ప్రపంచంలో ఎక్కువ శాతం మంది మధుమేహంతో బాధపడుతున్నారు. దాన్ని తగ్గించుకునేందుకు తీపి పదార్థాలు తినడం మానేయడం, ప్రాసెస్డ్ ఆహారం మానేయడం వంటివి చేస్తుంటారు. వాటితో పాటూ కెఫీన్ ఉండే పదార్థాలు కూడా తగ్గించుకోమని చెబుతున్నాయి అధ్యయనాలు. అలాగే రోజూ ఉదయం కాఫీ, టీలకు బదులుగా గ్రీన్ టీ తాగితే కొన్ని రోజుల్లోనే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులోకి వస్తాయని తేల్చింది తాజాగా చేసిన ఓ పరిశోధన. ఈ పరిశోధన తాలూకు వివరాలు ‘కరెంట్ డెవలప్‌మెంట్స్ ఇన్ న్యూట్రిషన్’జర్నల్ లో ప్రచురించారు. నాలుగు వారాల పాటూ గ్రీన్ టీని తాగడం వల్ల పొట్ట ఆరోగ్యం బావుంటుందని ఈ కొత్త అధ్యయనం తేల్చింది.
రోజుకు రెండు కప్పులు...
గ్రీన్ టీ రోజూ తాగడం వల్ల కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలను తగ్గించడంతో ముడిపడి ఉందని గుర్తించారు. అమెరికన్లలో మూడింట ఒక వంతు మంది మెటబాలిక్ సిండ్రోమ్ అనే సమస్యతో బాధపడుతున్నారు. వారికి గ్రీన్ టీ చాలా మేలు చేసినట్టు గుర్తించారు. క్లినికల్ ట్రయల్స్‌లో భాగం 40 మందిపై పరిశోధనలు చేశారు. వారిలో కొన్ని రోజుల్లోనే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులోకి రావడం గమనించారు. పొట్ట దగ్గర కొవ్వు అధికంగా పట్టడం, అధిక రక్తపోటు, మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గడం, రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరగడం, ట్రైక్లిజరైడ్స్ అనే చెడు కొవ్వు రక్తంలో పేరుకుపోవడం వంటి వాటన్నింటికీ గ్రీన్ టీ చెక్ పెడుతుంది. మధుమేహం ఉన్న ఉన్న వారు రోజులో ఒక కప్పు లేదా రెండు కప్పుల గ్రీన్ టీ తాగితే చాలు. అంతకుమించి అతిగా తాగినా ఇతర సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
గ్రీన్ టీని అధిక బరువు తగ్గేందుకే అనుకుంటారు చాలా మంది కానీ దీన్ని తాగడం వల్ల శరీరం మొత్తానికి ఎంతో మేలు జరుగుతుంది. మెటబాలిక్ సిండ్రోమ్ రాకుండా అడ్డుకుంటుంది. పేగుల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. గ్రీన్ టీని కొన్ని రోజుల పాటూ తాగిన తరువాత కొంత మంది పెద్దల్లో ఉపవాసానికి ముందు రక్తంలోని చక్కెర స్థాయిలను కొలిచారు. వారందరికీ ఆ చక్కెర స్థాయిలు తగ్గాయి. సాధారణ స్థితికి వచ్చాయి. దీన్ని బట్టి గ్రీన్ టీ మధుమేహం ఉన్నవారికి చాలా మేలు చేస్తుందని, రోజూ తాగితే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను కంట్రోల్ లో ఉంచుతుందని తేలింది.
మీకూ షుగర్ వ్యాధి ఉన్నట్లయితే కాఫీ, టీలకు బదులు గ్రీన్ టీ తాగడం అలవాటు చేసుకుంటే కొన్ని రోజుల్లోనే షుగర్ వ్యాధి అదుపులోకి వస్తుంది.
Also read: చూయింగ్ గమ్ నములుతూ నెలకు రూ. 67,000 సంపాదిస్తోన్న యువతి
Also read: గర్భం కోసం ప్రయత్నిస్తున్నారా? అండం విడుదలయ్యే రోజేదో ఇలా తెలుసుకుంటే, గర్భం ధరించడం సులువు
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.