APJ Abdul Kalam Death Anniversary: 


మిసైల్‌ మ్యాన్‌గా, భారత రాష్ట్రపతిగా అంతకు మించి ఓ గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషిగా చరిత్రలో నిలిచిపోయారు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. ఆయన వెళ్లిపోయినా, ఆయన తాలూకు స్ఫూర్తి మాత్రం చిరకాలం నిలిచిపోతుంది. శాస్త్రవేత్తగా ఆయన మన దేశానికి అందించిన విజ్ఞానం అపారం. అందుకే ఆయనను భారతరత్న కూడా వరించింది. 2015లో జులై 27న ఆయన ఈ లోకం వదిలి వెళ్లిపోయారు. ఈ వర్ధంతిసందర్భంగా ఆయన జీవితంలోని అనేక విశేషాల్ని, కొందరికే తెలిసిన నిజాల్ని ఓ సారి  గుర్తు చేసుకుందాం. 


ఏపీజే అబ్దుల్‌ కలాం-ఆసక్తికర విషయాలు


1.అబ్దుల్ కలాం పూర్తి పేరు అవుల్ పకీర్ జైనులబ్దీన్ అబ్దుల్ కలాం. ఇంత పెద్ద పేరు పలికేందుకు కష్టంగా ఉందని కాస్త షార్ట్‌గా ఏపీజే అబ్దుల్క లాం (APJ Abdul Kalaam)అని పిలుచుకుంటారంతా.


2.భారత్‌కు తొలి బ్యాచ్‌లర్ (అవివాహిత) రాష్ట్రపతి అబ్దుల్ కాలం. ముస్లిం కుటుంబంలోనే జన్మించిన్పపటికీ ఎప్పుడూ మాంసం ముట్టుకోలేదు. పూర్తి శాకాహారిగానే జీవించారు. 


3.అబ్దుల్ కలాంకు మొత్తం 48 డాక్టరేట్లు వచ్చాయి. భారత్‌లోనే కాకుండా విదేశాలకు చెందిన యూనివర్సిటీలు కూడా కలాంను గౌరవ డాక్టరేట్‌లతో సత్కరించాయి. 


4. భారత్ తయారు చేసిన పలు మిసైల్స్‌ వెనక ఉన్న మాస్టర్‌మైండ్‌ అబ్దుల్ కలాందే. అగ్ని, పృథ్వి లాంటి క్షిపణులు తయారు చేయటంలో ఆయన కీలక పాత్ర పోషించారు. వాటి అభివృద్ధి నుంచి ప్రయోగించేంత వరకూ అన్నింట్లోనూ ఆయన మేధాశక్తి ఉంది. అందుకే అబ్దుల్ కలాంను మిసైల్ మ్యాన్‌గా పిలుస్తారు. శక్తి ఉన్న వాళ్లెవరైనా సరే గౌరవాన్ని కోరుకుంటారని, భారత్ శక్తిమంతమైందని తప్పకుండా అందరూ గౌరవిస్తారని అంటూ ఉండేవారు. 


5. భారత్‌లో అత్యున్నత పురస్కారాలుగా భావించే పద్మభూషణ్, పద్మ విభూషణ్‌తో సహా భారత రత్న కూడా సొంతం చేసుకున్నారు అబ్దుల్ కలాం. 1981లో పద్మభూషణ్, 1990లో పద్మ విభూషణ్ వరించగా, 1997లో భారత రత్న దక్కింది. 


6. పిల్లలకు అత్యంత ఇష్టమైన వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు అబ్దుల్ కలాం. ప్రసంగాలతో, సూక్తులతో చిన్నారుల్లో స్ఫూర్తి నింపారు. యువత ఆలోచనలు మారాలని కోరుకున్న వారిలో ఆయన ఒకరు. సైన్స్ ఎగ్జిబిషన్లు, స్పోర్ట్స్‌ డే సందర్భంగా స్కూల్స్‌కి వెళ్లి అక్కడి పిల్లల్ని ప్రోత్సహించే వాళ్లు. ఆయన ఈమెయిల్ ఐడీని పిల్లలకు ఇచ్చి ఎవరైనా తనకు మెయిల్ చేయవచ్చని చెప్పేవారు. 


7. అబ్దుల్ కలాం రాసిన ఆటోబయోగ్రఫీ 13 భాషల్లో అనువాదమైంది. మొదట ఇంగ్లీష్‌లో పబ్లిష్ చేశారు. ఆయన జీవిత విశేషాలు తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలోనూ ఉండటం వల్ల క్రమంగా మిగతా భాషల్లోకి అనువదించారు. ఇప్పటి వరకూ ఆయన పేరుమీద 6 బయోగ్రఫీలు వచ్చాయి. 


Also Read: Electricity Bill: ఒక్క నెల కరెంటు బిల్లు చూసి ఆస్పత్రిలో అడ్మిట్ అయిన యజమాని, బిల్లు ఎంతంటే?