రక్త హీనత సమస్య పిల్లల్లో, మహిళల్లో అధికంగా కనిపిస్తుంది. దీనికి మంచి పరిష్కారం బీట్‌రూట్. దీన్ని తినడం వల్ల రక్తహీనత సమస్య త్వరగా పోతుంది. కాకపోతే దాని టేస్టు ఎక్కువ మందికి నచ్చక తినడం మానేస్తారు. ముఖ్యంగా పిల్లలు బీట్‌రూట్ ను చూస్తేనే ముఖం ముడుచుకుంటారు. వారికి ఇలా బీట్‌రూట్ చపాతీ చేసి పెడితే వదలకుండా తినేస్తారు. 


కావాల్సిన పదార్థాలు
బీట్‌రూట్ తరుగు - ముప్పావు కప్పు
గోధుమపిండి - ఒకటిన్నర కప్పు
వెల్లుల్లి రెబ్బలు - రెండు
అల్లం - చిన్న ముక్క
నూనె - రెండు స్పూనులు
పచ్చి మిర్చి తరుగు - ఒక స్పూను
నెయ్యి - ఒక స్పూను
ఉప్పు - రుచికి సరిపడా 
మిరియాలు - నాలుగు


తయారీ ఇలా
1. స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి. నూనె వేడెక్కాక బీట్‌రూట్ ముక్కలు వేసి వేయించాలి. 
2. ఓ అయిదు నిమిషాలు వేయించాక ఉప్పు, మిరియాలు, అల్లం తరుగు, పచ్చి మిర్చి తరుగు, వెల్లుల్లి తరుగు వేసి వేయించాలి. 
3. పచ్చి వాసన పోయేదాకా అన్నీ వేయించాలి. 
4. చల్లారాక వాటిని మిక్సీలో వేసి మెత్తగా ప్యూరీలా చేసుకోవాలి. 
5. ఇప్పుడు ఒక గిన్నెలో గోధుమపిండి వేసి నీళ్లు, నూనె, బీట్ రూట్ ప్యూరీ వేసి బాగా కలపాలి. 
6. గాలి తగలకుండా మూత పెట్టి 20 నిమిషాలు పక్కన పెట్టాలి. 
7. తరువాత చిన్న ఉండలుగా చుట్టి చపాతీలుగా ఒత్తుకోవాలి. 
8. వాటిని పెనంపై నెయ్యి వేసి చపాతీలను కాల్చుకోవాలి. 
9. పైన నెయ్యి రాసి పుదీనా చట్నీతో తింటే బీట్ రూట్ పరాటా రుచి మామూలుగా ఉండదు. 


బీట్‌రూట్లో ఎర్రగా ఉంటుంది. అందుకే దీన్ని తింటే రక్త హీనత సమస్య పోతుంది. దీన్ని తినడం వల్ల కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ ఎ, సి, ఐరన్ అధికంగా అందుతాయి. అందుకే బీట్‌రూట్ పిల్లలకు చాలా మేలు చేస్తుంది. తరచూ ఈ కూరగాయను తినడం వల్ల  జ్ఞాపకశక్తి కూడా పెరగుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. మెదడుకు రక్త సరఫరా సక్రమంగా జరుగుతుంది, కాబట్టి మెదడు ఆరోగ్యం బావుంటుంది. బీట్ రూట్ తినడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది. హైబీపీ వంటి సమస్యలు కూడా దూరమవుతాయి. గుండె పనితీరు మెరుగుపడుతుంది. దీన్ని ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి గర్భిణీలకు బీట్ రూట్ తింటే ఎంతో మేలు జరుగుతుంది. 


Also read: షుగర్ తగ్గాలా? అయితే కాఫీ, టీలు మాని గ్రీన్ టీ తాగండి, చెబుతున్న కొత్త పరిశోధన


Also read: గర్భం కోసం ప్రయత్నిస్తున్నారా? అండం విడుదలయ్యే రోజేదో ఇలా తెలుసుకుంటే, గర్భం ధరించడం సులువు