినవి ఏంటంటే


Also read: బీట్‌రూట్ చపాతీ ఇలా చేసి పెడితే పిల్లలకు ఎంతో ఆరోగ్యం, రక్తహీనత రమ్మన్నా రాదు













గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.